
నేటి విశ్వాస నాయకుడు
హెర్మాన్ గుండెర్ట్
పరలోక పిలుపు : 25 ఏప్రిల్ 1893
మిషనరీ, పండితుడు, వేదాంతవేత్త, భాషావేత్త, విద్యావేత్త, సంపాదకుడు, అనువాదకుడు, రచయిత.
హెర్మాన్ గుండెర్ట్ (1814–1893) మన దేశములో, కేరళ ప్రాంత ప్రజల మధ్య ఎనలేని సేవచేసిన జర్మన్ మిషనరీ. ఈయన మలయాళ భాష, సాహిత్యంలో చేసిన అపూర్వమైన కృషికి, గుర్తింపు పొందారు. మలబార్ తీరాన తలస్సేరీ (తెలిచేరి)లో ఎక్కువ కాలం సేవ చేశారు. 1859లో ఈయన రచించిన మలయాళభాషా వ్యాకరణం, మలయాళంలో మొదటి సమగ్ర వ్యాకరణ గ్రంథం కాగా, 1872లో ప్రచురించిన మలయాళ-ఇంగ్లీషు నిఘంటువు భాష ప్రమాణీకరణకు బలమైన పునాదులు వేసింది. మలయాళ భాషలో పూర్తి విరామం, అల్ప విరామం, అర్థ విరామం, ఉపవిరామం, ప్రశ్నార్థకం వంటి విరామ చిహ్నాలను పరిచయం చేసిన ఘనత కూడా గుండెర్ట్ దే. ఈయన బైబిల్ను మలయాళంలోకి అనువదించడంలో చురుకుగా పాల్గొని, మాతృభాషలో వేదాంత పాఠాలను అందుబాటులోకి తెచ్చారు. మలయాళ భాషలో మొదటి పాఠశాల, బాలికల విద్యాసంస్థను స్థాపించిన వారు కూడా ఈయనే. అనేక పాఠశాలలను ప్రారంభించి, వాటిని తరచూ సందర్శిస్తూ, ఉపాధ్యాయులకు అధిక విద్యను అందించే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో మలయాళంలో సుమారు 13 గ్రంథాలు ప్రచురించి, విశాలమైన భాషా వనరులను సేకరించారు. మలయాళ బాష మీద మాత్రమే కాకుండా, చరిత్ర, భూగోళశాస్త్రం, ఖగోళ శాస్త్రాల్లో కూడా రచనలు చేశారు. కేరళ ప్రకృతిసౌందర్యం ఈయనను ఎంతగానో ఆకట్టుకుంది. కున్నమ్ కులం నుండి మంగళూరు వరకు పడవ ప్రయాణం సమయంలో ఈయన కేరళను “దేవుని స్వంత దేశం” అని అభివర్ణించారు. ఈ స్లోగన్ కేరళ పర్యాటక సంస్థకు వాడుకొని వేరేవాళ్లు పేరు సంపాదించుకున్నారు. గుండెర్ట్ రచనలు మలయాళ భాషకు శాశ్వతంగా నిలిచిపోయే వారసత్వంగా నిలిచాయి. ఈయన సేకరించిన దస్త్రాలు జర్మనీలోని ట్యూబింకెన్ విశ్వవిద్యాలయంలో నేడు పరిరక్షితంగా ఉన్నాయి.
హెర్మాన్ గుండెర్ట్ 1814 ఫిబ్రవరి 4న లుడ్విగ్ గుండెర్ట్, క్రిస్టియానా ఎన్స్లిన్ దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. ఈయన తండ్రి లుడ్విగ్ జర్మనీలో బైబిల్ సొసైటీ కార్యదర్శిగా పనిచేయడంతో పాటు, 1823లో ఒక మిషనరీ మాసపత్రికను ప్రారంభించారు. ఈ ప్రచురణలు హెర్మాన్ కు చిన్ననాటే ముద్రణా రంగం పట్ల పరిచయం కలిగించాయి. ఐదేళ్ల వయసులో స్టుట్గార్ట్ లోని లాటిన్ పాఠశాలలో చదువు ప్రారంభించి, చిన్న వయసులోనే హెబ్రూ, లాటిన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలలో ప్రావీణ్యం సంపాదించి, తన అద్భుత భాషాజ్ఞానాన్ని ప్రదర్శించాడు. గుండెర్ట్ 1827లో మౌల్బ్రోన్ లో లోయర్ సెమినరీ, ట్యూబింగెన్ విశ్వవిద్యాలయంలో హయ్యర్ సెమినరీలో చేరాడు. 1835లో ట్యూబింగెన్ విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంలో డాక్టరేట్ తో పాటు, ధార్మిక విద్యను విజయవంతంగా పూర్తిచేశాడు.
