
నేటి విశ్వాస నాయకురాలు
ఆలిస్ మిల్డ్రెడ్ కేబుల్
పరలోక పిలుపు : 30 ఏప్రిల్ 1952
మిషనరీ, సువార్తికురాలు, రచయిత, ఆత్మల విజేత, ధైర్యశాలి.
అలిస్ మిల్డ్రెడ్ కేబుల్ (1878-1952) బ్రిటన్ దేశానికి చెందిన ప్రొటెస్టెంట్ మిషనరీ. చైనా దేశంలో “చైనా ఇన్ ల్యాండ్ మిషన్” సంస్థతో కలిసి సేవ చేసారు. ముఖ్యంగా చైనా పశ్చిమ ప్రాంతాల్లోని గోబీ ఎడారి వంటి ప్రమాదకరమైన, ఒంటరితనమున్న ప్రాంతాలలో ఈమె చేసిన మిషనరీ పని చాలా పేరుగాంచింది. ఈమెకు సహచరులుగా ఫ్రాన్సెస్కా ఫ్రెంచ్ మరియు ఎవాంజెలినా ఫ్రెంచ్ అనే ఇద్దరు మహిళలతో కలిసి “గోబీ ఎడారిలో ముగ్గురు మహిళలు”గా ప్రసిద్ధి చెందారు. ఈమె సాహసోపేతమైన సువార్త పరిచర్యను చేపట్టారు. ముస్లింలు, బౌద్ధులు, ఇతర స్థానిక విశ్వాసాలవారికి క్రీస్తుయేసు సువార్తను తెలిపారు. వీరు చేయూతనిచ్చిన పరిచర్య ద్వారా చాలామంది ప్రభువును తెలుసుకున్నారు. 1920ల నుండి 1930ల వరకూ చైనీస్ టర్కిస్తాన్ ఇప్పటి షిన్జియాంగ్ ప్రాంతమంతా ఈమె విస్తృతంగా ప్రయాణించేటప్పుడు, తీవ్రమైన వాతావరణాలు, స్థానికుల ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ వెనుకాడలేదు. ఎక్కువగా ఒంటెల కారవాన్లలో ప్రయాణిస్తూ, ఎంతో సాధారణ జీవితాన్ని గడుపుతూ, క్రైస్తవ సాహిత్యాన్ని ప్రజల్లో పంపిణీ చేశారు. ఈమె చేసిన పని సువార్తలో ప్రభావం కలిగించడమే కాక, స్థానిక సంస్కృతి, భౌగోళిక పరిజ్ఞానానికీ గొప్ప వెలకట్టలేని సమాచారం అందించింది. గోబీ ఎడారిని అంత లోతుగా అన్వేషించిన తొలి పాశ్చాత్య మహిళల్లో అలిస్ కేబుల్ ఒకరు.
కేబుల్ 1878 ఫిబ్రవరి 21న ఇంగ్లాండ్లోని సరీ ప్రావిన్స్, గిల్డ్ ఫోర్డ్ లో జన్మించారు. ఈమె తండ్రి జాన్ కేబుల్ ఒక విజయవంతమైన దుస్తుల వ్యాపారి. చిన్ననాటి నుంచే ఈమె మిషనరీ కావాలనే ఆకాంక్షతో ఎదిగారు. లండన్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ, మానవ శాస్త్రాలపై విద్యాభ్యాసం చేశారు. ఈమెతో పెళ్ళికి నిశ్చితార్థమైన యువకుడు, మిషనరీ సేవకు దూరంగా ఉండాలని కోరడంతో, ఈమె మారుమాట లేకుండా ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు. తుది పరీక్ష కూడా రాయకుండా, 1901లో చైనా ఇన్లాండ్ మిషన్లో చేరారు. అక్కడే ఈమెకు ఈవా ఎవాంజలిన్ ఫ్రెంచ్ అనే మరో మిషనరీ పరిచయం అయ్యారు. వీరు జీవితాంతం కలిసి పనిచేశారు. మొదట వీరిద్దరూ చైనాలో షాన్షీ రాష్ట్రంలోని హుఒఝౌ అనే ప్రాంతంలో మిషనరీలుగా నియమించబడ్డారు. అనంతరం, 1910లో ఈవా సోదరి ఫ్రాన్సెస్కా ఫ్రెంచ్ కూడా ఈ పరిచర్యలో భాగమయ్యారు. ఇలా చైనా ప్రజల మధ్య 20 సంవత్సరాల పాటు విశ్వాసముతో సేవ చేసి, అక్కడి స్థానిక క్రైస్తవ నాయకులకు బాధ్యతలు అప్పగించి, 1923లో పశ్చిమ చైనాలోని ముస్లిం ప్రాంతానికి వెళ్లారు, అక్కడ మళ్లీ సువార్త కార్యాన్ని ప్రారంభించారు.
