మాథ్యూ పార్కర్ (1504–1575) ఆంగ్ల ఆర్చ్బిషప్ ఆఫ్ కెంటర్బరీగా పేరుగాంచారు. ఈయన ఇంగ్లాండ్ రిఫార్మేషన్ సమయంలో, ముఖ్యంగా ఇంగ్లాండ్ చర్చిలోని సిద్ధాంతాలు, ప్రార్థనా విధానాల స్థాపనలో గొప్ప పాత్ర పోషించారు. ఆర్చ్ బిషప్, సంస్కరణాత్మక నాయకుడు, వేదాంతవేత్త, అనువాదకుడు, రచయిత, సిద్ధాంత స్థిరకర్త, మతపండితుడు.

నేటి విశ్వాస నాయకుడు
మాథ్యూ పార్కర్,
పరలోక పిలుపు : 17 మే 1575,
ఆర్చ్ బిషప్, సంస్కరణాత్మక నాయకుడు, వేదాంతవేత్త, అనువాదకుడు, రచయిత, సిద్ధాంత స్థిరకర్త, మతపండితుడు.

మాథ్యూ పార్కర్ (1504–1575) ఆంగ్ల ఆర్చ్బిషప్ ఆఫ్ కెంటర్బరీగా పేరుగాంచారు. ఈయన ఇంగ్లాండ్ రిఫార్మేషన్ సమయంలో, ముఖ్యంగా ఇంగ్లాండ్ చర్చిలోని సిద్ధాంతాలు, ప్రార్థనా విధానాల స్థాపనలో గొప్ప పాత్ర పోషించారు. ఈయన 1504 ఆగస్టు 6న, ఇంగ్లాండ్ లోని నార్విచ్ నగరంలో విలియం, ఆలిస్ పార్కర్ దంపతులకు జన్మించారు. మాథ్యూ అతి చిన్నవయస్సులోనే తన తండ్రి మరణించాడు. ఆపై నార్విచ్ లోనే క్లెరిక్స్ దగ్గర విద్యాబోధన పొంది, 1520లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ ఈయన మార్టిన్ లూథర్ రచనలు చదివి, సంస్కరణ వాదాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ప్రీస్టులు కూడా వివాహం చేసుకోవచ్చని భావిస్తూ, ఆ సిద్ధాంతాలకు మద్దతుగా ఉన్నాడు. 1525లో పట్టభద్రుడై, 1527లో డీకన్ మరియు పాస్టరుగా అభిషేకితుడు అయ్యాడు. అనంతరం కార్పస్ క్రిస్టీ కళాశాలలో ఫెలోగా కొనసాగాడు. 1533లో ఈయనకు ప్రసంగించే ఆధిక్యం లభించడంతో, ప్రజాదరణ పొందిన బోధకుడయ్యాడు.

పార్కర్, ఆన్న్ బొలిన్ యొక్క ఆధ్యాత్మిక బోధకుడయ్యాడు. ఆమె ప్రభావంతోనే, 1535లో స్టోక్-బై-క్లేర్ డీన్ గా నియమించబడ్డాడు. అక్కడ ఈయన కొత్త నియమ నిబంధనలు ప్రవేశపెట్టి, విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి, ఒక గ్రామర్ పాఠశాలను స్థాపించి కళాశాల పునరుత్థానానికి కృషి చేశాడు. 1536లో ఆన్న్ బొలిన్ అరెస్ట్కి ముందు, ఆమె తన కుమార్తె (భవిష్యత్తు రాణి ఐన) ఎలిజబెత్ను పార్కర్ సంరక్షణకు అప్పగించింది. ఈ బాధ్యతను పార్కర్ తన జీవితాంతం విశ్వాసంగా నిర్వర్తించాడు. 1538లో డాక్టర్ ఆఫ్ డివినిటీ పట్టభద్రుడయ్యాడు. తరువాత హెన్రీ8 కు ఆధ్యాత్మిక బోధకుడయ్యాడు. 1541లో ఈలీలో రెండవ ప్రీబెండ్ స్థానానికి నియమించబడటంతో రాజు మద్దతు పొందాడు. 1544 డిసెంబరులో, హెన్రీ8 సూచనతో పార్కర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కార్పస్ క్రిస్టీ కాలేజీ మాస్టర్ గా ఎన్నికయ్యాడు. కాలేజీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి, భవనాలను మరమ్మతు చేసి, కొత్త స్కాలర్షిప్లను ఏర్పాటు చేశాడు. అందువల్ల ఈయనను ఆ కాలేజీ రెండవ స్థాపకుడు అని గుర్తించారు. 1545 జనవరిలో, ఈయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అయ్యాడు. ఎడ్వర్డ్6 పాలనలో, 1545 చట్టం ప్రకారం కాలేజీల రద్దును ఎదుర్కొంటున్న కాలేజీలను రక్షించడంలో పార్కర్ కీలక పాత్ర పోషించాడు. కానీ మేరీ1 పాలనలో, పార్కర్ మొత్తం స్థానాలను కోల్పోయాడు. అయినా దేవుని దయతో చావునుండి తప్పించబడ్డాడు. ఎలిజబెత్1 రాణిగా అధికారం చేపట్టిన తరువాత, పార్కర్ ను కంటర్ బరీ ఆర్చ్ బిషప్ గా నియమించింది.

