క్రైస్తవ విమర్శ

అసలు విమర్శించడమే తప్పు అన్నది కొందరి అభిప్రాయం. “మీరు విమర్శించకండి బ్రదర్!” అని చెప్తుంటారు కొందరు. “విమర్శించకండి…ఎందుకు విమర్శిస్తారు” అనడం కూడా విమర్శనే! విమర్శ అంటే లోతైన ఆలోచన, విశ్లేషణ, పరిశీలన, పరీక్ష, పరిశోధన,… ఇవీ అర్థాలు. అందువల్లనే పునర్విమర్శ, సద్విమర్శ, ఆత్మ విమర్శ, పూర్వ విమర్శ వంటి పదాలు ఎప్పట్నుంచో తెలుగులో వాడుకలో ఉన్నాయి. మానవ జీవితంలో విమర్శ అనివార్యం—అది పర విమర్శ ఐనా, ఆత్మ విమర్శ ఐనా! క్రైస్తవంలో ఇది మరింత సత్యం!

క్రైస్తవ విమర్శ

Friday, June 21, 2024

“వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.”
— యోహా. 7:24

సలు విమర్శించడమే తప్పు అన్నది కొందరి అభిప్రాయం. “మీరు విమర్శించకండి బ్రదర్!” అని చెప్తుంటారు కొందరు. “విమర్శించకండి…ఎందుకు విమర్శిస్తారు” అనడం కూడా విమర్శనే! విమర్శ అంటే లోతైన ఆలోచన, విశ్లేషణ, పరిశీలన, పరీక్ష, పరిశోధన,… ఇవీ అర్థాలు. అందువల్లనే పునర్విమర్శ, సద్విమర్శ, ఆత్మ విమర్శ, పూర్వ విమర్శ వంటి పదాలు ఎప్పట్నుంచో తెలుగులో వాడుకలో ఉన్నాయి. మానవ జీవితంలో విమర్శ అనివార్యం—అది పర విమర్శ ఐనా, ఆత్మ విమర్శ ఐనా! క్రైస్తవంలో ఇది మరింత సత్యం!

“మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు” (మత్త.7.1). ఇలాంటి వచనాలు ప్రస్తావించి, “చూశారా! విమర్శించడం తగదు” అంటూ కొందరు హితవు చెప్తుంటారు. “తీర్పు తీర్చకండి” అని చెప్పిన ప్రభువే “తీర్పు తీర్చండి” అని మరొక చోట చెబుతున్నారు (మత్త.7.1; యోహా.7.24 పోల్చి చూడండి!). “మరియొక చోట వ్రాయబడియున్నదని” వాక్యంతో శోధించడానికి వచ్చిన అపవాదికి ప్రభువు బుద్ధి చెప్పినట్టు (మత్త.4:7) మనం కూడా వాళ్ళకు హితవు చెప్పాలి. వాక్యాన్ని వాక్యంతో పోల్చి చూస్తే తప్ప సత్యం బోధపడదు—అంటారు ఇరవయ్యో శతాబ్దపు సర్వోత్తమ బైబిల్ వ్యాఖ్యాతగా పేరు పొందిన కామ్ప్బెల్ మోర్గన్. పదాలకు సందర్భాన్ని బట్టే అర్థం చేకూరుతుంది. వాక్యాధ్యయనంలో ఇది ప్రాథమిక సూత్రం!

మన ప్రభువు నాటి అభిషిక్తుల్ని, నాయకుల్ని నిశితంగా వ్యతిరేకించాడు, విమర్శించాడు.

మత్తయి ఏడో అధ్యాయంలో అసలు విమర్శ చెయ్యొద్దు అని ప్రభువు చెప్పడం లేదు. విమర్శ చేసేటప్పుడు జాగ్రత్త! మీరు చేసే విమర్శ కొలతతోనే దేవుడు మిమ్మల్ని కూడా విమర్శ చేస్తాడు—అంటున్నాడు (మత్త.7.2). మొదట మిమ్మల్ని సరిచేసుకుని అవతలి వారిని సరిచేయండి అంటున్నాడు. అంటే, పర విమర్శకు ముందు ఆత్మ విమర్శ చేసుకోండి అంటున్నాడు (మత్త.7.4; యాకో.2.10,11). అలా చేయకపోతే అది కపట నీతి అంటున్నాడాయన (మత్త.7.5).

