విలియమ్ టెన్నెంట్ (1673-1746) ప్రముఖంగా అమెరికాలో మొదటి గొప్ప మేలు కొలుపు కాలంలో ముఖ్యపాత్ర పోషించిన స్కాటిష్-అమెరికన్ ప్రెస్బిటీరియన్ బోధకుడు. లాగ్ కళాశాల స్థాపకుడు, వేదాంతవేత్త, పాస్టర్, బోధకుడు, రచయిత.

నేటి విశ్వాస నాయకుడు
విలియం టెన్నెంట్,
పరలోక పిలుపు : 06 మే 1746,
లాగ్ కళాశాల స్థాపకుడు, వేదాంతవేత్త, పాస్టర్, బోధకుడు, రచయిత.

విలియమ్ టెన్నెంట్ (1673-1746) ప్రముఖంగా అమెరికాలో మొదటి గొప్ప మేలు కొలుపు కాలంలో ముఖ్యపాత్ర పోషించిన స్కాటిష్-అమెరికన్ ప్రెస్బిటీరియన్ బోధకుడు. ఈయన స్కాట్లాండ్ లో మిడ్ కాల్డర్, లిన్ లిథ్ గోషైర్ ప్రాంతంలో 1673లో జన్మించారు. 1695లో ఎడిన్ బెర్గ్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారు. 1706లో ఐర్లాండ్ చర్చి ద్వారా పాస్టర్గా అభిషేకితులయ్యారు. 1718లో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి వలస వెళ్లారు. 1726లో వార్ మినిస్టర్ పట్టణంలో ఉన్న నెషామినీ-వార్విక్ ప్రెస్బిటీరియన్ సంఘానికి పాస్టర్గా నియమితులై, మరణించే వరకు అక్కడే సేవచేశారు.

టెన్నెంట్ గారి బోధనలు పాపమునుంచి పశ్చత్తాపం, వ్యక్తిగత పరివర్తన, ఆత్మీయ మేలుకొలుపు వంటి ప్రధాన విషయాలపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరించినవి. ఈయన బోధనలలో కేవలం మేధోపరమైన శిక్షణ కాకుండా, మార్పు చెందిన జీవితముతో కూడిన పరిచర్య అవసరమని బలంగా చెప్పేవారు. ఈ విషయం అప్పటివరకు అణుకుగా, నిర్జీవంగా ఉండే చాలాచర్చిల తీరును సవాలు చేయడమే కాకుండా, మహత్తర మేలుకొలుపుకు బలమైన బాటలు వేసింది. 1727లో టెన్నెంట్ గారు ఒక తోటలో చిన్న మట్టిబొట్టెల గుడిసెలో “లాగ్ కాలేజ్” అనే బైబిల్ శిక్షణ సంస్థను ప్రారంభించారు. ఈ కాలేజ్లో బైబిల్ అధ్యయనం, ధర్మశాస్త్రం, ఆచరణాత్మక బోధన, వ్యక్తిగత భక్తి వంటి అంశాలను బోధించేవారు. ఈ విద్యాసంస్థ ద్వారా ఈయన తన శిష్యులలో ఆత్మీయ ఉత్సాహాన్ని నింపి, వారిని మహత్తర మేలుకొలుపులో గొప్ప ప్రవక్తలుగా తీర్చిదిద్దారు. ఈయన కుమారుడు గిల్బర్ట్ టెన్నెంట్, ఆ ఆధ్యాత్మిక మేలు కొలుపు ఉద్యమంలో అగ్నిమయమైన, ప్రభావశీలమైన ప్రసంగాల ద్వారా ప్రజలను ప్రభావితం చేశారు. లాగ్ కాలేజ్ శిక్షణ పొందినవారు అమెరికాలోని అనేక ప్రాంతాలలో బైబిల్ పాఠశాలలను, సంఘాలను స్థాపించి క్రైస్తవ సేవా క్షేత్రాన్ని విస్తరించారు. ఈ కాలేజ్ నుండి వెలువడిన అనేకమంది అమెరికా ఉపనివేశాల్లో ప్రముఖ ప్రెస్బిటీరియన్ పాస్టర్లు, సువార్తికులు, సంఘ స్థాపకులుగా నిలిచారు. ప్రింట్స్టన్ విశ్వవిద్యాలయం, లాగ్ కాలేజ్కు వారసత్వ సంస్థగా భావించబడుతుంది. టెన్నెంట్ గారు త్రిత్వ సంబంధిత విషయాలపై పుస్తకాలు రచించడమే కాకుండా, తన శిష్యులకు, సహోదర పాస్టర్లకు పదేపదే ఉత్తరాలు వ్రాస్తూ, వారిని ప్రేరేపించేవారు. ఈయన రచనలు ఇప్పటికీ శ్రద్ధగా భద్రపరచబడ్డాయి.

విలియమ్ టెన్నెంట్ 1746లో పెన్సిల్వేనియాలోని వార్ మినిస్టర్ పట్టణంలో మరణించారు. ఈయన సమాధి నేటికీ నెషామినీ-వార్విక్ ప్రెస్బిటీరియన్ చర్చి ప్రాంగణంలో ఉంది. ఈయన చివరి చట్టపరమైన కోరికలు వినయభావాన్ని, దేవునికి తన అంకితభావాన్ని ప్రతిబింబించాయి. లాగ్ కాలేజ్ను స్థాపించినా కూడా, తన సతీమణి క్యాథరిన్కు మాత్రమే కొన్ని సాధారణ వస్తువులు విడదీసి, స్వార్థరహిత జీవితం గడిపిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఈయన అసలు ప్రవచనాలు, గమనికలు ఫిలడెల్ఫియాలోని ప్రెస్బిటీరియన్ సొసైటీలో భద్రపరచబడ్డయి. వార్ మినిస్టర్ వద్ద ఉన్న విలియమ్ టెన్నెంట్ హైస్కూల్, లాగ్ కాలేజ్, మిడిల్ స్కూల్ ఈయనకు నివాళిగా తన పేరుతోనే ఏర్పాటు చేయబడ్డాయి.

జాన్ మైఖేల్, రాజమండ్రి.