మే 30, 1431

ఈ రోజు ఫ్రెంచ్ సైనికాధికారి జోన్ ఆఫ్ ఆర్క్ ను పురుష వస్త్రాలు ధరిస్తుందన్న నెపంతో గుంజకు కట్టి సజీవ దహనం చేశారు. 1431 మార్చి నెలలోని విచారణలో ఆమె కేథోలిక సంఘ ఆచారాలను పాటించటం లేదని ఆమెపై మతభ్రష్ట కేసు నమోదు చేసి, ఇకపై ఎప్పుడూ స్త్రీ వేషధారణ లోనే ఉండాలని ఆజ్ఞాపించారు. ఆమె అందుకు ఒప్పుకుంది. ఐతే కొన్ని రోజుల తర్వాత మరల పురుష వేషం వేసిందన్న అభియోగంతో ఆమెను అధికారులకు అప్పగించి, మరణశిక్ష విధించారు.

1453, మే 29

రవి అస్తమించని రోమ్ సామ్రాజ్య కీర్తి శిఖరంలో మకూటయమానంగా ఉన్న
కాన్స్టాంటినోపుల్ మహా నగరం కుప్పకూలిన రోజు. నాటి రోమ్ సామ్రాజ్యాధినేత కాన్స్టెంటైన్ క్రీ.శ. 324లో స్థాపించిన రాజధాని నగరమిది. రెండో సుల్తాన్ మహమ్మద్ నాయకత్వంలోని ఒట్టోమన్ సైన్యం ఏప్రిల్ 6న ఈ నగరాన్ని ముట్టడి చేసింది. యుద్ధం యాభై మూడో రోజున, 1453 మే 29న శత్రు సైన్యం స్వాధీనం చేసుకోవడంతో ఈ నగర వైభవ చరిత్ర ముగిసిపోయింది.

మే 28, 1403

ఈరోజు జాన్ విక్లీఫ్ సిద్ధాంతాలను వ్యాపింప చేస్తున్న జాన్ హస్ మొదలైన వారికి జర్మన్ యునివర్సిటీ పండితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

మే 27, 1564

ఫ్రెంచ్ క్రైస్తవ వేదాంతి, క్రైస్తవ సంఘ సంస్కరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన మేధావి, కాల్వినిజంకు ఆద్యుడు జాన్ కాల్విన్ మహిమలోకి ప్రవేశించిన రోజు. దేవుని పనిలో అహర్నిశలు శ్రమించిన కాల్విన్ చివరిగా 1558లో జ్వరంతో అనారోగ్యం పాలయ్యాడు. తన “ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిలీజియన్”ను అనారోగ్యంలోనే పునర్విమర్శ చేసిన కాల్విన్ ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది. కొంతకాలం శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డ కాల్విన్ చివరికి తన యాభై నాల్గవ ఏట ప్రభువు పిలుపు అందుకున్నాడు. ప్రాటెస్టెన్ట్ క్రైస్తవ ఆలోచన పైన కాల్విన్ చెరగని ముద్ర వేశాడు.

మే 26, 1521

జర్మనీలోని వర్మ్స్ నగరంలో నాటి ఐదో చార్ల్స్ చక్రవర్తి మార్టిన్ లూథర్ కి వ్యతిరేఖంగా శాసనం జారీ చేసిన రోజు. దీనినే ఈడిక్ట్ ఆఫ్ వర్మ్స్ లేక వర్మ్స్ శాసనం అంటారు. లూథర్ రచనల్ని నిషేధిస్తూ, ఆయన్ని రాజద్రోహిగా ప్రకటిస్తూ చేసిన శాసనం ఇది. లూథర్ ను నిర్బంధించి రాజు ముందు నిలబెట్టాలన్నది శాసనం. ఈ శాసనాన్ని గట్టిగా అమలు చేయలేకపోయినా ఈ శాసనం వల్ల ఆ తర్వాత లూథర్ తన కదలికల్ని నియంత్రించుకోవాల్సి వచ్చింది. కాలక్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మార్టిన్ లూథర్ నాటి మతాధిపతి పోప్ కు వ్యతిరేఖంగా తిరుగుబాటు చేసి సంఘ సంస్కరణకు నాంది పలికాడన్న చరిత్ర మనకు విదితమే.

