
నేటి విశ్వాస నాయకుడు
Dr. డేవిడ్ లివింగ్ స్టోన్,
పరలోక పిలుపు : 01 మే 1873,
సువార్తికుడు, వైద్యుడు, శాస్త్రవేత్త, అన్వేషకుడు, నిర్మూలనవాది, మానవతావాది.
Dr. లివింగ్ స్టోన్ (1813-1873) ప్రపంచములోనే గొప్పపేరున్న, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంతో ఆఫ్రికాను అన్వేషించిన మిషనరీ. ఈయన 1813 మార్చి 19న స్కాట్లాండ్లోని బ్లాంటైర్ అనే ఊరిలో ఓ సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించాడు. పదవ ఏట నుంచే పత్తి కర్మాగారంలో రోజంతా కష్టపడుచూ, రాత్రివేళల్లో చదువును కొనసాగించాడు. ఈయన తండ్రి ఒక నిబద్ధమైన క్రైస్తవుడు కావడం వల్ల, చిన్నప్పటి నుంచే క్రైస్తవ బోధనలు, శాస్త్రంపై ఆసక్తి, ప్రకృతి, ప్రేమ, ఇలా అన్నీ కలిసి ఈయనలో విశ్వాసం మరియు శాస్త్ర విజ్ఞానాన్ని సమన్వయించాలనే ఆకాంక్షను కలిగించాయి. ఈయన గ్లాస్గో నగరంలోని ఆండర్సన్ విశ్వవిద్యాలయం, చారింగ్ క్రాస్ ఆసుపత్రిలో వైద్యశాస్త్రం, వేదాంత శాస్త్రాన్ని అభ్యసించాడు. మొదట్లో ఈయన మిషనరీగా చైనాకు వెళ్లాలనుకున్నాడు, కానీ అప్పట్లో జరిగిన అపియం యుద్ధం వలన రద్దయినది. 1839లో లండన్ మిషనరీ సొసైటీ ఈయనను మిషనరీగా వెస్ట్ ఇండీస్ కు వెళ్లాలని సూచించగా, లివింగ్ స్టోన్ మాత్రం ఆఫ్రికాలోని అజ్ఞాత ప్రదేశాలలో మిషనరీ పని చేయాలన్న రాబర్ట్ మఫాట్ కలల ప్రభావంతో, లివింగ్ స్టోన్ తన గమ్యంగా ఆఫ్రికాను ఎంచుకున్నాడు. 1840లో ఈయన మిషనరీగా అభిషేకితుడై ఆఫ్రికాకు చేరుకున్న తరువాత, లోతట్టు ప్రాంతాల్లో, ఎడారుల్లో, అడవుల్లో అనేక ప్రమాదాలను ఎదుర్కొంటూ, శ్రమతో కూడిన జీవితం గడిపాడు. ఆహార లేకపోవడం, మలేరియా, ఒంటరితనం అన్నీ సహజంగా మారాయి.ఈయన త్స్వానా ప్రజల మధ్య సేవ చేస్తూ, మిషనరీ కేంద్రాలను స్థాపించాడు. 1844లో సింహం దాడిలో ఈయన భుజానికి తీవ్ర గాయం జరిగింది. జీవితం అంతా ఆ గాయం ప్రభావంతో గడిచింది. వైద్యుడుగా తన సేవలను విస్తృతంగా ఉపయోగించాడు, ఈయన్ను కలిసిన అనేక గిరిజన ప్రజలకు, అనారోగ్యంగా ఉన్న వారు మొదట వైద్యుడుగానే గుర్తించారు. తనపై సింహం దాడి చేసినప్పుడు తానే స్వయంగా చికిత్స చేసుకున్నాడు. ఆఫ్రికాలో వ్యాపిస్తున్న వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తలు రాసాడు. 