
నేటి విశ్వాస నాయకుడు
హెన్రీ మెక్నీల్ టర్నర్,
పరలోక పిలుపు : 08 మే 1915,
గొప్ప ఆత్మీయ నాయకుడు, ధైర్యవంతమైన పౌరహక్కుల పోరాట యోధుడు, రాజకీయవేత్త, న్యాయవాది.
హెన్రీ మెక్నీల్ టర్నర్ (1834–1915) అఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో మొదటి బిషప్, అమెరికా పౌరయుద్ధం తర్వాత పునర్నిర్మాణ కాలంలో జార్జియా రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికైన మొదటి ఆఫ్రికన్-అమెరికన్ సభ్యుల్లో ఒకరు. హెన్రీ టర్నర్ 1834 ఫిబ్రవరి 1న దక్షిణ కరోలినాలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు ఆఫ్రికన్-యూరోపియన్లు. ఆఫ్రికన్-అమెరికన్ల విద్యనిషేధించే చట్టాల మధ్య, పత్తి పొలాలలో శ్రమించే బదులు, అబ్బీవిల్లేలో ఒక న్యాయ సంస్థలో పని చేశారు. 14 ఏళ్ల వయసులో ఒక మెథడిస్ట్ మేలుకొలుపు సభ ద్వారా ప్రభావితమై, దేవుని సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. 1853లో 19 ఏళ్లకే మెథడిస్ట్ చర్చి సౌత్ నుండి ప్రసంగాధికారం పొందారు. దక్షిణ రాష్ట్రాలలో సువార్త ప్రకటన చేసిన తర్వాత, 1858లో కుటుంబంతో పాటు మిస్సోరీలోని సెయింట్ లూయిస్ కు వలస వెళ్లారు. ఎందుకంటే అప్పటి ఫ్యూజిటివ్ స్లేవ్ చట్టం కింద బలవంతంగా బానిస చేయబడే ప్రమాదం ఉండేది. అక్కడ ఏఎంఈ చర్చిలో బోధకునిగా నియమితులై, ట్రినిటీ కాలేజీలో క్లాసిక్స్, హెబ్రూ, ధర్మశాస్త్రం చదివారు. తరువాత బాల్టిమోర్, వాషింగ్టన్ డీసీలలో పాస్టరుగా పనిచేశారు. అక్కడే ప్రముఖ రిపబ్లికన్ నాయకులను కలిశారు. 1862లో పౌరయుద్ధం సమయంలో, కాంగ్రెస్ సభ్యులు, ఆర్మీ అధికారులు పాలుపంచుకొనే, వాషింగ్టన్ డీసీలోని ఇస్రాయేల్ బెతేల్ చర్చిలో ఈయన సేవలందించారు. ఇది అప్పటివరకు పెద్ద ఎత్తున ఆఫ్రికన్-అమెరికన్లు హాజరయ్యే చర్చిగా ప్రసిద్ధి.
టర్నర్ 1వ యునైటెడ్ స్టేట్స్ కలర్డ్ ట్రూప్స్ కు చాప్లెయిన్ గా పనిచేశాడు. ఈయన బోధలు నమ్మకం, ధైర్యం, విశ్వాసం అనే అంశాలను ప్రాముఖ్యతనిచ్చేవి. అనారోగ్యంతో బాధపడుతున్నా యుద్ధంలో పాల్గొన్నారు. అనంతరం పునరావాస కేంద్రాల నిర్వహణలో సహకరించారు. యుద్ధం అనంతరం రిపబ్లికన్ పార్టీతో జమై జార్జియా అసెంబ్లీలో ఎన్నికయ్యారు. మొదట ఈయనతో పాటు ఇతర నల్లజాతి సభ్యులను బాధ్యతల నుండి బహిష్కరించారు. అయితే, నల్లజాతిపై అన్యాయ విధానాలు పెరిగిపోవడం చూసి రాజకీయ వ్యవస్థపై నిరాశకు లోనయ్యారు. అమెరికాలో నల్లజాతి ప్రజలకు సరైన న్యాయం లభించకపోతే, వారు స్వతంత్రంగా జీవించేందుకు ఆఫ్రికాలో స్థిరపడాలని టర్నర్ మద్దతిచ్చారు. ఇందుకోసం “ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సొసైటీ” అనే సంస్థను స్థాపించి లైబీరియాకు వలసలను నిర్వహించారు. ఈయన అత్యంత ప్రభావశీల నాయకుడిగా, దక్షిణ రాష్ట్రాలలో అనేక సంఘాలను స్థాపించి, సేవను విస్తరించారు. ఈయన స్త్రీల బోధనా హక్కు, మద్యపాన నిషేధం, మహిళల ఓటు హక్కు వంటి పలు సామాజిక అంశాలకు మద్దతిచ్చారు. ఆఫ్రికాలో మిషనరీ కార్యకలాపాలను విస్తరించి, అక్కడ చర్చ్ సమావేశాలు నిర్వహించారు. దక్షిణ ఆఫ్రికా నుండి విద్యార్థులను అమెరికాలో చదివేందుకు ప్రోత్సహించారు. టర్నర్ తన సేవలతో నల్లజాతి క్రైస్తవుల్లో ఒకతత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపారు. తెల్లవారైన చర్చీల ఆధిపత్యాన్ని తిరస్కరించి, నల్లవారే స్వతంత్రంగా తమ సంఘాలను నడపాలని బోధించారు.
హెన్రీ టర్నర్ గారు అనారోగ్యంతో చికిత్సకు కెనడాలోని విండ్సార్ వెళ్లి అక్కడే 81 ఏళ్ల వయస్సులో మృతిచెందారు. ఈయన శరీరాన్ని అమెరికా, జార్జియాలోని అట్లాంటాలో సమాధి చేశారు.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.
