సహోదరుడు బి జె పాల్ గారు (1922-2003) జెహోవాషమ్మా కాలము నుండి ఉన్న పాతకాల సేవకునిగా ఈయన సుపరిచితులు. దేవుని సేవకుడు, అనువాదకుడు, పాటల రచయిత, సంగీత నిపుణుడు, సహోదరుడు భక్త్ సింగ్ గారితో సహసేవ – పలు సంఘాల స్థాపనకు మార్గదర్శకుడు.

నేటి విశ్వాస నాయకుడు
సహోదరుడు బి జె పాల్,
పరలోక పిలుపు : 16 మే 2003,
దేవుని సేవకుడు, అనువాదకుడు, పాటల రచయిత, సంగీత నిపుణుడు, సహోదరుడు భక్త్ సింగ్ గారితో సహసేవ – పలు సంఘాల స్థాపనకు మార్గదర్శకుడు.

సహోదరుడు బి జె పాల్ గారు (1922-2003) జెహోవాషమ్మా కాలము నుండి ఉన్న పాతకాల సేవకునిగా ఈయన సుపరిచితులు. 1950 సెప్టెంబరు 25న సహోదరుడు భక్త్ సింగ్ గారితో జెహోవాషమ్మా నుండి బయలుదేరి మధ్యలో సువార్త పరిచర్య చేసుకొంటూ హైదరాబాదుకు తరలి వచ్చిన వారిలో ఈయన కూడా ఒకరు. హైదరాబాదులో మొట్టమొదటి ప్రభువు దినము, బల్ల 1950 అక్టోబర్ 1న వీరికి ఆశ్రయమిచ్చిన సహోదరుడు లారెన్స్ గారి గృహములో జరుగగా, మొదటి సండే స్కూల్ పరిచర్య జరిపే ఆధిక్యత ప్రభువీయనకు అనుగ్రహించెను. 1952 సెప్టెంబరు, విశాఖపట్నంలో మొదటిగా స్థాపించబడిన మిస్పా సంఘమునకు ఈయనే మొదటి సేవకుడు. ఈయనను సీయోను పాటలకు లీడర్ గా అభివర్ణించవచ్చును. ఎందుకనగా ఈ పాటల పుస్తకములో ఎక్కువ శాతం పాటలు ఈయన సమకూర్చినవే! ఈయనకు క్రైస్తవ సాహిత్యమంటే బహుప్రీతి, ముఖ్యముగా పద్యములు, గీతములు కూర్చి, ఈ సేవ ద్వారా తన రక్షకుని హెచ్చించి, మహిమ పరచడమే కాక, ఈ గీతముల ద్వారా అందరూ మన ప్రియ ప్రభువును స్తుతించటానికి ప్రభువే ఈయనను ఉపయోగించుకొనెను. ఈయన ప్రతిభను గుర్తించిన సహోదరుడు భక్త్ సింగ్ గారు, 1952 పరిశుద్ధ సమాజ కూడికలలో పాటలు పాడే నిమిత్తం, అప్పటివరకున్న పాటలన్నియు కలిపి, విషయసూచిక ఆధారంగా సంకలనం చేసి ఒకే పుస్తకంగా ముద్రించి, తొలిగా ప్రచురించే భాద్యతలను బి జె పాల్ గారికి అప్పగించితిరి. ఈ సంతోషకర సందర్భములో “లెమ్ము తేజరిల్లుము నీకు” అనే పాటను రచించి ఆపుస్తకములో కలిపితిరి.