1845లో మేరీ మాఫాట్ను వివాహం చేసుకున్నాడు. అయితే, కరువు, స్థానిక ప్రజల ప్రతిఘటన వంటి సమస్యల వల్ల ఈయన అంతర్భాగాలలోకి మరింత లోతుగా ప్రయాణించాడు. ఈయన ఆఫ్రికా జీవితకాల ప్రయాణంలో క్రైస్తవ మిషనరీ సేవ, సాహసోపేత అన్వేషణ, దాస్య నిర్మూలన ఉద్యమానికి సమర్పితమై ఉంది. ఈయన లక్ష్యం క్రైస్తవ ధర్మం, వాణిజ్యం, నాగరికతలను ఆఫ్రికా ఖండానికి పరిచయం చేయడమే కాకుండా, ఆఫ్రికన్ దాస్యన్ని ముగించడానికి కట్టుబడ్డాడు. ఆఫ్రికా శతాబ్దాల పాటు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఖండంగా మిగిలిపోయింది. ఆధునిక నాగరికతకు దూరంగా, అతి తక్కువ అభివృద్ధి సాధించిన ఈ ఖండంలో అనేక గిరిజన గోత్రాలు తమ ప్రత్యేకమైన సంప్రదాయాలు, ఆచారాలతో వేరు వేరుగా అనాగరికంగా జీవించేవారు. అయితే, డేవిడ్ లివింగ్ స్టోన్ గుండె ధైర్యంతో ఆఫ్రికా అంతర్భాగాలలోకి ప్రవేశించి, అక్కడి విస్తారమైన, రహస్య ప్రకృతి దృశ్యాలను అన్వేషించారు. ఈయన ప్రయాణాల ద్వారా ఆ ఖండంలోని ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచానికి ఆఫ్రికా పట్ల కొత్త అవగాహన, ఆసక్తి కలుగజేశారు. లివింగ్ స్టోన్ అన్వేషణలు కాలాహారి ఎడారిని దాటి లేక్ నాగమీ వరకు తీసుకెళ్లాయి, ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలను పరిశీలించి, ముఖ్యంగా జాంబెజీ నదిపై ఉన్న విక్టోరియా ఫాల్స్ ను కనుగొనడంలో ఈయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది, దీనికి ఈయన బ్రిటన్ రాణి విక్టోరియాను గౌరవించుతూ ఆపేరు పెట్టారు. ఈ ప్రయాణాల ద్వారా, ఆ భూమి అక్షాంశంలో దక్షిణ-మధ్య ఆఫ్రికాను దాటి ప్రయాణించిన తొలి వ్యక్తిగా పేరుగాంచాడు. దాస్య వ్యాపారానికి ఎదురు నిలబడి నాగరికతను నేర్పించాడు. దానికి బదులుగా న్యాయమైన వాణిజ్యం, క్రైస్తవ మిషనరీ సేవలు ఏర్పరచాలని ఈయన విశ్వసించారు. దాసులపై జరిగిన పాశవిక చర్యలను, వారికి కలిగిన బాధను, తాను చూసిన దాస్యపు దారుణాలను తన రచనల్లో నిక్షిప్తం చేశారు. ఇది బ్రిటన్ ప్రజల హృదయాలను కదిలించింది, దాస్య నిర్మూలన ఉద్యమానికి గట్టి బలాన్ని ఇచ్చింది. ఆఫ్రికా నందన వనాలను ప్రపంచానికి పరిచయం చేసాడు. ఆఫ్రికన్ ప్రజలపై ఉన్న అపోహలను తొలగించాడు.
