
నేటి విశ్వాస నాయకుడు
సహూ. V క్రిష్టాఫర్ గారు
పరలోక పిలుపు : 18 మార్చి, 2007
నమ్మకమైన దైవ సేవకుడు, సువార్తికుడు, ఆత్మల విజేత.
సహూదరుడు వర్ధనపు క్రిష్టాఫర్ గారు (1928-2007) గొప్ప పేరున్న దేవుని సేవకునిగా గోదావరి జిల్లాల లోను, సహవాసములోను తెలియనివారులేరు. ఈయన రక్షింపబడినప్పటి నుండి ఆత్మల బారముతో సువార్త పరిచర్య చేయుచుండెడివారు. ఈ భారముతో ప్రభువు కొరకు ఈయన సంపాదించిన ఆత్మలు అనేకం. సహవాసములో ఉభయ గోదావరి జిల్లాలలో భీమవరము మొదటి సంఘము. ఈ సంఘములో పెద్ద సహుదరుడైన, అరవిందము గారి, ముఖ్య శిష్యుడిగా ఆయన వారసత్వమును పుణికి పుచ్చుకొని, ఆయన మాదిరిగానే సహూ. క్రిష్టాఫర్ గారు కస్టపడి చేసిన సేవ, పరిచర్య ఫలాలు అనుభవించినవారు అనేకులు. ఈయన బహు నిరాడంబర జీవి. దీన మనస్కుడుగా, దేవునికొరకు శ్రమలననుభవించుటయే మేలని ఎంచి, అందరకి ఎంతో మాదిరికరంగా జీవించిన దీనదాసుడు. ఎల్లప్పుడూ సంతోషముతో తన వద్దకు వచ్చినవారు, చిన్నా, పెద్దా తారతమ్యము లేకుండా, ఎవరైనాసరే సాదరంగా ఆహ్వానించి తగు మర్యాద ఇచ్చేవారు. ఈయన పెద్దతరహాగా, తండ్రి మనస్తత్వముతో అవసరంలో ఉన్న ఎంతోమందికి ఆత్మీయంగా, బౌతికంగా తగిన సలహాలు ఇస్తూ, తిరిగి దేవుని యొద్దకు నడిపిస్తూఉండేవారు. ఈలాగు ఈయన ద్వారా ఆత్మీయ మేలులు పొందిన వారనేకులు. భీమవరం పట్టణములో సంఘ, శాఖ బేధము లేకుండా అందరి మన్ననలు పొందిన దైవ సేవకులు. ఈవిధముగా క్రీస్తు ప్రేమను అందరు ఈయనలో చూడ గలిగితిరి. ఇకపోతే, విశ్వాస ఆధారిత పరిచర్యలో భాగంగా, ఈయన కుటుంబ అవసరాల నిమిత్తం, ప్రభువుమీదే ఆదారపడి జీవించడం తప్ప, ఈయనకు ఏమి తెలియదు. ఎప్పుడు, ఎవరికీ, ఏమి తెలియనివ్వలేదు. ఉదాహరణకు, ఈయన చదువులో చూపించిన ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వంవారు, బహుమతిగా గుంటూరులో ఇచ్చిన ఐదు ఎకరాల భూమి, ప్రభువు సేవ నిమిత్తము వదులుకొన్నారు. ఈలాగు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, నిబద్దతగా చివరి వరకు జీవించిరి.
