
నేటి విశ్వాస సందేశము
సహోదరుడు అప్పాజీ, హెబ్రోన్,
ప్రారంభ సమావేశం : 23 మే 1957,
ప్రభువు సేవకై తన స్థిరాస్తిని అర్పించిన తేది, అప్పాజీ అర్పణ – ప్రభువుకు ఆరాధన.
ఈయన పూర్తీ పేరు సంజీవ జ్ఞాన అప్పాజీగారు, 1950 నుండి గౌరవంగా అప్పాజీ అనే పిలుపుతో అందరికీ సుపరిచితులు. ముఖ్యముగా ఈయన నేటి హెబ్రోన్ స్థలమైన తన స్థిరాస్తిని ప్రభువు సేవకై త్యాగం చేసిన దీన దాసుడుగా అందరు గుర్తించిన గొప్ప విశ్వాసి. ఈయన ప్రత్యేకతలు, పరోపకారి, సంగీత ప్రియుడు, క్రియాశీల విశ్వాసి, విశ్వాసులకు మార్గదర్శి, నిశ్శబ్ద సేవాస్థంభం. ఈయన ఎప్పుడు ఎవ్వరికి ఏమి చేసినా ఎల్లప్పుడూ నిస్వార్థంగానే చేసేవారు. ఈయన నిజాం ప్రభుత్వంలో చాలా పెద్ద హోదాను నిర్వహించినప్పటికీ, సహోదరుడు భక్త్ సింగ్ గారి కంటే వయసులో చాలా పెద్దవాడు అయినప్పటికీ, దీన మనస్కుడై అతి సౌమ్యుడుగా భక్త్ సింగ్ గారికి ఎంతో విధేయుడుగా ఉండేవారు. అలాగే ఇతర సేవకులందరి యెడల అదే విధేయతతో తన విశ్వాస్యతను చూపిస్తూ ఉండేవారు. నాటి సంఘ పరిస్థితులను అనుభవపూర్వకంగా తెలిసికొని ఇతోదికంగా సహాయం చేస్తూ ఉండేవారు. ఈలాగు సహపాఠి విశ్వాసులకు మాదిరికరంగా మార్గదర్శకంగా నడుచుకునేవారు. మార్కు 9,41 “మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అనే వాక్య ప్రకారంగా, గిన్నెడు నీళ్లకే పరలోకములో ఫలమున్నచో, బైబిల్లో ప్రభువుచే స్థాపించబడిన నూతన నిబంధన సంఘమునకు, క్రియాపూర్వకముగా వ్యవహరించిన అపొస్తలుడైన బర్నబాసువలె, తన స్థిరాస్తిని ప్రభువు సేవ నిమిత్తం సమర్పించిన సహోదరుడు అప్పాజీగారు, విశ్వాసంతో ఈయన భూమిపై చేసిన దాతృత్వానికి ప్రతిఫలంగా నిత్యత్వంలో ఎంత శాశ్వత సంపదను కూడబెట్టుకున్నారో? -ఈలాగు ఈయన నిశ్శబ్దంగా, జీవముగల ప్రభువు సంఘానికి ఈయన చేసిన ఈ ప్రక్రియ ద్వారా, 1959 సెప్టెంబరు 24న హెబ్రోన్ కేంద్రసంఘ పునాది వేయుటలో, సహోదరుడు భక్త్ సింగ్ గారికి సహకారిగా ఉండుటకు ప్రభువే అప్పాజీగారిని ఆయన పరిచర్యలో సాధనంగా వాడుకొనెను. ప్రభువు కృపచేత, దేవుని మందిరం అతి స్వల్పకాలంలోనే నిర్మించబడి, అదే సంవత్సరంలో డిసెంబర్ 25న ఆయనకు ప్రతిష్ఠించబడింది.
