డాక్టర్ శామ్యూల్ హెన్రీ కెల్లాగ్ (1839–1899) నిస్వార్థంగా సేవ చేసిన ప్రముఖ ప్రెస్బిటీరియన్ మిషనరీ. హిందీ బైబిల్ పునః అనువాదానికి ప్రధాన శిల్పి, హిందీ వ్యాకరణానికి ఆధునిక మూలగ్రంథ భాషావేత్త, మిల్లీనియల్ సిద్ధాంతాల మార్పుకు దోహదపడిన వేదాంతవేత్త, భాష – వేదాంతం - మతసారాంశాల్లో రచనల ద్వారా మిషనరీలను ప్రేరేపించిన రచయిత

నేటి విశ్వాస నాయకుడు
Dr. సామ్యూల్ హెన్రీ కెల్లాగ్,
పరలోక పిలుపు : 03 మే 1899,
హిందీ బైబిల్ పునః అనువాదానికి ప్రధాన శిల్పి, హిందీ వ్యాకరణానికి ఆధునిక మూలగ్రంథ భాషావేత్త, మిల్లీనియల్ సిద్ధాంతాల మార్పుకు దోహదపడిన వేదాంతవేత్త, భాష – వేదాంతం – మతసారాంశాల్లో రచనల ద్వారా మిషనరీలను ప్రేరేపించిన రచయిత

డాక్టర్ శామ్యూల్ హెన్రీ కెల్లాగ్ (1839–1899) నిస్వార్థంగా సేవ చేసిన ప్రముఖ ప్రెస్బిటీరియన్ మిషనరీ. 19వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన విశిష్టమైన క్రైస్తవ మిషనరీల్లో ఈయనకున్న స్థానం ప్రత్యేకమైనది. హిందీ బైబిల్ పునః అనువాదానికి సహాయంగా విశేష కృషి చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. విలియం హూపర్, జోసెఫ్ ఆర్థర్ లాంబర్ట్ లాంటి విశ్వాస సహచరులతో కలిసి ఈయన చేసిన సేవ భారతదేశ బైబిల్ అనువాద చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

1839 సెప్టెంబరు 6న న్యూయార్క్ రాష్ట్రంలోని క్వాగ్ అనే గ్రామంలో జన్మించిన కెల్లాగ్, మతపరమైన కుటుంబంలో పెరిగారు. ఈయన తండ్రి శామ్యూల్ కెల్లాగ్ ఒక ప్రెస్బిటీరియన్ పాస్టర్. తల్లి పేరు మేరీ హెన్రీ కెల్లాగ్. 1861 లో ప్రిన్స్టన్ కాలేజీ, థియాలజికల్ సెమినరీలో బైబిల్ విద్యనభ్యసించిన కెలాగ్, హెన్రీ ఎం. స్కడ్డర్ ఒక ఉపదేశంలో భారత్లో సువార్త అవసరాన్ని వివరించగా, ఆయన మిషనరీ పిలుపును స్వీకరించారు.

1864లో తన భార్య అన్టొయినెట్ హార్ట్వెల్ తో కలిసి భారతదేశానికి బయలుదేరారు. ఫరూఖాబాద్ మిషన్, కలకత్తాలో నివసిస్తూ సువార్త ప్రచారం, సంఘ స్థాపనలతో పాటు స్థానికులకు బోధన, సామాజిక శ్రేయస్సుకు కృషి చేశారు. ఈయన రచించిన “A Grammar of the Hindi Language” అనే హిందీ వ్యాకరణ గ్రంథం 1876లో మొదట, 1893లో పునర్ముద్రణ అయ్యి బ్రిటిష్ ప్రభుత్వ చట్టబద్ధమైన పాఠ్యగ్రంథంగా గుర్తించబడింది. ఈ గ్రంథం ఇండియన్ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు ప్రాథమిక పాఠ్యాంశంగా ఉండేది.

అమెరికాలో విస్తారంగా ఉన్న పోస్ట్ మిల్లీనియలిజం సిద్ధాంతాన్ని — అంటే క్రీస్తు మరోసారి భూమిపై రాజ్యం స్థాపించే ముందు క్రైస్తవ ప్రభావంతో సువర్ణ యుగం’ వచ్చి తీరుతుందని నమ్మకం — నుండి ఈయన ప్రీ మిల్లీనియలిజం వైపు (క్రీస్తు రాజ్యాన్ని ప్రత్యక్షంగా స్థాపించడానికి ముందే తిరిగి వస్తాడన్న నమ్మకం) దీన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇది అగ్రశ్రేణి బైబిల్ పాఠకులు, మిషనరీలు, వేదాంతవేత్తలపై దీర్ఘకాలిక ప్రభావం చూపించింది.

1876లో తన భార్య అన్టొయినెట్ మరణించగా, నలుగురు పిల్లలతో కలిసి ఉత్తర అమెరికాకు తిరిగివచ్చారు. అక్కడ కెనడాలోని ప్రెస్బిటీరియన్ సంఘం కోసం, అలెగని థియాలజికల్ సెమినరీలో ఉపాధ్యాయునిగా సేవలందించారు. 1879లో సారా కాన్స్టాన్స్ మాక్రమ్ను వివాహమాడి, 1892లో భార్యా పిల్లలతో కలిసి మళ్లీ భారతదేశానికి వచ్చారు. ఈసారి అహ్మదాబాద్ కేంద్రంగా హిందీ బైబిల్ పునఃఅనువాద పనిని కొనసాగించారు.

1899లో, 60 ఏళ్ల వయసులో ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లాండ్ వోర్ అనే ప్రాంతంలో ఈయన తుదిశ్వాస విడిచారు. అక్కడే సమాధి చేయబడిన ఈయన స్మృతిగా “కెల్లాగ్ మెమోరియల్ చర్చి” నిర్మించబడింది. ఇది నేటికీ ఈయన సేవను స్మరించుకునే ప్రాంగణంగా నిలిచివుంది.

జాన్ మైఖేల్, రాజమండ్రి.

Leave a comment