ఈయన ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, చెందోడు గ్రామములో 1922 అక్టోబరు 14 న, పూర్వ పితరుల నుండి నిష్ఠ కలిగిన క్రైస్తవ కుటుంబమైన బూదూరు జోసెఫ్, లీలావతి దంపతులకు ఏకైక సంతానంగా జన్మించిరి. ఈయన తాత యాకోబయ్య, నాయనమ్మ రాహేలమ్మ గొప్ప ప్రార్ధనా పరులు. ఈయనకు పౌలుగా నామకరణము చేసి, అపొస్తలుడైన పౌలువలె దేవుని సేవకుడౌతాడని ప్రవచించిరి. ఈప్రకారమే, ఈయన దేవుని ఏర్పాటులో ఉన్న కారణాన అతి చిన్న వయస్సులోనే రెండు సార్లు విష సర్పము నుండి, ఒకసారి తీవ్ర జ్వరపీడితుడై పోయిన ప్రాణము తిరిగి వచ్చెను. ఇలా ఎన్నో ప్రాణాపాయముల నుండి ప్రభువే తప్పించెను. ఈయన భయభక్తులతో పెంచబడుచూ, విద్యాభ్యాసమంతయు ముగించుకొని, మక్కువతో కర్ణాటక సంగీతములో పట్టా సంపాదించి, వృత్తిపరంగా సినిమారంగంలో స్థిరపడాలని ఆశించారు. కానీ ఈయనను ప్రభువు ఏర్పాటులోనుండి తప్పి పోకుండా, ఈయనకు ఇవ్వబడిన తలాంతుల ద్వారా తిరిగి ప్రభువే మహిమ పరచబడేలాగున ఈయనను స్థిరపరచెను. తర్వాత, 1945 ఆగష్టు 29న, 1యోహాను 1,9, 1పేతురు 1,19, ఎఫెసీ 2,18 ప్రకారము తన పాపములు కడుగబడినవని విశ్వసించి, రక్షణ నిశ్చయత లోనికి వచ్చి బాప్తిస్మము తీసుకొనిరి. అనతి కాలములోనే, యెషయా 41:8-13 ప్రకారము దేవుడు పూర్తి కాల సేవకు పిలిచినాడు. వెంటనే లోబడి, చేస్తున్న ఉద్యోగమునకు రాజీనామా చేసి, తన తల్లి తండ్రులకు తెలియచేయగా బహుగా సంతోషించితిరి. కానీ వారి సంతోషము ఎంతోకాలము నిలవలేదు. ఎందుకనగా, ఈయనకు స్పష్టమైన దేవుని పిలుపు ఏమంటే, సమస్తమును విడచిపెట్టి, 1945, నవంబర్ 2వ తేదీ నుండి ప్రభువు నడిపించు చొట్లకెల్లా వెళ్లవలెనని ప్రభువే సెలవిచ్చెను. దీనికి ముందు రోజు 1వ తేదీన సహుదరుడు భక్త్ సింగ్ గారు రైలులో మద్రాసుకు వెళ్లుచుండగా, ఆనాటి సేవకుడైన లాజరస్ గారు ఈయనను గూడూరు రైల్వే స్టేషనుకు తీసుకెళ్లి, ఈయన సేవా తీర్మానము కొరకు దైవ దాసునితో చేయించిన ప్రార్ధన ద్వారా ఎంతో బలపరచబడ్డారు. బి జె పాల్ గారు ప్రభువు బయలుపరచిన సేవా పిలుపైన 2వ తేదీనే ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడచి, సాధు సుందర్ సింగ్ మాదిరి, బైబిలు, కట్టుబట్టలతో తప్ప, కాళ్ళకి జోళ్ళు, చేతిలో పైసా కూడా లేకుండా, ప్రభువు నడిపించిన విధంగా, ముందుగానే అన్ని సరిచేసుకోవాలి కాబట్టి, గూడూరు నుండి నెల్లూరులో ఉన్న తన యజమానిని కలిసికొని రాజీనామా ఆమోదింపచేసుకొనిరి.

బి జె పాల్ గారు తన సువార్త సేవా ప్రయాణములలో ఎప్పుడు, ఎవరిని, ఏమి అడగకుండా పూర్తి విశ్వాసము ద్వారా, ప్రభువు చూపించిన మార్గములో మాత్రమే నడిపించబడవలెననే తీర్మానంతో బయలుదేరిరి. ఈయన పరిచర్య ప్రయాణ వివరములు :

1. నెల్లూరు : 1945, నవంబర్ 2వ తేదీ రైలు ప్రయాణములో ప్రభువు ప్రేరేపణతో అప్పటికప్పుడు “చరితం, సుచరితం, శ్రీయేసుని జీవితం” అనే పాట కట్టి, బైబిలు పట్టుకొని పాడుచుండగా బిక్షగాడనుకొని పైసలు ఇవ్వచూపిరి. అందుకు ఈయన నేను మిమ్మల్ని ఏమి అడగటంలేదు, నేనే మీకు రక్షణ సువార్త ఇస్తున్నాను అని చెప్పెను. ఇదే ఈయన మొదటి సువార్త ప్రకటన.

2. విజయవాడ : 1945 నవంబర్ 5 వరకు, పరిచయమైన జాన్ గారు, ఈయనను ముఖ్య ప్రసంగీకుడుగా 3 రాత్రులు బహిరంగ సువార్త కూటములు జరిపించితిరి. ఇదే ఈయన మొదటి సువార్త పరిచర్య.

౩. రాజమండ్రి : 1946 ఫిబ్రవరి మొదటి వారము వరకు ఆత్మల రక్షణార్ధము సువార్త కూటములు జరిగించితిరి.

4. కాకినాడ : ఫిబ్రవరిలో కొన్ని రోజులు, ఒంటరిగా సువార్తను ప్రకటించితిరి.