మన పాపం మన కంట్లో దూలంలా మారిపోతుంది. అది మన లోపాల్ని చూడకుండా మనల్ని గుడ్డి వాళ్ళను చేస్తుంది (మత్త.7.4,5). మనం తాగుబోతులను చిన్న చూపు చూస్తాం. కానీ మనకే ఎన్నో వ్యసనాలు ఉంటాయి. అది సెల్ఫోన్ కావచ్చు, డబ్బు కావచ్చు, టీవి సీరియల్ కావచ్చు, బూతు మాటలు కావచ్చు, గాసిప్ కావచ్చు, అందం కావచ్చు, మరొకటి కావచ్చు. నర హత్య పాపమే. కానీ పక్క వాడ్ని ‘వ్యర్థుడా’ లేక ‘పనికిమాలిన వాడా’ అంటే అది నరహత్యే అన్నారు ప్రభువు. వ్యభిచారం పాపమే. కానీ మోహపు చూపులు, కామ తలంపులు, అశ్లీల చిత్రాల వీక్షణం కూడా వ్యభిచారమే (మత్త.5.22,27,28; cf. కొల.3.5; 1 థెస్స.4.4). ప్రభువు దృష్టిలో మానసిక పాపులు, శారీరక పాపులు ఒక్కటే. అది మరచి కొందరినే బ్రాండ్ చేసి పాపులని తీర్పు తీర్చడం తప్పు అంటున్నారు ప్రభువు (మత్త.7.1-2). ఇలాంటి విమర్శ తగదు!

ఇదే మాటలు పౌలు కూడా చెప్తున్నాడు. తామే నీతిమంతులం, అన్యులంతా పాపులు అని తీర్పు తీర్చే యూదులను హెచ్చరిస్తున్నాడు పౌలు (రోమా.2.1). అన్నపానాల విషయంలో, దినాల పట్టింపు విషయంలో ఒకరినొకరు తీర్పు తీర్చుకోకండి అని పౌలు గట్టిగా చెప్పాడు (రోమా 14.3,4,10,13). ఇక్కడ విమర్శ చేయకూడదు అని కాదు. ఎందుకంటే ఇదే పౌలు మనం “లోపలి వారికి తీర్పు తీర్చాలి” అని చెప్తున్నాడు (1 కొరిం.5.13). అంచేత విమర్శ అనివార్యం! ఐతే ఎలా విమర్శిస్తున్నాం అన్నదే ప్రశ్న!

అవతలి వారికంటే తాము పరిశుద్ధులం అన్న వైఖరి పరిసయ్యుల వైఖరి (లూకా 18.11,12). ఇది దేవుడికి నచ్చని వైఖరి. ఆనాడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ప్రభువు ముందు నిలబెట్టినప్పుడు ఆయన ఆమెను వెనకేసుకు రాలేదు. కానీ ఆమె విమర్శకుల వైఖరిని ఆయన తప్పుబట్టారు (యోహాను.8.3-11). ఎందుకంటే పరమ పావనుడైన దేవుడు పరమ పాపులమైన మనల్ని క్షమించి, అంగీకరించి, అక్కున చేర్చుకున్నాడు. అటువంటిది “మన తోటి పాపుల” పట్ల మనం చూపే వైఖరి అహంభావంతో, ఆధ్యాత్మిక గర్వంతో ఉండకూడదు కదా!

ఈ మధ్య కొందరు సత్య బోధకులు అసత్య బోధకుల్ని దుర్భాషలాడుతున్నారు, కించపరిచి మాట్లాడుతున్నారు, పరుషంగా పళ్ళు కొరికి తిడుతున్నారు. ఇలాంటి విమర్శల్ని దేవుడు మెచ్చడు!

దైవజనుల్ని, అభిషిక్తుల్ని విమర్శించ కూడదు అన్న విమర్శ కూడా ఉంది! ఇది విచిత్రం! దైవజనులు జవాబుదారీతనం లేకుండా తప్పించుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ! మన ప్రభువు నాటి అభిషిక్తుల్ని, నాయకుల్ని నిశితంగా వ్యతిరేకించాడు, విమర్శించాడు (లూకా 18.9-14; మత్త.6.5,16; మార్కు 7.5-7; మత్త.23.15,23,27; లూకా 11.43-54; మత్త.21.45). బాప్తీసం ఇచ్చే యోహానూ వాళ్ళను విమర్శించాడు (మత్త.3.7). సంఘంలో పరిచారకుడు మాత్రమే ఐన స్తెఫను సైతం తనను చంపుతారని తెలిసి కూడా ప్రధాన యాజకుడ్ని, పరిసయ్యులను విమర్శించాడు (అపో.7.51-54). పౌలు తన తోటి అపోస్తలుడు, తనకంటే ముందటి వాడైన పేతుర్ని అందరి ముందే నిలదీశాడు (గల 2.11-14). బహిరంగంలో జరిగిన తప్పును బహిరంగంగానే విమర్శించాలి. బెరయా క్రైస్తవులు సాక్షాత్తూ పౌలు చెప్తున్న ప్రబోధాన్నే వాక్యం వెలుగులో నిశితంగా విమర్శిస్తూ అంగీకరించారు (అపో.17.11). క్రైస్తవ జీవనంలో, సహవాసంలో, పరిచర్యలో, వాక్య ప్రబోధంలో, చివరికి వినికిడిలో సైతం విమర్శ అనివార్యం!

