
నేటి విశ్వాస నాయకుడు
జాన్ ఫిలిప్ బోయం
పరలోక పిలుపు : 29 ఏప్రిల్ 1749
చర్చ్ వ్యవస్థాపకుడు, బోధకుడు, విద్యావేత్త, చర్చ్ పరిపాలకుడు, శ్రద్ధాభక్తుల్ని పెంపొందించిన గొప్ప ఆధ్యాత్మిక నేత, మిషనరీ.
జాన్ ఫిలిప్ బోయం (1683-1749) జర్మన్ రీఫార్మ్డ్ మిషనరీగా, అమెరికా పెన్సిల్వేనియాలో సంఘమును స్థాపించి, అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇది తరువాతి కాలంలో యునైటెడ్ రీఫార్మ్డ్ చర్చ్గా మారింది. 1725లో బోయం, ఫాల్క్నర్ స్వాంప్, స్కిప్పాక్, వైట్మార్ష్ ప్రాంతాల్లోని సంఘాలకు అశాస్త్రీయ పాస్టర్గా సేవను ప్రారంభించాడు. చర్చ్ కు ఒక నిఖార్సైన పరిపాలన అవసరం ఉన్నదని గుర్తించిన ఈయన, ఓ విస్తృతమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు. ఈ రాజ్యాంగంలో ఆత్మీయ నాయకత్వ బృందంతో పరిపాలన, హైడెల్ బర్గ్ బోధక పుస్తకం, శాసన నిబంధనలు మరియు ఆర్థిక నిర్వహణ వంటి అంశాలకు స్పష్టమైన మార్గదర్శకాలను సమర్పించాడు. ఈ రాజ్యాంగం, ఆ ప్రాంతంలోని ఇతర రీఫార్మ్డ్ సంఘాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. 1725 నుండి 1740 మధ్యకాలంలో, బోయం కనీసం 13 సంఘాలను స్థాపించి, సేవ చేశాడు. దక్షిణాది ప్రాంతమంతటా ప్రయాణిస్తూ సంఘాలను శక్తివంతంగా ప్రోత్సహించాడు. అలాగే, పెన్సిల్వేనియాలోని రీఫార్మ్డ్ సంఘాల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన కోయెటస్ అనే సమాఖ్యను స్థాపించి, దాన్ని నడిపించడంలోనూ బోయం ప్రధాన పాత్ర పోషించాడు.
జాన్ ఫిలిప్ బోయం 1683 నవంబర్ 24న జర్మనీ దేశంలోని హోఖ్ స్టాడ్ పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి ఫిలిప్ లుడ్విగ్ బోయం పాఠశాల ఉపాధ్యాయుడు, అనంతరం రీఫార్మ్డ్ బోధకుడుగా పనిచేశారు. బోయం 1706లో లాంబ్షెయిమ్ పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రారంభించి, 1720 వరకూ బోధన కొనసాగించారు. అదే సంవత్సరంలో బోయం అమెరికాలోని పెన్సిల్వేనియాకు వలసవెళ్లి, ఫిలడెల్ఫియా సమీపంలోని విట్పెయిన్ ప్రాంతంలో స్థిరపడి అక్కడ తన ఉపాధ్యాయ ధర్మాన్ని కొనసాగించారు.
బోయం పెన్సిల్వేనియాలోని విట్పెయిన్ అనే గ్రామంలో స్థిరపడి, అక్కడ బోధకుల కొరత కారణంగా, రీఫార్మ్డ్ సంఘాలకు బైబిల్ టీచర్ గా సేవలు అందించడం ప్రారంభించారు. ఈయన 1725లో అనేక సంఘాలకు పాస్టరుగా పిలువబడి, అమెరికాలో జర్మన్ రీఫార్మ్డ్ చర్చి స్థాపనకు శ్రీకారం చుట్టారు. ప్రమాదకరమైన మార్గాలు, స్థానిక అమెరికనులతో ఎదురైన సవాళ్లను ఎదుర్కొంటూనే ఈయన సేవ కొనసాగించారు. 1729లో బోయంను ఆమ్ స్టర్ డామ్ క్లాసిస్ కి చెందిన డచ్ సంఘం అభిషేకించింది. ఫలితంగా ఈయన స్థాపించిన సంఘాలు హాలండ్ రీఫార్మ్డ్ చర్చి పరిపాలనకు లోబడ్డాయి. పెన్సిల్వేనియాలో మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, బోయం మినిస్ట్రీకి ఇతర మతాల నుంచి ప్రతిస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో 1746లో, మైఖేల్ ష్లాట్టర్ అనే రీఫార్మ్డ్ బోధకుడు బోయంకు సాయపడేందుకు పంపించబడ్డారు. 1747లో ఇద్దరూ కలిసి తొలి కోయటస్ సదస్సును నిర్వహించి, బోయం రూపొందించిన చర్చ్ రాజ్యాంగాన్ని సవరించారు.
బోయం 65 ఏళ్ల వయస్సులో పరలోకానికి పయనమయ్యారు. ఈయన మరణం, పెన్సిల్వేనియాలో రీఫార్మ్డ్ చర్చి అభివృద్ధిలో కీలక అధ్యాయానికి ముగింపు లాంటిది. బోయం పెన్సిల్వేనియాలోని బ్లూ బెల్ అనే ప్రాంతంలో ఉన్న “బోయం చర్చి” లో సమాధి చేయబడ్డారు. ఈచర్చి, నేటికీ చారిత్రక ప్రాముఖ్యత గల స్థలంగా, శాశ్వత స్మారకంగా నిలిచింది. ఈయన జీవితం, బోయం చర్చి సాక్షిగా, ఇప్పటికీ విశ్వాస సమాజంపై ప్రభావాన్ని చూపిస్తోంది.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.