హెర్మాన్ గుండెర్ట్ 1836లో ఇంగ్లాండ్, బ్రిస్టల్ నుండి బయలుదేరి భారత్కు ప్రయాణించాడు, మద్రాసుకు వచ్చి, అక్కడ వెంటనే తమిళాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ప్రయాణంలోనే ఈయన బెంగాలీ, హిందుస్తానీ, తెలుగు భాషలను అభ్యసించి, సహ ప్రయాణికులకు అవి బోధించాడు. తరువాత తిరునెల్వేలిలో సేవ చేసి, అక్కడి నుండి చిత్తూరుకు వెళ్లాడు. అక్కడే 1838 జూలైలో తనతో కలిసి వచ్చిన స్విస్ మహిళ జూలీ డుబాయిస్ ను వివాహం చేసుకున్నాడు. తిరునెల్వేలికి తిరిగివెళ్తున్న సమయంలో గుండెర్ట్ దంపతులు మంగళూరులో బాసెల్ మిషన్ లో చేరారు. ప్రయాణాల మధ్యలో ఈయన తమిళ భాషా సామగ్రిని ముద్రణ కోసం నాగర్ కోయిల్లో వదిలి, తిరువనంతపురంలో ట్రావంకూర్ మహారాజును కలిసినప్పుడు మలయాళాన్ని తొలిసారి వినే అవకాశం వచ్చింది. 1838 నవంబరులో గుండెర్ట్ దంపతులు మంగళూరు చేరి, అక్కడి నుండి కన్నూరు, తేలిచ్చేరి, అంజరాకండి సమీపంలోని దాల్చిన చెట్ల తోటను సందర్శించారు. తరువాత వారు తెలిచ్చేరిలో సుమారు 20 సంవత్సరాలు నివసించారు. అక్కడ గుండెర్ట్ స్థానిక గురువుల నుండి మలయాళాన్ని నేర్చుకొని, తన రచనలకు వారిని సంప్రదించేవాడు. 1857లో ఈయన మలబార్, కనరా ప్రాంతాలకు తొలి స్కూల్ ఇన్స్పెక్టర్ గా నియమితుడయ్యాడు. ఈ హోదాలో ఆయన విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడం, పాఠ్యపుస్తకాలు రచించడం, పరీక్షా పత్రాలు రూపొందించడం వంటి పనులను చేశాడు. మలయాళ భాషా అభివృద్ధికి, సంస్కృతి అధ్యయనానికి చేసిన విశేష సేవల వల్ల గుండెర్ట్ కు కేరళలో అపార గౌరవం ఉంది. ఈయన పాఠశాల, విశ్వవిద్యాలయ స్థాయిలకు గల వ్యాకరణ గ్రంథాలను రచించడం ద్వారా భారతీయ వ్యాకరణానికి సంస్కృతేతర దృక్పథాన్ని అందించారు.
అనారోగ్యం కారణంగా గుండెర్ట్ 1859లో భారతదేశాన్ని విడిచి జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్న కాల్వ్ అనే ఊరికి వెళ్లాడు. అక్కడి కాల్వ్ ప్రచురణ సంస్థలో చేరి, 1862లో దాని డైరెక్టర్ గా నియమితుడయ్యాడు. ఈయన అనేక పుస్తకాలు, వ్యాసాలు, మాసపత్రికలు ప్రచురించాడు, వీటిలో ఒకటి పిల్లల పత్రిక కూడా ఉంది. గుండెర్ట్ 79 ఏళ్ళ వయసులో మరణించాడు. ఈయన భార్య జూలీ 1885 సెప్టెంబర్ 18న మరణించగా, ఇద్దరూ కాల్వ్ సమాధి స్థలంలో ఒకే కుటుంబ గుహలో సమాధి చేయబడ్డారు. ఆ సమాధి స్థలం ఈరోజూ కూడా ఉంది. తలశేరిలో ఆయన జ్ఞాపకార్థంగా ఒక విగ్రహం నిర్మించబడింది. అలాగే ఈయన నివసించిన బంగళా ఎన్నో సంవత్సరాలు నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ కు కేంద్రంగా ఉపయోగించబడింది. 2022లో, గుండెర్ట్ జీవితం, సేవలను గుర్తిస్తూ, కేరళ టూరిజం శాఖ ఆ బంగళాను ఒక జ్ఞాపకార్డ, స్మారక మ్యూజియంగా మార్చింది.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.