1923 నుంచి, మిల్డ్రెడ్ కేబుల్ తమ సహచరులైన ఎవా, ఫ్రాన్సెస్కా ఫ్రెంచ్ లతో కలిసి మధ్య ఆసియా అంతటా విస్తృతంగా ప్రయాణాలు చేస్తూ సువార్త ప్రచారం చేశారు. వాణిజ్య మార్గాల వెంట, తక్కువ జనాభా గల దూర ప్రాంతాల్లో ఈ ప్రయాణాలు జరిగాయి. వీరు చాంగ్యే అనే ప్రాంతంలో బైబిల్ పాఠశాలను స్థాపించి, జియుక్వాన్ నగరాన్ని తమ ప్రధాన స్థావరంగా ఏర్పరిచారు. అక్కడి టిబెటన్, మంగోలియన్, ముస్లిం సముదాయాలలో సువార్తను పంచుతూ, ముఖ్యంగా ముస్లిం మహిళలపై దృష్టి కేంద్రీకరించి, ఉయ్గర్ భాష నేర్చుకున్నారు. వీరికి విమర్శలు ఎదురైనా, ధైర్యంగా ప్రభువు బల్లను పంపిణీ చేశారు, ఆయుధాలు సహాయం లేకుండానే ప్రయాణించేవారు. వీరు బలమైన వ్యక్తిత్వం గలవారిగా పేరుగాంచారు. ఎంతో ప్రమాదకరమైన ప్రయాణాల్లో భాగంగా, ఒకసారి మా జోంగింగ్ అనే నాయకుడు వీరిని నిర్బంధించాడు. అలాగే, వీరు సుమారు ఒక సంవత్సరం పాటు షిన్జియాంగ్ లోనూ ప్రయాణించారు. వీరు 1936లో చైనాను విడిచిన తర్వాత మిల్డ్రెడ్ కేబుల్ ఇంగ్లాండ్లోని డోర్సెట్ కి వెళ్లి, ప్రసంగకర్తగా, రచయితగా క్రియాశీలంగా కొనసాగారు. 1942లో ఈమెకు “లారెన్స్ ఆఫ్ అరేబియా మెడల్” లభించింది. తన మరణం వరకు బైబిల్ సొసైటీకి సేవచేశారు. ఈమెకు ఫ్రాన్సెస్కా, ఎవాంగెలైన్ ఫ్రెంచ్ లతో ఉన్న లోతైన స్నేహబంధం మిషనరీ చరిత్రలో అత్యద్భుత భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది
కేబుల్ లండన్ లో 73 ఏళ్ల వయస్సులో పరలోకానికి పయనమయ్యారు. ఇంచుమించు చైనా అంతా కలతిరిగి తన మిషనరీ కార్యాన్ని ముగించుకుని ఇంగ్లాండ్కు తిరిగివచ్చిన తర్వాత కూడా, ఈమె తన అనుభవాలను రచనలు మరియు ప్రసంగాల రూపంలో పంచుకుంటూ, ధైర్యం, విశ్వాసం, నిబద్ధతతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.