5. వైజాగ్ : 1946 జూన్ వరకు సుమారు నాలుగు నెలలు పాస్టర్ పెర్సీ లాజరస్ గారు, పాస్టర్ కాంతారావు గార్ల ఆధ్వర్యములో సువార్త కూడికలు. అక్కడే 27 పూర్తి రాత్రులు వరుసగా సముద్రపు ఒడ్డున ఏకాంతముగా ప్రార్ధించితిరి.

6. ఖరగ్ పూర్ : ౩ దినముల పరిచర్య. ఐజాక్ న్యూటన్ గారి పరిచయం.

7. కలకత్తా : 1946 జూన్, ఒక నెల, జార్జ్ స్టీఫెన్ సన్ గారి పరిచయం, గృహాలలో కూడికలు.

8. న్యూఢిల్లీ : 1946 జూలై సహోదరుడు అబ్రహం జోసెఫ్ గారు పరిచయం మరియు ఆయన రక్షణ, తరువాత కడపలో ఎక్కువ కాలం సేవ చేసాడు. ఆయన మిలిటరీ క్యాంపులో 15 దినముల పరిచర్య.

9. శ్రీనగర్ : 1946 ఆగష్టు 12, చంద్రా పండిట్ పరిచయం. ఆయనతో కలసి ప్రార్ధన.

10. పెహాల్ గాం : ఈయన చిన్నప్పటినుండి పరిచయస్తుడుగా అక్కడ కలసిన కే జాకబ్ గారితో కలసి అమరనాధ్ యాత్రికులకు సువార్త ప్రకటన.

11. అమరనాథ్ : హిమాలయ పర్వతములలో ఒకటైన ప్రశాంతమైన కోలహొయ్ పర్వత శ్రేణిలో, సాధు సుందర్ సింగ్ జీవిత ప్రేరేపణతో, 7 వారములు ధ్యానములో గడిపే కాలములో దైవ మహిమను చూచి పరవశుడై ప్రేరేపణతో పుష్పగుచ్ఛము అనే శీర్షిక మీద 36 పద్యములు రచించితిరి.

12. అనంతనాగ్ : పండిట్ మోహన్ లాల్ ఏర్పాటు చేసిన సభలలో సువార్త ప్రకటన.

13. శ్రీనగర్ : 1947 జనవరి సి ఎ హిట్టర్ గారు ఆహ్వానించగా నెల రోజులు సువార్త ప్రకటించిరి. 1946 ఆగష్టు నుండి 1947 జనవరి వరకు కాశ్మీరులో ఉన్నకాలం 6 నెలలు.

14. కలకత్తా : 1947 ఫిబ్రవరి, జార్జ్ స్టీఫెన్ సన్ గారు ఈయన నిష్ఠ కలిగిన జీవితాన్ని గ్రహించి, సాధు సుందర్ సింగ్ గారి కాషాయ వస్త్రములే నీకు తగినవని, రెండు జతల నిలువుటంగీలు కుట్టించి ఈయనకిచ్చిరి.

15. గూడూరు : 1947 ఫిబ్రవరి ఈయన తల్లిదండ్రులను, అందరిని కలసి ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన నమ్మకత్వము, ఆత్మల రక్షణ గూర్చి సాక్ష్య మిచ్చితిరి.

16. మద్రాసు : 1947, దక్షిణ భారత దేశ సువార్త సేవా ప్రయాణములలో భాగంగా, మొదటిగా ప్రభువు ప్రేరేపణతో జెహోవాషమ్మాకు వెళ్లి సహోదరుడు భక్త్ సింగ్ గారిని కలువగా, కాషాయ వస్త్రములంటే సహుదరునికి ఇష్టము లేకపోయినప్పటికీ, ఈయనను ఆహ్వానించి అక్కడ ఉండనిచ్చితిరి. దేవునికి నమ్మకంగా జీవించడమే ముఖ్యమైన సాధుత్వం. దీనికి సాధు సాంప్రదాయము అవసరం లేదనే సహోదరుడు భక్త్ సింగ్ గారి సలహాతో చివరికి ఈయన ఏకీభవించి కాషాయ వస్త్రములు తీసివేయటానికి నిశ్చయించగా, వెంటనే సహుదరుడు రెండు జతల తెల్ల డ్రెస్, పైన ధరించె రెండు కోట్లు ఈయనకు కుట్టించిరి. అప్పట్లో దీనమైన పరిస్థితులలో అందరు ఉండేవారు. కావున, ఈయన ధరించిన కొత్త వస్త్రములను బట్టి, నీవు ధన్యుడవు అని అక్కడున్న సేవకులందరు సంతోషించిరి. జనవరి 30,1948లో, గాంధీ హత్య అనంతరం దేశ నాయకులు, కొంతమంది పాస్టర్లు కూడా దిన పత్రికలలో, రేడియోలలో గాంధీని ప్రభువైన యేసు క్రీస్తుతో, సమానంగా పొల్చటం తట్టుకోలేని ఈయన, ఈ లోకంలో యేసు ప్రభువుతో పోల్చదగిన వ్యక్తి లేడనే హృదయభారంతో “ప్రేమామృత ధారలు చిందిన మన యేసుకు సమమెవరు” అనే సువార్త గీతము కట్టిరి. సీయోను గీతములలో ఈయనచే పొందుపరచిన మొదటి పాట ఇదే. 1950 వరకు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతములలో అనేక చోట్ల సహోదరుడు భక్త్ సింగ్ గారితో కలసి పరిచర్య, తర్జుమా, ఇంకా పాటలు కట్టి పాడటంలోను ప్రభువు ఈయనను వాడుకున్నాడు.