పార్కర్ క్రైస్తవ తత్వశాస్త్రానికి చేసిన ముఖ్యమైన కృషి వల్ల విశేషంగా పేరుగాంచారు, ముఖ్యంగా ఇంగ్లాండ్లో ప్రొటెస్టెంట్ సంస్కరణ ఉద్యమం సంబంధిత పరిణామాలలో ఈ యన పాత్ర కీలకమైనది. తత్వశాస్త్రం, ఆరాధనా పద్ధతులు, బైబిలు పాండిత్యములో ఈయన చేసిన కృషి ఎలిజబెతన్ యుగంలో ముఖ్యపాత్ర వహించింది. ఈయనకు విశేషంగా గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమైనది, (1568) బిషపుల బైబిల్ అనగా ” మాథ్యూ పార్కర్ బైబిల్” చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ను ఉన్నతంగా ప్రతిబింబించడానికి ఉద్దేశించబడింది. ఈయన (1572) “డి ఆంటిక్విటేటె ఎక్లేసియే కాంటువరియెన్సిస్” అనే రచన రాశారు, దీనిలో కాంటర్బరీ చర్చి, రోమ్ పాపత్వం నుండి స్వాతంత్ర్యాన్ని ఉద్ఘాటించారు. అలాగే, ఎలిజబెతన్ మతపరమైన పరిష్కారానికి అనుగుణంగా బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ పునఃసమీక్షనలోనూ, త్రైపదముల ధర్మవిధానములు ప్రోత్సహించడంలోనూ ఈయన కీలక పాత్ర పోషించారు.

ఇంగ్లాండ్ లో ప్రొటెస్టెంట్ గుర్తింపును స్థిరపరచడంలో, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ యొక్క ప్రొటెస్టంట్ స్వభావాన్ని రక్షిస్తూ తత్వవేత్తగా ఆయన రచనలు ప్రముఖమైనవి. అలాగే, ప్రాచీన క్రైస్తవ గ్రంథాల పట్ల ఈయన చేసిన పండితకృషి కూడా మతపరమైన వారసత్వాన్ని నిలిపింది.

పార్కర్ 70 సంవత్సరాల వయసులో, లండన్, లాంబెత్ ప్యాలెస్ లో మరణించారు — ఇది కాంటర్బరీ ఆర్చ్ బిషప్ అధికార నివాసం. రాణి ఎలిజబెత్ 1 పాలనలో ఈయన 16 సంవత్సరాల పాటు ఆర్చ్ బిషప్గా సేవలందించినప్పటికీ, ఈయనను లాంబెత్ పారిష్ చర్చ్ ఆవరణలో సమాధి చేశారు. అయితే ఆంగ్ల పౌరయుద్ధ సమయంలో ఈ సమాధిని ధ్వంసం చేశారు. అనంతరం, 18వ శతాబ్దంలో ఈయన దేహావశేషాలు తిరిగి కనుగొనబడి, పునఃసంస్కరించబడ్డాయి.

జాన్ మైఖేల్, రాజమండ్రి.