
నేటి విశ్వాస నాయకుడు
ఫ్రాంజ్ వాన్ సికింగెన్,
పరలోక పిలుపు : 07 మే 1523,
వేదాంతేతర సంస్కర్త, ఇంపీరియల్ నైట్, సంఘ సంస్కరణకు రక్షకుడు.
ఫ్రాంజ్ వాన్ సికింగెన్ (1481–1523) జర్మనీలో ప్రొటెస్టెంట్ రీఫార్మేషన్ ప్రారంభ దశలో అత్యంత ప్రాముఖ్యమైన యోధుడు. ఈయన “ఇంపీరియల్ నైట్స్” అనే క్రింది స్థాయి రాజుల వర్గానికి నాయకుడిగా, మత సంస్కరణల ఉద్యమానికి మిలిటరీ మద్దతు ఇచ్చిన ప్రముఖుడు. మతపరమైన విశ్వాసాల్లో మార్పులు కావాలన్న ఆలోచనకు ఆయుధాలతో అండగా నిలిచిన నాయకుడిగా చరిత్రలో గుర్తింపు పొందాడు. ఫ్రాంజ్ వాన్ సికింగెన్ 1481 మార్చి 2న పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో పాలాటినేట్ ప్రాంతంలోని ఎబెర్న్ బర్గ్ కోటలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు, శ్వీక్హార్ట్ వాన్ సికింగెన్, మార్గరేతే పుల్లర్ వాన్ డెర్, మంచి కుటుంబ నేపథ్యం ఉండటంతో చిన్ననాటి నుంచే సైనిక శిక్షణ, రాజకీయ జ్ఞానం కలిగినవాడిగా ఎదిగాడు. ఫ్రాంజ్ 1508లో మాక్సిమిలియన్ ప్రథముని తరఫున యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ యుద్ధం ద్వారా ఈయనకు విలువైన సైనిక అనుభవం లభించింది. తండ్రి మరణంతో, పెద్ద ఎస్తేట్లు వారసత్వంగా లభించాయి, ముఖ్యంగా ఇది రాజకీయ, ఆర్థిక బలాన్ని అందించింది.
ఈయన “ఇంపీరియల్ నైట్” గా, చక్రవర్తితో నేరుగా సంబంధముండే స్థితిలో ఉండేవాడు. దీనివలన స్థానిక రాజుల వలె కాకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగాడు. ఈ స్వేచ్ఛను ఆయుధశక్తిగా మార్చి, రాజకీయంగా కూడా ప్రభావం చూపాడు. ఫ్రాంజ్ వాన్ సికింగెన్ స్వయంగా కాథలిక్ చర్చ్‌ను విడిచిపెట్టలేదుగానీ, చర్చ్‌లో ఉన్న అవినీతి, అధికారం దుర్వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. మార్టిన్ లూథర్ నాయకత్వంలోని మత సంస్కరణల పట్ల ఆయనకు మద్దతు ఉండేది. ఆత్మీయ స్వేచ్ఛకే కాక రాజకీయంలో కూడా స్వతంత్రంగా ఉండేవాడు. “న్యాయశాల”గా ఎబెర్న్ బర్గ్ కోట ఉండేది. ఫ్రాంజ్ తన ఎబెర్న్ బర్గ్ కోటను మత సంస్కరణకారులకు, మానవతావాదులకు ఆశ్రయంగా మార్చాడు. ఈ కోట “Hostel of Justice” అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఉల్రిక్ వాన్ హుట్టెన్ వంటి విప్లవకారులు అక్కడకు వచ్చి మతపరమైన, రాజకీయ విషయాలపై స్వేచ్ఛగా చర్చించగలిగారు.
ఫ్రాంజ్ సికింగెన్ 1522లో “నైట్స్ రిబెలియన్” కు నాయకత్వం వహించాడు. ఇది చిన్న స్థాయి రాజరిక వర్గాలు, ముఖ్యంగా ఈ వర్గం తన హక్కులను తిరిగి పొందేందుకు చేసిన ప్రయత్నం. ఈయన ట్రైయర్ ఆర్చ్బిషప్పై యుద్ధం మొదలుపెట్టి మతాధికార పాలనను లౌకిక పాలనతో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది సామాన్యుల కోసం, న్యాయ పరిరక్షణ కోసం అంటూ ప్రకటించాడు.
అయితే ఈ తిరుగుబాటు విఫలమై, చివరికి, 1523లో లాండ్స్టూల్ కోటపై జరిగిన ముట్టడిలో ఈయన గాయపడి మరణించాడు. ఈయనను లాండ్స్టూల్ లోనే సమాధి చేశారు. యుద్ధవీరుడిగానే కాకుండా, మత స్వేచ్ఛకు రక్షకుడిగా, రాజ్య నిర్మాణ మార్పులకై ప్రయత్నించిన వ్యక్తిగా చరిత్రలో ఈయన గుర్తింపును సంపాదించుకున్నాడు.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.
