
నేటి విశ్వాస నాయకుడు
వారెన్ వెండెల్ వీర్స్ బీ,
పరలోక పిలుపు : 02 మే 2019,
బైబిల్ పండితుడు, వేదాంతవేత్త, కాన్ఫరెన్స్ స్పీకర్, ఫలవంతమైన క్రైస్తవ రచయిత.
వారెన్ వెండెల్ వీర్స్ బీ, (1929- 2019) మంచి పేరున్న అమెరికన్ క్రైస్తవ బైబిల్ బోధకుడు, రచయిత. ఈయనను పాస్టర్లకు పాస్టర్ గా అభివర్ణిస్తారు, ఈయన రాసిన “BE” సిరీస్ ద్వారా కోట్లాదిమందికి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో సహాయం చేసినవారిగా గుర్తిస్తున్నారు. Be Joyful, Be Obedient, Be Mature, Be Real వంటి అనేక గ్రంథాలు రచించారు. ఈ పుస్తకాలు బైబిల్లోని ప్రతి గ్రంథానిపై ఆధారపడిన వ్యాఖ్యానాలు, ఆత్మీయ పాఠాలు కలిగి ఉన్నాయి. ఇవి ఈవాంజెలికల్ మతసంఘాల్లో చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.
వారెన్ వీర్స్ బీ 1929 మే 16న ఇండియానా రాష్ట్రంలోని ఈస్ట్ చికాగోలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు ఫ్రెడ్ మరియు గ్లాడిస్ వీర్స్ బీ. తల్లి స్వీడిష్ కాగా తండ్రి జర్మన్ వంశానికి చెందినవారు. వాషింగ్టన్ హై స్కూల్లో విద్యార్థిగా ఉన్నపుడు, 1945లో జరిగిన యూత్ ఫర్ క్రైస్ట్ ర్యాలీలో ఈయనకు రక్షణానందము పొంది, క్రైస్తవ విశ్వాసంలో స్థిరంగా నడవడం మొదలుపెట్టారు. ఇదే ఈయన జీవితంలో క్రైస్తవ సేవకు బీజం వేసిన ఘట్టం.
పూర్తి స్థాయి బోధకు సిద్ధమయ్యే ప్రయాణంలో భాగంగా, ఈయన ఇండియానా, రూసవెల్ట్ యూనివర్సిటీలలో చదువుకున్నారు. అనంతరం 1953లో నార్దెర్న్ బాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ చదువుతూనే పాస్టర్ గా సేవ ప్రారంభించారు. మొదటగా సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్ లో 1957 వరకు సేవ చేశారు. అనంతరం యూత్ ఫర్ క్రైస్ట్ మరియు ఇతర సంస్థల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు.
1961–1971 వరకు ఈయన కెంటకీలోని కల్వరి బాప్టిస్ట్ చర్చ్ లో పాస్టర్గా విధులు నిర్వహించారు. ఈ కాలంలో సంఘం విస్తరించి, ఎదుగుదల సాధించింది. 1971–1978 మధ్య చికాగో నగరంలోని ప్రసిద్ధ మూడి చర్చ్ లో పాస్టర్గా సేవలందించారు. ఆ తరువాత 1980 నుండి 1992 వరకు “Back to the Bible ” రేడియో మినిస్ట్రీలో డైరెక్టర్గా పనిచేశారు. ఈయన రాసినవి నేటికీ అనుదిన ధ్యానాలుగా మనము రోజూ చదువుకొనుచున్నాము.
ఈయన వివిధ థియాలజీ సెమినరీల్లో బోధించారు. 1995లో కార్నర్ స్టోన్ యూనివర్సిటీలో “Writer in Residence”గా చేరారు. అదే సమయంలో ప్రచార బోధనలో విశిష్ట ప్రొఫెసర్ లేక బోధకుడుగా హోదా పొంది గౌరవించబడ్డారు. వారెన్ వీర్స్ బీ 150కి పైగా గ్రంథాలను రచించారు. తన ఆత్మకథ “Be Myself : Memoirs of a Bridgebuilder” ద్వారా తన సేవా ప్రయాణాన్ని పంచుకున్నారు.
వారెన్ వీర్స్ బీ 2019లో, తన 90వ పుట్టినరోజు కొద్ది వారాల ముందు నెబ్రాస్కా రాష్ట్రంలోని లింకన్ నగరంలో తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి ముందుగా తన భార్య బెట్టీతో కలిసి తన వ్యక్తిగత గ్రంథాలయాన్ని దాదాపు 13,000 పుస్తకాలు, ఓహియోలోని సిడర్విల్లే యూనివర్సిటీకి దానం చేశారు. ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒక అమూల్యమైన జ్ఞానవనరుగా నిలుస్తోంది.నిలిచిపోయింది.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.