1856లో బ్రిటన్కి తిరిగిన లివింగ్స్టోన్ ప్రసిద్ధ రచయిత, ప్రసంగకర్తగా నిలిచాడు. అయితే, తన వాణిజ్య ప్రణాళికలకు లండన్ మిషనరీ సొసైటీ మద్దతు ఇవ్వకపోవడంతో రాజీనామా చేసి బ్రిటిష్ కాన్సుల్గా నియమితుడయ్యాడు. ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉన్నప్పటికీ, అన్వేషణలను ప్రోత్సహించాడు. భార్య మేరీ 1862లో మరణం, కూతురి మరణం తీవ్ర విషాదం తీసుకొచ్చింది. అప్పటినుంచి ఆయన పూర్తి ఒంటరితనంలో తన మిషనరీ, పరిశోధనా పనులను కొనసాగించాడు. ప్రజలు, ప్రభుత్వ మద్దతుతో 1858లో ప్రారంభమైన జాంబెజీ యాత్రను నడిపించాడు, అయితే ఇది అనేక కష్టాలతో కూడిన ప్రయత్నంగా మారింది. ఆఫ్రికాలోని తన అన్వేషణల సమయంలో లివింగ్స్టోన్ బయట ప్రపంచంతో మొత్తం ఆరు సంవత్సరాలు సంబంధం కోల్పోయాడు. ప్రపంచమంతా ఈయన ఎప్పుడో చనిపోయాడు అని భావిస్తుండగా, 1871లో హెన్రీ మోర్టన్ స్టాన్లీ అనే జర్నలిస్ట్ ఉజిజి వద్ద ఈయన్ను కనుగొని, మీరు డాక్టర్ లివింగ్స్టోన్ కదా అని గుర్తించి పలకరించాడు. తీవ్ర అనారోగ్య సమస్యలున్నా కూడా, లివింగ్స్టోన్ తన మిషన్ పూర్తి చేసే వరకు ఆఫ్రికాను విడిచిపెట్టడానికి నిరాకరించాడు. ఈయన క్రైస్తవ మతంలో మార్పించగలిగిన ఏకైక ఆఫ్రికన్ క్వెనా గోత్రాధిపతి సెచెలే మాత్రమే, కానీ ఆతడు తర్వాత ఇతర మిషనరీల కన్నా విశేషంగా క్రైస్తవ ధర్మాన్ని ప్రచారం చేశాడు.
డేవిడ్ లివింగ్ స్టోన్ 1873 మే 1న నేటి జాంబియా దేశంలో తీవ్ర అనారోగ్యంతో, మోకాళ్ళమీద ప్రార్థనలోనే ప్రభువు వద్దకు పయనించిరి. ఈయనతో ఉన్న నీగ్రో సహాయకులు చుమా, సూసీ, ఈయన గుండెను అక్కడే ఒక చెట్టు కింద పాతి భూసమాధి చేశారు. ఆ ప్రదేశం తరువాత లివింగ్ స్టోన్ స్మారక స్థలంగా పేరుగాంచింది — ఆ చెట్టు కాండంలో ఈయన పేరు చెక్కబడి ఉంది. ఈయన మృతదేహాన్ని వారు సుమారు వెయ్యి మైళ్ల దూరం నడకతో తూర్పు తీరాన ఉన్న బగమోయో పట్టణానికి తీసుకువచ్చారు. తీరానికి చేరుకున్న తర్వాత, లివింగ్స్టోన్ అవశేషాలు, ఈయన చివరి డైరీ మరియు ఇతర వస్తువులతో కూడి బ్రిటన్కు నౌక ద్వారా తరలించబడ్డాయి. లండన్కు చేరుకున్న తరువాత, ఈయన మృతదేహాన్ని రాయల్ జాగ్రఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయమైన సవిల్ లో సంతాపార్థంగా ఉంచారు. అనంతరం ఈయనను గౌరవంగా వెస్ట్ మినిస్టర్ ఆబీలో అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. డేవిడ్ లివింగ్స్టోన్ జీవిత విశేషాలు నేడు ప్రదర్శనలుగా, పరిశోధనలుగా నిలిచాయి. ఈయన ఆఫ్రికాపై ప్రపంచ దృష్టిని మార్చిన గొప్ప మానవతావాది. ఆ ఖండానికి వెలుగు చూపించిన దేవుని సేవకుడు. సాహసంతో కూడిన, సేవారూపమైన, విశ్వాసపూరితమైన జీవితానికి లివింగ్ స్టోన్ జీవితం ఒక శాశ్వత సాక్ష్యంగా నిలిచిపోయింది.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.