థామస్ జొనాథన్ "స్టోన్ వాల్" జాక్సన్ (1824–1863) ఒక ప్రసిద్ధ కాన్ఫెడరేట్ జనరల్గాను,  సైనిక నైపుణ్యంతో పాటు ధృఢమైన క్రైస్తవ విశ్వాసంతోనూ చరిత్రలో నిలిచిపోయారు. జనరల్, క్రైస్తవ సైనిక నాయకుడు, విద్యావేత్త.

నేటి విశ్వాస నాయకుడు
థామస్ జోనాథన్ జాక్సన్,
పరలోక పిలుపు : 10 మే 1863,
జనరల్, క్రైస్తవ సైనిక నాయకుడు, విద్యావేత్త.

థామస్ జొనాథన్ “స్టోన్ వాల్” జాక్సన్ (1824–1863) ఒక ప్రసిద్ధ కాన్ఫెడరేట్ జనరల్గాను, సైనిక నైపుణ్యంతో పాటు ధృఢమైన క్రైస్తవ విశ్వాసంతోనూ చరిత్రలో నిలిచిపోయారు. అమెరికా పౌరయుద్ధం సమయంలో ఈయన ధైర్యవంతమైన నాయకత్వం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. యుద్ధంలో జాక్సన్ తన సైన్యంతో అడ్డుగా రాయిలాగా నిలబడి నిలకడగా పోరాడినందుకే ఈయనను “స్టోన్వాల్ జాక్సన్” అని పిలుస్తారు.

జాక్సన్ 1824 జనవరి 21న వర్జీనియాలోని క్లార్క్స్ బర్గ్ లో జన్మించాడు. ఈయన జూలియా – జొనాథన్ జాక్సన్ దంపతులకు జన్మించిన మూడవ సంతానం. చిన్న వయసులోనే తండ్రి, సోదరి టైఫాయిడ్ కారణంగా మరణించగా, తరువాత తల్లి కూడా మరణించారు. ఇలా అనేక కష్టాలను ఎదుర్కొంటూ, వేరువేరు బంధువుల వద్ద నివసిస్తూ, చివరకు జాక్సన్ మిల్లో ప్రదేశములో తన అంకుల్ వద్ద స్థిరపడ్డాడు. అక్కడ కష్టపడుతూ రాత్రిళ్లు చదువుకొని, తనను తానే అభివృద్ధి చేసుకున్నాడు. అంతేకాకుండా ఒక బానిసకు రహస్యంగా విద్యను బోధించడం ద్వారా తన సహానుభూతి చూపించాడు. 1842లో జాక్సన్ ను అమెరికా మిలిటరీ అకాడమీ అయిన వెస్ట్ పాయింట్ లో చేర్చుకున్నారు. విద్యానేపథ్యం బలహీనంగా ఉన్నప్పటికీ, కృషితోనే 1846లో 17వ ర్యాంకుతో పట్టభద్రుడయ్యాడు. మెక్సికన్-అమెరికన్ యుద్ధంలో పాల్గొని రెండు సార్లు పదోన్నతిని పొందాడు. ఈ సమయంలో ఈయన నైతిక స్థిరత్వం, ధైర్యసాహసాలు గుర్తింపు పొందాయి.

మెక్సికన్ యుద్ధానంతరం ఫ్లోరిడాలో కొంతకాలం సేవలందించి, 1851లో వర్జీనియా మిలిటరీ ఇన్స్టిట్యూట్ లో అధ్యాపకునిగా నియమితులయ్యాడు. ఈయన బోధనాశైలి కఠినంగా ఉండి విద్యార్థులకు నచ్చకపోయినప్పటికీ, తన బాధ్యతకు నిబద్ధుడయ్యాడు. జాక్సన్ దాస్య వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించకపోయినప్పటికీ, దాసుల పట్ల దయామయంగా ప్రవర్తించాడు. ఆఫ్రికన్ అమెరికన్లకు ఆదివారం పాఠశాలను ప్రారంభించి, మానవతా దృష్టితో పని చేశాడు.

పౌరయుద్ధం సమయంలో జాక్సన్ అనేక విజయాలను సాధించాడు. బుల్ రన్ యుద్ధం, 1862 నాటి వ్యాలీ క్యాంపెయిన్, హార్పర్స్ ఫెర్రీ, ఫ్రెడరిక్స్ బర్గ్ మొదలైన యుద్ధాల్లో తన నాయకత్వ నైపుణ్యం చాటుకున్నారు. చాన్సెలర్స్ విల్లే యుద్ధంలో ఈయన వ్యూహాత్మక మెలకువ ముఖ్యపాత్ర పోషించింది. అయితే అదే యుద్ధంలో గాయపడి, న్యుమోనియా వల్ల మరణించాడు. జాక్సన్ జీవితమంతా తన క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విజయాలన్నింటినీ దేవుని ఆశీర్వాదంగా భావించి, నిరంతరం ప్రార్థనలో ఉండేవాడు. ఈయన నీతి, ప్రార్థన జీవితం, బైబిల్ అధ్యయనం మరియు నమ్మకత గల నాయకత్వం తన సైనికుల ఆదరణను పొందింది. గాయాల అనంతరం తన దివ్య నిర్ణయాన్ని ఇలా వ్యక్తపరిచాడు. “దేవుడు సెలవిస్తే నేను చనిపోతాను” ఇంకా “నదిని దాటి శాశ్వత విశ్రాంతి”. ఈయన మరణం కాన్ఫెడరేట్ పాలనకు గణనీయమైన లోటుగా నిలిచింది. రిచ్మండ్ నగరంలో ప్రజలు ఈయనకు ఘనంగా నివాళి అర్పించి, లెక్సింగ్టన్, వర్జీనియాలో ఖననం చేశారు.

జాన్ మైఖేల్, రాజమండ్రి.