మే 25, 1805

ఈ రోజు ప్రఖ్యాత క్రైస్తవ అపాలజిస్ట్, తాత్వికుడు విలియం పాలే అమెరికాలోని లింకన్షైర్ లో పరమపదించిన రోజు. ప్రకృతిలో ఉన్న నిర్మాణ క్రమం ఆధారంగా ఇతడు ఆస్తిక సమర్థనా వాదాన్ని రూపొందించాడు. మానవ శరీర నిర్మాణంలోని సంక్లిష్టత, విశ్వంలోని నిర్మాణ సంక్లిష్టత దేవుని ఉనికిని నిరూపించే సిద్ధాంతాలను సూత్రీకరించాడు పాలే. ఈయన సూత్రీకరించిన “గడియారం—నిర్మాణకుడు” ఉదాహరణ విశ్వ విఖ్యాతమయ్యింది.

మే 24, 1844

ఏక తంతి టెలిగ్రాఫ్ పద్ధతిని కనిపెట్టిన శామ్యూల్ ఎఫ్. బి. మోర్స్ మొదటి సారి దాన్ని ప్రదర్శించింది ఈ రోజే. అమెరికా సుప్రీం కోర్టు నుంచి బాల్టిమోర్ కి ఆయన మొట్టమొదటి సారి టెలిగ్రాం సందేశం పంపారు. సంఖ్యాకాండం 23.23 లోని “దేవుని కార్యాలు” (What God has wrought) అనే వాక్యం ఆయన మోర్స్ కోడ్ ద్వారా మొదట పంపిన సందేశం.

1738 మే 24

లండన్‌లోని ఆల్డర్స్‌గేట్ స్ట్రీట్‌లో ఈ రోజు జరిగిన మొరేవియన్ సమావేశం జరిగింది. అందులో రోమా పత్రిక పైన లూథర్ రాసిన వ్యాఖ్యానానికి ముందు మాట చదువుతుండగా విన్న జాన్ వెస్లీ అక్కడే తన “హృదయం మండినట్లు” భావించాడు. ఈ సంఘటన అతన్ని గొప్ప ఆత్మల సంపాదకునిగా మార్చేసింది. మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ మారుమనస్సు పొందిన రోజు ఇది.

మతమార్పిడి నిరోధక చట్టాల్ని రద్దు చేయండి

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశమంతటా సాధారణ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే క్రైస్తవులపై, విశ్వాసులపై అన్యాయంగా అరెస్టులుకు, ఇబ్బందులకు కారణమైన మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దుచేయాలని యూకే కు చెందిన క్రైస్తవ సంస్థ—రిలీజ్ ఇంటర్నేషనల్ సి.యి.ఓ. పాల్ రాబిన్సన్ డిమాండ్ చేశారు.

అస్సాంలో క్రైస్తవ ప్రార్ధనలపై నిఘా

అస్సాంలోని ఒక క్రైస్తవ హక్కుల సంస్థ ఆ రాష్ట్ర పోలీసులు సంఘాల్లోనికి చొరబడి సమాచారం సేకరించడంపై కలవరం వ్యక్తపరిచింది. ఇది విశ్వాసులను భయపెట్టదలిచే ఒక గూడచర్య పనిగా అభిప్రాయపడింది. రాష్ట్ర యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం (యు.సి.ఎఫ్.) వారు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ అసాధారణ గూఢచార పనిని తక్షణం నిలిపివేయాలని జిల్లా కమిషనర్ ను కోరారు.