అప్పాజీ గారి పూర్వికులు నిజాం కాలం నుండి హైదరాబాద్ స్థిరవాస్తవ్యులు. ఈయన తండ్రి పేరు సంజీవయ్య గారు. 19వ శతాబ్దంలో సంపన్న కుటుంబంలో జన్మించిన ఈయన, సహవాసంలో ఉన్న పాతకాలపు విశ్వాసులందరికన్నా వయస్సులో పెద్దవారుగా చెప్పవచ్చు. ఈయన నిజాం ప్రభుత్వంలో రాజు తర్వాత అతి ముఖ్యుడైన ప్రధాన మంత్రికి సెక్రటరీగా సేవలందించి, అప్పటికే పదవి విరమణ పొందియుంటిరి. ఈయన అనేకమంది ప్రధాన మంత్రుల దగ్గర పనిచేసిన అనుభవము, ఇంకా ఈయన నమ్మకత్వం వలన ప్రభుత్వంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిరి. ఈయన ఒక కుమారునితో ఆశీర్వదింపబడెను. 1950 సెప్టెంబరు 25న కేంద్ర పరిచర్య మద్రాసు జెహోవా షమ్మా నుండి హైదరాబాదుకు తరలివచ్చిన కొద్ది కాలానికే, సహోదరుడు అప్పాజీగారి జీవితములో సంభవించిన గొప్ప మలుపు ఏమనగా, ఒక రోజు విశ్వాసులైనవారు తెల్ల వస్త్రములు ధరించుకొని, బైబిళ్లు చేతపట్టుకుని కూడికకు వెళ్తుండగా, అప్పటికే వృద్ధాప్యంలో ఉన్న ఈయన వారి బైబిళ్ళను గమనించి ఆతృతతో వారిని వెంబడించి ఆ కూడికకు వెళ్లెను. నెమ్మదిగా దేవుని గూర్చి వివరణాత్మకంగా దినదినము తెలిసికొనుచూ, దేవుని ఉచిత కృప వలన భక్త్ సింగ్ గారి వాక్యం ద్వారా ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించెను. ఈయన రక్షించబడిన కొద్ది దినములకే హైదరాబాద్ ఏలీములో మొదటిసారిగా ప్రారంభించబడిన పరిశుద్ధ సమాజకూడికలలో 1950 డిసెంబరు 24, ఆదివారమున సంఘము ఎదుట నీటి బాప్తిస్మములో సాక్ష్యమిచ్చితిరి. ఈయనకు సంగీతం వినడం, సంగీతవాయిద్యములు వాయించడం అంటే ఎంతో మక్కువ. ఈయన కాలములో జరిగిన పరిశుద్ధ సమాజ కూడికలకు, ఇతర సంఘ సమావేశాలకు వయోలిన్ వాయిద్యము ఎంతో ఇష్టంగా వాయిస్తూ ఉండేవారు. ఆకాలంలో సమాజముగా కలిసి పాడటమే ప్రాముఖ్యముగా కొనసాగుచుండెడిది. ఈ పాటల సంగీతమును అభివృద్ధిపరిచే దిశగా ఈయన కొన్ని సంగీత వాయిద్యాలను ఇంగ్లాండ్ నుండి కొనుగోలు చేశారు. ఇందులో ముఖ్యమైనవి రెండు (పారిస్ రీడ్స్) లెగ్ హార్మోనియంలు. అందులో ఒకటి సహోదరుడు భక్త్ సింగ్ గారికి, రెండవది సహోదరుడు మార్టిన్ గారికి ఇచ్చితిరి. ఈ విధంగా ఈయన ఎన్నో సంఘ అవసరతలు గుర్తిస్తూ సందర్భానుకూలంగా ప్రతిస్పందిస్తూ ఉండేవారు.
అప్పాజీగారు ప్రభువుచేత ప్రేరేపించబడిన వాడై 1955వ సంవత్సరంలో తన ఇంటిని, ఆవరణము అంతటిని ప్రభువు సేవకొరకై అర్పణగా ఇవ్వవలెననే తన కోరికను సహోదరుడు భక్త్ సింగ్ గారికి తెలియజేయగా, దైవదాసుడు నిరాకరించి, “ఎవరికైనా ఇవ్వుము లేదా అమ్మివేయుము” అని సలహా ఇచ్చెను. అయితే ఈయన మాత్రం అప్పటినుండి పట్టు వదలకుండా పదే పదే సహోదరుడిని బ్రతిమాలుచుండెను. కావున, దైవదాసుడు రెండు సంవత్సరములు ప్రార్ధించిన పిమ్మట, ఇది ప్రభువిచ్చిన పిలుపు ద్వారానే అప్పాజీగారు ప్రేరేపించబడెనని ఒప్పించబడిన తరువాత, ప్రభువు సేవ కొరకు ఆ స్థలాన్ని స్వీకరించేందుకు ప్రభువే కృప చూపించెను. అప్పాజీగారి మొత్తం స్థిరాస్తిని ఒకే సారి బహుమతిగా ఇవ్వటానికి, మరియు 1957 వరకు అమలులో ఉన్న చట్టపరమైన కొన్ని నిబంధనల కారణంగా, పూర్తి ఆస్తిలో కొంత భాగమైన ఈయన పూర్వ నివాస గృహమును సేల్ డీడ్ గా 25000 రూపాయలకు ఇంకా మొత్తం ఖర్చులన్నియు ఈయనే భరించి, అప్పటికి సంఘానికి అధికారికంగా సంస్థలేని కారణాన, దైవదాసుడు భక్త్ సింగ్ గారి పేరుమీద 1957 మే 23న చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేసితిరి. 1958నాటికి చట్టపరమైన సమస్యలన్నీ తొలగించబడగా, మిగతా స్థలమంతయు కూడా దైవదాసుని పేరుమీదే గిఫ్ట్ డీడ్ గా రిజిస్ట్రేషన్ చేసితిరి. తదనంతరము, 1971 లో ఏర్పడిన “ది సొసైటీ అఫ్ ట్రస్టీస్ అఫ్ ఇండీజీనస్ చర్చిస్ ఇన్ ఇండియా” సంస్థ తరుపున సహోదరుడు భక్త్ సింగ్ గారు ఈ ఆస్తినంతటిని సంస్థకు బదిలీచేసితిరి.
సంఘ వ్యవస్థ నడవటానికి నూతన నిబంధన కాలములో ఉన్నటువంటి నాటి ఫిలోమోను బౌతికంగా ఏ విధముగా సహకారిగా ఉండెనో, అదే విధముగా నేటి ఫిలోమోనుగా ఈ అప్పాజీగారు నిబద్ధతతో, తన విశ్వాస జీవితమంతయు చివరివరకు సంఘానికి సహకారిగా జీవించితిరి.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.

kishor adepu