సహూ. క్రిష్టాఫర్ గారు 1928 మే 22 న, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు, సమీప గ్రామమైన గుమ్మలూరులో, వర్ధనపు వెంకన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించిరి. ఈయన చిన్నప్పటినుండి విగ్రహారాధన అలవాట్ల మధ్య పెరిగినను, దేవుని ఏర్పాటులో ఉన్న కారణాన, నిజమైన దేవునిని తెలిసికోవాలన్న తపన, బాల్యమునుండియే కలిగియుండెను. 1945లో ఇటువంటి ఆలోచనలతో మనశ్శాంతి కోల్పోయిన పరిస్థితులలో ఆత్మహత్య చేసికోవలెనని తీర్మానించుకుని, ముందుగా తన స్నేహితుని కలుసుకొనుటకు వెళ్లగా, అక్కడే ఉన్న బైబిలునుండి, యెషయా 41 : 9-13 వచనముల ద్వారా పరిశోధించబడి, తనను తాను అప్పగించుకొని, తన పాపములన్నియు ప్రభువు దగ్గర ఒప్పుకొని, విరిగి నలిగిన హృదయముతో వెంటనే ప్రభువైన యేసు క్రీస్తును, తన స్వంత రక్షకునిగా అంగీకరించెను. ఈయన దైవ సమాధానముతో పూర్తిగా నింపబడి, కోల్పోయిన మనశ్శాంతి నుండి విముక్తి పొందిరి. ఈయన విద్యాభ్యాసము పాలకొల్లులో, క్రాఫ్ట్ టీచరు ట్రైనింగ్ గుంటూరులో, విద్య అంతయు, అత్యుత్తమ శ్రేణిలో పూర్తి చేసికొని, 1946-1956 వరకు, రాజమండ్రి, దేవరపల్లి, భీమవరం ప్రాంతాలలో టీచరుగా పనిచేసిరి. ఈ కాలమంతా విరామము లేకుండా సువార్త పరిచర్య చేస్తుండేవారు. తరువాత 1953 ప్రారంభములో సహూ. భక్త్ సింగ్ గారు భీమవరంలో జరిపించిన సువార్త దండయాత్ర, ఉజ్జీవ కూటముల అనంతరము, పట్టణములో మొదటిసారిగా 100మందికి పైగా నీటి బాప్తిష్మములో బహిరంగంగా సాక్ష్యమిచ్చి, సహవాసములో చేర్చబడిన వారిలో, ఈయన కూడా ఒకరు. తరువాత, కుటుంబముగా 1956లో పూర్తీ సేవా పరిచర్యకొరకు, ప్రభువు పిలుపును అందుకొని, తన ఉద్యోగమును త్యజించి, చివరివరకు ఎంతో నమ్మకముగా సేవా పరిచర్య జరిగించితిరి. భీమవరం, సీయోను ప్రార్ధనా మందిరములో ఈయన చేసిన సేవ ఎన్నతగినది.
సహూ. క్రిష్టాఫర్ గారి వివాహము సహోదరి సలోమి రోజ్ పద్మామణితో 08 జూన్ 1949 న గుమ్మలూరులో జరిపించితిరి. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా, యెండగండి గ్రామమునకు చెందిన చికిలే వందనం, సుందరమ్మ గార్ల మూడవ కుమార్తె. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు, 1.జయశీల, 2.స్టీఫెన్ క్రిష్టాఫర్, 3.హన్నా మణి, 4.పాల్ క్రిష్టాఫర్, 5.ఇమ్మానుయేల్ క్రిష్టాఫర్, 6.డేవిడ్ క్రిష్టాఫర్, 7.దొర్కా మణి, 8.కెజియా మణి, 11 మంది మనమళ్లు, 8 మంది ముని మనమళ్లతో ఆశీర్వదించబడగా, వీరి సంతానంలో ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె (2,3,4,6) దేవుని మహిమలో ప్రభువు నందు ఉండగా, తక్కిన వారిలో ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ప్రభువు సేవలో కొనసాగుచున్నారు. వీరందరూ సంఘములో, సంగీతమును సమకూర్చుటలో నిష్టాతులు.