17. హైదరాబాద్ : 1950-1951 వరకు ఏలీములో ఉంటూ దైవదాసునికి తర్జుమాదారునిగా, ఇంకా పరిచర్యలలో పాలుపంచుకొనుచూ కొనసాగిరి.

18. రాజమండ్రి, కొవ్వూరు : 1951-1952 వరకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో సువార్త ప్రకటన.

19. విశాఖపట్నం : 1952 సువార్త ప్రకటన, సెప్టెంబరులో మొదటిగా ప్రభువు దినపు ఆరాధన, ప్రభువు బల్ల డాక్టర్ లాజరస్ గారి బంగళాలో మేడ మీద, ఈయన మొదటి సేవకుడిగా ప్రారంభించితిరి. తరువాత మొదటిగా అక్కడే 18 మందికి బాప్తిష్మము ఇచ్చి దేవునిరాజ్యముకొరకు సిద్ధపరచితిరి. తరువాత, రామనగర్ లో అద్దెకు ఇల్లు తీసుకొని, మిస్పా అని పేరు పెట్టి ఆరాధన కొనసాగించిరి.

20. పరిచర్య చేసిన సంఘములు : 1953-1963 వరకు మచిలీపట్నం, కర్నూల్, గుంటూరు, కొత్తగూడెం, చీరాల.

21. రాజమండ్రిలో 1963-1974 వరకు స్వతంత్రంగా సేవ చేసికొనుచూ, అలాగే గూడూరు సమీపములో 1974-1979 వరకు చెందోడు గ్రామములో ఉంటూ, బిల్లీ గ్రాహం గారి సువార్త బృందానికి, రీజినల్ కోఆర్డినేటర్ గా 1966-1979 వరకు ఇండియా అంతా పర్యటించుచూ 1979 నాటికి తిరిగి హెబ్రోన్ – హైదరాబాద్ చేరితిరి.

22. పరిచర్య చేసిన సంఘములు : 1979-2003 వరకు తెనాలి, నంద్యాల, మలక్ పేట, బోరబండ, హెబ్రోన్-హైదరాబాద్. చివరి వరకు, సంఘములలో సేవా కార్యక్రమములతో పాటు, పాటల పరిచర్యల భాద్యతలు కూడా వహించిరి.

సహుదరుడు బి జె పాల్ గారి పరిశుధ వివాహము 1958 జూలై 16న హైదరాబాద్ వాస్తవ్యులైన సహోదరుడు శాంసన్, జీవమని దంపతుల ప్రథమ పుత్రికయిన సహుదరి వరలక్ష్మితో, ఏలీములో సహోదరుడు భక్త్ సింగ్ గారు జరిపించితిరి. ఈమె అప్పటికే సేవకు సమర్పించుకొని, పెళ్ళైన వెంటనే తన ఉద్యోగమునకు రాజీనామా చేసిరి. ప్రభువు వీరిని దీవించి ప్రిన్స్ జోసెఫ్ అనే కుమారుని, హన్నా సలోమి అనే కుమార్తెను, ముగ్గురు మనవళ్లతో, ఇద్దరు ముని మనవళ్లతో ఆశీర్వదించెను. వీరు బహుగా దీవించబడి తమ బాధ్యతలతో పాటు ప్రభువు సేవా పరిచర్యను కూడా విస్తారముగా నిర్వర్తిస్తున్నారు. ప్రభువు నమ్మకత్వాన్ని తన జీవితంలో అడుగడుగునా రుచిచూచిన బి జె పాల్ గారు, అదే అనుభవంతో జీవితం చివరివరకు నమ్మకముగా ప్రభువుని సేవించితిరి.

జాన్ మైఖేల్, రాజమండ్రి.