జాన్ ఫ్లిన్ (1880–1951) ఆస్ట్రేలియన్ ప్రెస్బిటేరియన్ బోధకుడు. మిషనరీ, ఆస్ట్రేలియా ఇన్ల్యాండ్ మిషన్ వ్యవస్థాపకుడు, సువార్తికుడు, రచయిత, ఆవిష్కర్త.

నేటి విశ్వాస నాయకుడు
జాన్ ఫ్లిన్,
పరలోక పిలుపు : 05 మే 1951,
మిషనరీ, ఆస్ట్రేలియా ఇన్ల్యాండ్ మిషన్ వ్యవస్థాపకుడు, సువార్తికుడు, రచయిత, ఆవిష్కర్త.

జాన్ ఫ్లిన్ (1880–1951) ఆస్ట్రేలియన్ ప్రెస్బిటేరియన్ బోధకుడు. ఈయన ఆస్ట్రేలియా అంతర్గత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమానికి గొప్ప సేవలు అందించారు. ప్రజలు ఆధ్యాత్మికంగా, ఆచరణాత్మకంగా ఉండేందుకు ఈయన ఆస్ట్రేలియన్ ఇన్‌లాండ్ మిషన్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తదుపరి కాలక్రమంలో ఫ్రంటియర్ సర్వీసెస్ మరియు ప్రెస్బిటేరియన్ ఇన్‌లాండ్ మిషన్ అనే రెండు భాగాలుగా విడిపోయి, ఇప్పటికీ ఈయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి.

జాన్ ఫ్లిన్ 1880 నవంబర్ 25న విక్టోరియా రాష్ట్రంలోని మోలియాగల్ లో జన్మించాడు. తల్లి మరణించడంతో, చిన్నతనంలో ఈయన సిడ్నీలో తన ఆంటీ దగ్గర పెరిగి, ఆ తర్వాత స్నేక్ గల్లీ లో ఉన్న తన కుటుంబంతో చేర్చబడ్డాడు. వివిధ విక్టోరియన్ పాఠశాలల్లో చదివిన ఫ్లిన్, హైస్కూల్ నుంచి మాధ్యమిక విద్య పూర్తిచేశాడు. కానీ యూనివర్సిటీలో చేరడానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, మామూలు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 1903లో మతబోధకుడిగా మారేందుకు లే పాస్టర్ కోర్సు చేసి, దూరప్రాంతాల్లో సేవ చేశాడు. అనంతరం థియాలజీ కళాశాలలో చేరి, షేరర్ల మిషన్‌లో పనిచేశాడు.

1910లో, ఫ్లిన్ “ది బుష్‌మెన్స్ కంపానియన్” అనే పుస్తకం ప్రచురించాడు. ఇది దూరప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే సమాచారం అందించడమే లక్ష్యంగా రచించబడింది. 1911లో బెల్టానాలో స్మిత్ ఆఫ్ డునెస్క్ మిషనరీగా నియమితుడయ్యాడు, ఆ బాధ్యతలకోసం ఈయన అర్హత గల బోధకుడిగా నియమించబడ్డారు. 1912లో ఆస్ట్రేలియన్ ఇన్‌లాండ్ మిషన్ కు తొలి సూపరింటెండెంట్ అయ్యాడు. ఈయన కల “మాంటిల్ ఆఫ్ సేఫ్టీ” అంటే, ప్రతి దూర ప్రాంత నివాసితుడికి భద్రత, సేవలు అందించే సదుపాయం కల్పించడం. 1917 నాటికి, సాంకేతిక అభివృద్ధులు మరియు WWI పైలట్ క్లిఫర్డ్ పీల్ రాసిన లేఖతో ప్రేరణ పొందిన ఫ్లిన్, వైమానిక వైద్య సేవ ఆలోచనను రూపొందించాడు. దీని ఫలితంగా, 1928లో మొదటి Aerial Medical Service ప్రారంభమైంది. జాన్ ఫ్లిన్ చేసిన అత్యంత ప్రముఖమైన కృషి రాయల్ ఫ్లైయింగ్ డాక్టర్ సర్వీస్ (RFDS) స్థాపన. ఇది ప్రపంచంలోనే మొదటి వైమానిక అంబులెన్స్ సేవా సంస్థగా నిలిచింది. విమానాల సహాయంతో వైద్యులను, ఔషధాలను అందించి, సుదూర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చింది. మొదట పైలట్ క్లిఫర్డ్ పీల్ రాసిన లేఖ ద్వారా వచ్చిన ఆలోచనలను చర్చి మాసపత్రికలో ప్రచురించిన ఫ్లిన్, విమాన వైద్య సేవ ఆవిర్భావానికి బీజం వేశారు. తద్వారా వేలాది మంది అణచివేయబడిన ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందడం ప్రారంభమైంది. ఆధ్యాత్మిక, సామాజిక సేవల సమన్వయం సాధించి, ప్రజలకు సంపూర్ణ మానవ అభివృద్ధికి సహకరించారు.

1951లో ఫ్లిన్ 71 ఏళ్ల వయస్సులో న్యూస్ సౌత్ వేల్స్ లోని సిడ్నీలో మరణించాడు. ఈయనను ఉత్తర ఆస్ట్రేలియాలోని అలిస్ స్ప్రింగ్స్ సమీపంలోని మౌంట్ గిల్లెన్ వద్ద సమాధి చేశారు – “సేవే మానవతా ధర్మం.” అనే సిద్దాంతముతో దూర ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను అర్థం చేసుకొని, తన జీవితం అంతా వారి కోసం అంకితం చేశారు. ఈయన సేవా ప్రవృత్తికి ప్రేరణ, విశ్వాసం మరియు దూర ప్రాంత ప్రజల తత్వవాద అవసరాలపై ఉన్న అవగాహన. ఫ్లిన్ స్మరణార్థంగా క్వీన్స్ లాండ్ లోని క్లాంకరీ పట్టణంలో జాన్ ఫ్లిన్ ప్లేస్ మ్యూజియం స్థాపించబడింది. ఈ మ్యూజియంలో ఈయన చేసిన వైద్య, కమ్యూనికేషన్, మిషనరీ సేవలకు సంబంధించిన చిత్రాలు, పాత పత్రాలు, వస్తువులు ప్రదర్శించబడ్డాయి.

జాన్ మైఖేల్, రాజమండ్రి.