సహూ. క్రిష్టాఫర్ గారు నశించిపోయే ఆత్మల గురించి భారము కలిగి, ఉద్యోగమూ చేసిన ప్రతి ప్రదేశములో బహుగా సువార్త చేసిరి. ముఖ్యముగా దేవరపల్లిలో చెట్లు ఎక్కి రేకు బూరతో సువార్త ప్రకటించెడివారు. ఇది సహించలేని హిందూ మతవాదులు ఈయనను చంపవలెనని చేసిన ప్రయత్నాలనుండి ప్రభువే తప్పించెను. ఈయన సువార్త అనేక ప్రదేశాలలో, ముఖ్యముగా భీమవరంలో ప్రతిరోజూ ఉదయం బాకాల ద్వారా, సువార్త ప్రకటించెడివారు. ఆయా కాలములలో చదువుకొనటానికి వచ్చిన విద్యార్థులు ఈయన ద్వారా రక్షించబడి, ప్రేరేపించబడినవారై, పరిచర్యలలో పాలు పంచుకునేవారు. ఆ కాలములో తినటానికి తిండి లేకపోయినా, ఎంతో ఉజ్జివముగా, ఆప్యాయంగా, సహోదర ప్రేమతో అందరు కలసి మెలసి ఉండేవారు. అయినప్పటికిని పేద విద్యార్థులను చదివించేవారు. ఈయన ద్వారా ఆత్మీయంగా మేలులు పొందిన వారిలో SD కృపావరం, సత్యవేదం, సత్యానందం, మధు, PJ దాసన్, దాసు, నెహెమ్యా, లివింగ్ స్టోన్, జాక్సన్, P జోషి వంటి ఇంకా అనేకమంది, ఈయన వద్దే బలపడి, వారి సేవా పరిచర్యలలో బహు ప్రసిద్ధులైరి. సహుదరుడు వాక్యమును విశ్లేషించుటలో ఈయనకు, ఈయనే సాటి. బైబిలు స్టడీలో, ఒకటే వాక్యమును నెలలు తరబడి, ఎప్పటికప్పుడు వినూత్నంగా బోధించేవారు. ఇంకా, ఈయన బోధనాశైలి సరళతరముగా, వినసొంపుగా ఉండుటవలన, భీమవరంలోని డినామినేషన్ సంఘములవారు, వారి చర్చిలు ఐపోయిన తర్వాత, ఈయన రెండవ వర్తమానము వినుటకు వస్తుండేవారు. సహూ. క్రిష్టాఫర్ గారు పరిచర్యకు మద్దతుగా, విదేశీ ప్రసంగీకులు AJ ఫ్లాక్ , జార్జ్ వెర్వెర్, కెన్నెడీ, టీసన్ ఇంకా అనేకమంది గొప్ప దైవజనులు, భక్త్ సింగ్ గారు, ఆయన టీముతో ట్రక్కులతో వచ్చి భీమవరం, పరిసర ప్రాంతాలలో పరిచర్య చేసి వెళ్లెడివారు. ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతములకు వెళ్లి, పరిచర్య చేస్తూ, అనేక సంఘములను బలపరుస్తూ ఉండేవారు. సహూ. క్రిష్టాఫర్ గారు, ఈయన ద్వారా నిర్మించబడిన, సీయోను ప్రార్ధనా మందిరము 1986 లో సహూ. భక్త్ సింగ్ గారితో ప్రతిష్ట చేయబడెను. ఆ సమయములో సహూ. అరవిందం గారు, భక్త్ సింగ్ గారి సహ సేవకులందరు హాజరయ్యిరి. భీమవరంలో సీయోను మందిర ప్రతిష్ట తర్వాత ఈనాటి వరకు నిరాటంకముగా, పరిశుద్ధ సమాజ కూడికలు జరగటానికి ప్రభువు కృప చూపిస్తున్నాడు.
నేను 1979లో భీమవరం, మునిసిపల్ ఆఫీసులో పని చేసేటప్పుడు, భీమవరం, సీయోను ప్రార్ధన మందిరమునకు వెళ్ళుతుండేవాడిని, వయస్సులో ఎంతో చిన్నవాడునైన నన్ను, దైవదాసుడు క్రిష్టాఫర్ గారు, నన్ను చేర్చుకున్న తీరు, చూపించిన ఆప్యాయత, ఆ అనుభవపూర్వకమైన ప్రేమ, నాకు ఇప్పటికి పదిలంగా అలాగే గుర్తుంది. ఈయన ఎంత పెద్ద సేవకుడైనా, ఆ తగ్గింపు స్వభావము ఎలాంటిదంటే? “క్రీస్తు ప్రేమను చూపించుటయే!” ఆ పాత కాలపు ప్రేమ, నేడు కొరవడిందని నేను చెప్పగలను.
దైవదాసుడు క్రిష్టాఫర్ గారు, 2003 అక్టోబర్ నెలలో బ్రెయిన్ స్ట్రోక్ రావటం మూలంగా, అప్పటినుండి 2007 నాలుగు సంవత్సరాలు చనిపోయే వరకు బెడ్ మీదనే ఉన్నారు. ఈయన జీవితములో ఎటువంటి పరిస్థితులు సంభవించినప్పటకి, ధైర్యముగా ఎదుర్కొనుచు, పొందిన రక్షణ ఆనందమును, విశ్వాసమును కాపాడుకొనుచూ, తన 79 వ ఏట, 51 సంవత్సరాల పూర్తి సేవానంతరం ప్రభువు చివరిపిలుపును అందుకొనిరి.