
నేటి విశ్వాస నాయకుడు
మార్సెల్లినస్ – హతసాక్షి
పరలోక పిలుపు : 26 ఏప్రిల్ 304 AD
రోమ్ బిషప్, విశ్వాసానికి బలైన పరిశుద్ధుడు. ఆది చర్చిలో నిబద్ధత శిల్పి.
మార్సెలినస్ (సుమారుగా క్రీ.శ. 250–260 మధ్య జననం, 304లో మరణం) రోమ్ నగరంలో ఉంటూ బిషప్గా సేవలందించారు. ఈయన జీవించిన కాలంలో క్రైస్తవ సంఘం గొప్ప విశ్వాసంపై ఆధారపడినది. అప్పట్లో సంఘం ఆది అపొస్తలుల అసలైన బోధలను పాటించడమే ప్రధానంగా ఉండేది. ఇప్పటి కేథలిక్ సంప్రదాయాలు, ఆచారాలు ఆ కాలంలో ఇంకా ఏర్పడలేదు. యేసు ప్రభువు మరియు అపొస్తలుల ఆది బోధలను అనుసరించిన విశ్వాసము, వ్యక్తిగత నిబద్ధత, సంఘబద్ధ ఆరాధన, వేదగ్రంథాలపై ఆధారపడటం ప్రధానంగా ఉండేవి. అయితే అప్పటి రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులపై తరచూ హింస జరుగుతూ ఉండేది. క్రీ.శ. 304లో రాజు డయోక్లిషియన్ కాలంలో క్రైస్తవులపై అత్యంత ఘోరమైన హింస మొదలైంది. ఈ సమయంలో మార్సెలినస్ తన విశ్వాసాన్ని వదలకుండా, ఎంత హింస పెట్టినా రోమన్ విగ్రహాలకు మ్రొక్కలేదు. ఎంతో భయంకరమైన వేదింపుల మధ్య కూడా ఆయన యేసును నిరాకరించలేదు. చివరికి ఆ విశ్వాసమే ఈయనకు మరణాన్ని తెచ్చింది. ఈ కారణంగా మార్సెలినస్ ను క్రైస్తవ సంఘము పరిశుద్ధునిగా గౌరవిస్తాయి.
296 సం.లో రోమా చక్రవర్తి డయోక్లీషియన్ పాలన కాలంలో, మార్సెల్లినస్ గారు కయుస్ తర్వాత రోమా బిషప్గా నియమితులయ్యారు. ఈ కాలం ప్రారంభంలో క్రైస్తవులకు కొంతమేర శాంతి వాతావరణం కనిపించినా, కొద్దికాలానికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చక్రవర్తి డయోక్లీషియన్ ఆధ్వర్యంలో, ముఖ్యంగా సీజర్ గాలేరియస్ ప్రభావంతో క్రైస్తవులపై ఉక్కుపాదం మరింత ఉధృతమైంది. 302 నాటికి, క్రైస్తవ సైనికులను తమ విశ్వాసాన్ని త్యజించాలన్న ఒత్తిడి, క్రైస్తవ సముదాయాల ఆస్తుల స్వాధీనం, పరిశుద్ధ గ్రంథాల ధ్వంసం వంటి గంభీర నిర్ణయాలు తీసుకున్నారు. తరువాత వారి దేవతలకు బలులు అర్పించకపోతే మరణ శిక్ష విధించబడేలా ఒక బహుముఖ అధికార ఉత్తర్వు వెలువడింది. ఈ ఘోర కాలాన్ని చరిత్రలో “డయోక్లీషియన్ హింసాకాలం” ఇంకా “మహా హింసాకాలం” అని కూడా అంటారు. ఈ కాలం 303 నుంచి 311 వరకు సాగింది. ఇది రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులపై జరిగిన అత్యంత విస్తృతమైన హింస అని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మరణించిన పరిశుద్ధుల ఖచ్చితమైన సంఖ్య తెలియకపోయినా, అప్పటి నిక్షేపాలు, ఇతివృత్తాలు ఆధారంగా వేలాది మంది క్రైస్తవులు హింసకు గురై ప్రాణాలు కోల్పోయారని అంచనా.
ఆ మహా హింసాకాలంలో క్రైస్తవులు అందరు తమ విశ్వాసాన్ని త్యజించమని తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అదే విధంగా బిషప్ మార్సెల్లినస్ గారి విశ్వాసంపై విషమ పరీక్ష నెలకొనగా, విగ్రహాలకు ధూపం సమర్పించారని చెబుతారు. అయితే, వెంటనే ఈయన తీవ్ర పశ్చాత్తాపంతో క్రీస్తునందలి విశ్వాసానికి తిరిగి వచ్చారు. ప్రతిఫలంగా తన సహచరులతో కలిసి, చివరికి మరణశిక్షను స్వీకరించి ప్రభువుకోసం హతసాక్షి అయ్యారు. ఈయన మరణించిన ఖచ్చితమైన తేది తెలియకపోయినా, జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26న క్రైస్తవ సంఘం ఈయన్ను ఘనంగా స్మరిస్తుంది. మరణ సమయంలో ఈయన చూపిన అపారమైన విశ్వాసము నిమిత్తం, ప్రాణత్యాగం చేసి నిత్యత్వము లోకి నడిపించబడ్డాడు.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.