
నేటి విశ్వాస నాయకుడు
Dr. ఆండ్రూ జ్యూక్స్
పరలోక పిలుపు : 28 ఏప్రిల్ 1931
ఇండియాకు వచ్చిన కెనడియన్ ఆంగ్లికన్ మెడికల్ మిషనరీ, సువార్తికుడు, అనువాదకుడు, రచయిత, వైద్యుడు.
ఆండ్రూ జ్యూక్స్ (1847–1931) కెనడాలో జన్మించి, ఇంగ్లాండ్లో విద్యనభ్యసించి, మన దేశమునకు వచ్చి సేవ చేసిన మిషనరీ. ఈయన వైద్యుడిగా క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు, భాషా అభివృద్ధికి గణనీయమైన సేవలందించారు. 1878లో ఈయనను చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు చెందిన, చర్చి మిషనరీ సొసైటీ (CMS) వైద్య మిషనరీగా పంజాబ్, సింద్ లో నియమించింది. ఆండ్రూ జ్యూక్స్ దేరా ఘాజీ ఖాన్ లో ఉంటూ చనిపోయేంత వరకు సేవలు అందించారు. ఇక్కడినుండే నేటి పాకిస్తాన్ ప్రాంతమంతా కవర్ చేసేవారు. ఈయన తన జీవితాన్ని స్థానిక పంజాబీ భాషయైన జట్కీ ఉపభాషలో బైబిల్ అనువాదానికి అంకితమై, 1898లో నాలుగు సువార్తలకు అనువాదాన్ని పూర్తిచేశారు. భాషా అభివృద్ధి రంగంలో గొప్ప ప్రయత్నంగా, జట్కీ భాషకు సంబంధించిన రెండు భాషలతో నిఘంటువు (డిక్షనరీ) తయారు చేశారు. ఈ నిఘంటువు 1900లో భారత ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ప్రచురించబడింది. ఈయన మిషనరీ సేవలు, భాషా పరిశోధనల ద్వారా అక్కడి ప్రజల జీవితాలను స్పృశించాయి. ఈయన వారసత్వం ఈవిధంగా చరిత్రలో నిలిచిపోయింది.
ఆండ్రూ జ్యూక్స్ 1847లో కెనడాలో జన్మించారు, తన ప్రారంభ విద్యను ఇంగ్లాండ్, టివర్టన్ పట్టణంలో ఉన్న ప్రఖ్యాత బ్లండెల్ స్కూల్లో పొంది, వైద్య విద్యను అభ్యసించారు, తద్వారా వైద్యుడు ఇంకా మిషనరీ అనే రెండు పాత్రలకు సిద్ధమయ్యారు. ఈయన చిన్ననాటి నుండే భక్తిశీలమైన క్రైస్తవుడిగా ఎదిగారు. ఈయన విశ్వాసం దృఢమైనది, క్రీస్తు కోసం జీవించాలని లోతైన సంకల్పం గలది, ఈ నిబద్ధతే ఈయనను మిషనరీ కార్యములకు అంకితం చేయించింది. అవసరమున్న వారికి సేవ చేయడం, ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం చేసి ప్రభువు మనిషిగా చేయడం ఈయన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు.
ఈయన తలపెట్టిన బైబిలు అనువాద కార్యక్రమానికి షేర్ మహ్మద్ కుమారుడు మహమ్మద్ హసన్ ద్వారా విశేష సహాయం లభించింది. జ్యూక్స్ కుటుంబం అంతా మిషనరీ సేవకు అంకితమై ఉండటం కూడా భాగంగా తోడ్పడింది. ఈయన తమ్ముడు వర్థింగ్టన్ జ్యూక్స్ అమృత్సర్, పంజాబ్, పెషావర్ లో C.M.S. మిషనరీగా పనిచేశాడు, అన్నయ్య మార్క్ జ్యూక్స్ కూడా ఎమర్సన్, మనిటోబాలో 14 సంవత్సరాల పాటు మిషనరీగా సేవ చేశాడు. జ్యూక్స్ భారతదేశంలో చేసిన వైద్య సేవలు ఈయన మిషనరీ సేవలో ఒక అంతర్భాగంగా తీసుకొని, వైద్య సేవను శరీర సంబంధముగా, అలాగే ఆధ్యాత్మిక సేవలను ప్రజలకు అందించారు. రకరకాల వ్యాధులు, గాయాలు, అనారోగ్యాలను చికిత్స చేయడంలో నిపుణుడై, స్థానికుల నుండి గౌరవం, నమ్మకాన్ని సంపాదించారు.
జ్యూక్స్ 83 సంవత్సరాల వయసులో తన మిషనరీ ప్రాంతమైన డేరా ఘాజీ ఖాన్ లో మరణించి అక్కడే సమాధి చేయబడ్డారని చెబుతారు. ఈ ప్రాంతంలో జీవించి, దేవుని రాజ్యానికి నిస్వార్థంగా సేవచేసిన ఈ శ్రేష్ఠ మిషనరీ జీవితానికి ఇది గౌరవనీయమైన ముగింపు.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.