వోల్బ్రెచ్ట్ నాగెల్ (1867-1921) జర్మన్ మిషనరీ. ఈయన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై ఎంతో ప్రభావం చూపారు. భారతదేశానికి మిషనరీ, సువార్తికుడు, కీర్తన రచయిత, రచయిత, రెహోబోత్ అనాథాశ్రమం స్థాపకుడు, బైబిల్ బోధకుడు.

నేటి విశ్వాస నాయకుడు
వోల్బ్రెక్ట్ నాగెల్,
పరలోక పిలుపు : 12 మే 1921,
భారతదేశానికి మిషనరీ, సువార్తికుడు, కీర్తన రచయిత, రచయిత, రెహోబోత్ అనాథాశ్రమం స్థాపకుడు, బైబిల్ బోధకుడు.

వోల్బ్రెచ్ట్ నాగెల్ (1867-1921) జర్మన్ మిషనరీ. ఈయన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో క్రైస్తవ సమాజంపై ఎంతో ప్రభావం చూపారు. ముఖ్యంగా బ్రదరన్ అసెంబ్లీల ద్వారా చేసిన మిషనరీ సేవ, అలాగే మలయాళ భక్తిగీతాల రచన ద్వారా గొప్ప పేరు పొందాడు. ఈయన 1867 నవంబర్ 3న జర్మనీలోని స్టామ్హైం అనే గ్రామంలో ధార్మిక కుటుంబంలో జన్మించారు. కానీ ఎనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులైన పీటర్, ఎలిజబెత్ను కోల్పోయారు. 18 సంవత్సరాల వయసులో, ఓ చెప్పులు కుట్టేవాని మాటలతో సువార్త విని రక్షణ పొందారు. ఈ అనుభవంతో తన జీవితాన్ని మిషనరీ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. 1886లో, స్విట్జర్లాండ్లోని బాసెల్ మిషన్ శిక్షణలో 1892 వరకు చదివారు. తర్వాత 1893లో ఈవాంజలికల్ లూథరన్ మిషన్ ద్వారా మిషనరీగా నియమించారు.

1893 డిసెంబర్లో నాగెల్ కేరళ మలబార్ తీరంలో కన్ననూరు వచ్చారు. అక్కడ బాసెల్ మిషన్ కేంద్రంలో బాధ్యతలు చేపట్టారు. కానీ పాఠశాలలు, చిన్న పరిశ్రమలు నిర్వహించే పరిపాలనా పనులు ఇష్టం లేక, స్వతంత్రంగా మిషనరీ పని చేయాలని అనిపించింది. 1896లో, లూథరన్ మిషన్ను వదిలి దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించారు. ప్రయాణంలో ఆయన కున్నంకుళం అనే ఊరిలో ఒక ప్రార్థనా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఆయనకు పరమేళ్ ఇతూప్ అనే క్రొత్త విశ్వాసి పరిచయమయ్యాడు. కున్నంకుళంలో ఉండాలని నిర్ణయించుకొని, నాగెల్ మలయాళం నేర్చుకొని మలయాళంలో మాట్లాడగలగడం వలన, స్థానికులు ఈయనను తమవాడిగా అంగీకరించారు. 1897 ఏప్రిల్ 1న, ఆయన హ్యారియెట్ మిచెల్ అనే ఆంగ్లో-ఇండియన్ ఉపాధ్యాయురాలను వివాహం చేసుకున్నారు. కున్నంకుళంలో అనేక మంది విశ్వాసులను ప్రభావితం చేశారు. అందులో ఒకరు సిరియన్ క్రైస్తవ ప్రీస్ట్ అయిన మామ్మెన్ గారు కూడా ఉన్నారు. తర్వాత నాగెల్ మరియు హ్యారియెట్ నీలగిరి కొండల వైపు ప్రయాణించి, అక్కడ హ్యాండ్లీ బర్డ్ అనే ఇంగ్లిష్ బ్రదరన్ మిషనరీని కలుసుకున్నారు. 1897 జూన్లో కోయంబత్తూరులో ఆయన చేతుల మీదుగా నాగెల్ గారు మునిగిన బాప్తిస్మము తీసుకున్నారు. 1906లో, నాగెల్ నల్లికున్ను, త్రిషూరు సమీపంలో రెహొబోత్ అనాథాశ్రమం, విధవల కోసం మరొక ఆశ్రమం స్థాపించారు. ఇవి ఇప్పటికీ సేవలో కొనసాగుతున్నాయి. నాగెల్ 1898 లో క్రైస్తవ బాప్తిస్మము అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో బైబిలు ప్రకారం బాప్తిస్మము అంటే ఏమిటి, అది నీటిలో మునిగి తీసుకోవాల్సినదే అనే విషయాన్ని వివరించారు. అలాగే, ఈయన అనేక మలయాళ భక్తిగీతాలు రచించారు. ఇవి ఇప్పటికీ కేరళలోని అనేక సంఘాలలో పాడబడుతున్నాయి. అందువల్ల ఈయనను “మలయాళ క్రైస్తవ భక్తిగీతాల తండ్రి” అని పిలుస్తారు.

1914లో, ఈయన తన పెద్ద పిల్లలను చదువుకోడానికి ఇంగ్లాండుకు పంపడానికి జర్మనీకి వెళ్లారు. ఆరోజుల్లో ప్రపంచ యుద్ధం మొదలైన కారణాన తిరిగి భారతదేశానికి రావడానికి వీలుకాలేదు. బ్రిటిష్ పాలనలో ఉన్న మలబార్ ప్రాంతంలోకి జర్మన్ పౌరుడిగా ఈయన ప్రవేశించలేకపోయారు. ఈయన స్విట్జర్లాండ్లో ఉండిపోయారు. హ్యారియెట్, ముగ్గురు పిల్లలు భారత్లో ఉండగా, పెద్ద పిల్లలు ఇంగ్లాండ్లో చదువుకు ఉండిపోయారు. 1917లో, ఈయన కేరళ, పరవూర్ సంఘానికి రాసిన లేఖలో ఇలా వ్రాసారు. “నా మధురమైన ధనాలు భారత్లో ఉన్నాయి. నా హృదయం కూడా అక్కడే ఉంది.” అయినా ఈయన భారతదేశానికి తిరిగి రాలేకపోయారు. 1921 మే 12న, నాగెల్ గారు స్విట్జర్లాండ్లోని వైడెనెస్ట్ బైబిల్ స్కూల్లో బోధిస్తుండగా స్ట్రోక్ వచ్చి మరణించారు. ఈయన భార్య హ్యారియెట్ చివరి రోజుల్లో ఈయనను చూసుకోగలిగింది.

జాన్ మైఖేల్, రాజమండ్రి.