ఐతే మన విమర్శ తోటి మనిషిని కించపరచేలా ఉండకూడదు. ప్రతి మనిషీ దేవుని పోలికే (యాకో.3.9,10). దేవదూతలు కూడా అపవాదిని దూషించడానికి తెగింపలేదని రాసి ఉంది (యూదా 1.9). ఈ మధ్య కొందరు సత్య బోధకులు అసత్య బోధకుల్ని దుర్భాషలాడుతున్నారు, కించపరిచి మాట్లాడుతున్నారు, పరుషంగా పళ్ళు కొరికి తిడుతున్నారు. ఇది తగదు! ఇలాంటి విమర్శల్ని దేవుడు మెచ్చడు! విమర్శించే వారిని కూడా దేవుడు అంత్య దినాన తీర్పు తీరుస్తాడనే స్పృహలో (మత్త.12.36,37; రోమా 14.10) ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఇతరుల్ని విమర్శించాలి (యాకో.5.8,9; లూకా 6.37,38).

క్రైస్తవ విమర్శలో కాస్త కృప కూడా ఉండాలి (యాకో.2.12; కొల.3.16; 4.6). మన విమర్శ ప్రేమ పూర్వకంగా, సత్యానుగుణంగా ఉండాలి (ఎఫె.4.15; యోహా.7.24). క్రైస్తవ విమర్శ వాక్యానుసారంగా ఉండాలి (cf.అపో 23.3; 17.11). ఎందుకంటే మన అభిప్రాయాలూ, ఆవేశాలూ సద్విమర్శకు గండి కొడతాయి. “…నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు” (యాకో.1:20). వాక్యమే సత్యం (యోహా.17.17). ఆత్మ విమర్శకైనా, పర విమర్శకైనా వాక్యమే ప్రమాణం. అది మారని దేవుని మాట. ఖండించడానికైనా, తప్పు దిద్దడానికైనా వాక్యమే ప్రమాణం (2 తిమో.3.16). ఆ వాక్యం వెలుగులోనే మనం అసలు బోధకుల్ని, నకిలీ బోధకుల్ని విమర్శించి తెలుసుకోవాలి (అపో.17.11; మత్త.7.15,16; cf.రోమా 16.17; తీతు.1.9).

ప్రభువు నామ మహిమ కోసం, సంఘ క్షేమం కోసం, క్రైస్తవ సమాజ శ్రేయస్సు కోసం, సత్యం ప్రబలడం కోసం, అసత్యాన్ని ఎత్తి చూపడం కోసం మనం విమర్శించాలే తప్ప వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం కోసం, అవతలి వ్యక్తిని అందరి ముందూ అవమానించడం కోసం మనం విమర్శ చేయకూడదు. అదే సమయంలో తమ తప్పుడు బోధలతో, వాక్య విరుద్ధ విధానాలతో బహిరంగంగా దేవుని నామాన్ని అవమానపరుస్తూ, ఆయన సంఘాన్ని పాడు చేస్తున్న వారిని మనం బహిరంగంగానే విమర్శించాలి. ఐతే మనం ప్రభువులా మనిషి హృదయాన్ని ఎరిగిన వాళ్ళం కాదు గనుక (యోహా.2.24) మన విమర్శ కంటికి కనిపించే “విషయాల” పైనే ఉండాలి తప్ప “వ్యక్తి” ఆంతరంగిక జీవితాన్ని దూషించేదిగా, అవమానించేదిగా ఉండకూడదు. విమర్శ అనివార్యమే గానీ క్రైస్తవ విమర్శ హద్దు మీరకూడదు. అది ఎప్పుడూ సద్విమర్శగానే ఉండాలి. మన విమర్శ కూడా మన విభునికి మహిమ తేవాలి!

—జీపీ

Previous Devotions

Comments (1)

Comments are closed.