ప్రార్థనా చింత!

కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి —పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక.
—మత్తయి 6:9

మనం ప్రార్థన ఎలా చేయాలో ప్రభువిక్కడ ఒక నమూనా ఇస్తున్నారు. ఇది వల్లె వేసే ప్రార్థన కాదు. మన ప్రార్థనలన్నిటినీ నిర్దేశించి సరిచేసే మాదిరి ప్రార్థన. అంటే ఈ ప్రార్థన మాదిరిగానే మన ప్రార్థనలన్నీ ఉండాలన్నది గూడార్థం!

సాధారణంగా మన ప్రార్థనల్లో మన చీకూచింతలు, మన సాధకబాధకాలు, మన ఆశలు అవసరాలు అగ్ర భాగాన ఉంటాయి. అందుకు భిన్నంగా ప్రార్థనలో దేవుడి విషయాలే మనకు ప్రాదమ్యంగా ఉండాలని ప్రభువు నేర్పిన ప్రార్థన మనకు స్పష్టం చేస్తోంది. ఇదే అధ్యాయంలో ఆయన “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి” అన్నారు (మత్త. 6.33a). అంటే, మన ప్రార్థనల్లో కూడా దేవుడు, ఆయన పరిచర్య మనకు “మొదటి చింత” కావాలన్న మాట. ప్రార్థనలో మనకంటే, మన అవసరాల కంటే దేవుడు మనకు “ప్రధానం” అయినపుడు మనం మిగిలిన విషయాల గురించి పెద్దగా చింతించాల్సిన పనిలేదు ఎందుకంటే మన అవసరాల గురించి ఆయన పట్టించుకుంటాడు (మత్త. 6.33b). నిజానికి ఈ “దైవ చింత” మనల్ని మిగిలిన చింతలన్నిటి నుంచీ విడిపిస్తుంది.

మరి, మన ప్రార్థనల్లో అగ్రభాగాన ఉండాల్సిన “దేవుని ప్రాదమ్యాలు” ఏవి? ప్రభువు మాటల్లో చెప్పాలంటే అవి—దేవుని నామం, దేవుని రాజ్యం, దేవుని చిత్తం. మన పేరు, మన రాజ్యం, మన చిత్తాలు కావు. ఆయన నామం అంటే ఆయన వ్యక్తిత్వం. ఆయన అతి పరిశుద్ధుడు. తండ్రి ఐన దేవుడి దగ్గర ఎంత చనువు ఉందో, పరిశుద్ధుడైన దేవుడి దగ్గర అంత భయం కూడా ఉండాలి. ఆయనకు తగ్గ పూజ, గౌరవం, ఆరాధన ఆయనకు దక్కాలి. “యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి” (కీర్త.29.2). లోకమంతా ఆయన్నే దేవుడిగా గుర్తించి, పూజించాలి. “సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి…..సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి…..సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా, ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి” (కీర్త. 96.1,9; 117.2). దేవుని నామం సదా పవిత్రంగా గౌరవం పొందాలి. ఇది ప్రార్థనలో మన మొదటి చింత!

మానవుని అవిధేయత వల్ల ఈ లోకాన్ని అపవాది ఆక్రమించి ఏలుతున్నాడు. ప్రభువు వాడ్ని “లోకాధికారి” అని సంబోధించారు (యోహా.12.31; 14.30; 16.9). సాతాను ఆక్రమిత రాజ్యం మధ్య ప్రభువు రాజ్యం వ్యవస్థాపితం కావాలి. “…పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.” (మత్త.11.12) దేవుని రాజ్యానికి గట్టి ఎదుర్కోలు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. పరలోక రాజ్యం ప్రబలే కొద్దీ లోకాధికారి ఎదురొడ్డి నిలుస్తూనే ఉంటాడు. ప్రార్థన ద్వారానే ఈ ఎదుర్కోలును అధిగమించగలం (దాని.10.12-13). అందుకే దేవుని రాజ్య విస్తరణ ప్రార్థనలో మన ప్రాదమ్యం కావాలి. దేవుని రాజ్యం సదా విస్తరించాలి. ఇది ప్రార్థనలో మన రెండో చింత!

ప్రార్థన అంటే మన చిత్తాల్ని నెరవేర్చుకోవడం కాదు. ప్రభువు చిత్తం నెరవేర్చడం! మన చిత్తాల్ని ప్రభువు చిత్తానికి లోబరచడం అంత సులభమైన పని కాదు. ప్రార్థనలోనే ఈ విధేయత మనం నేర్చుకుంటాం. ఈ విషయంలో మన ప్రభువుకు మించిన మాదిరి, స్ఫూర్తి మరెవ్వరూ లేరు. ఆయన సిలువకు ముందు గెత్సేమనేలో “తండ్రీ,… నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక” (లూకా 22.42) అని ప్రాధేయపడ్డాడు. ఆయన ప్రార్థన ద్వారా, శ్రమ పొంది విధేయత నేర్చుకున్నాడు (హెబ్రీ.5.7-8). బలులనైనా నైవేద్యాలనైనా దేవుడు కోరడు. ఆయన అంతిమంగా మన నుంచి కోరేది—విధేయతే! (హెబ్రీ 10.5-7). నిజానికి ప్రభువుకు విధేయత చూపే వాడే నిజమైన క్రైస్తవుడు (మత్త.7.21). “ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి” (రోమా 11.36). పరలోకంలోనూ, భూమి పైనా ఆయనదే సర్వాధిపత్యం (మత్త.28.18). ప్రతీ మోకాలు ఆయన ముందు వంగవలసిందే (ఫిలి.2.9). అందుకనే పరలోకంలోనూ, భూలోకంలోనూ దేవుని చిత్తం నెరవేరాలి. అంతకంటే ముందు ప్రార్థించే మన జీవితాల్లో ఆయన చిత్తం నెరవేరాలి. ఇది ప్రార్థనలో మన మూడో చింత!

ప్రభువు నేర్పిన ప్రార్థన ద్వారా ప్రార్థించడం నేర్చుకుందాం!

మీ ప్రకాష్ గంటెల