
నేటి విశ్వాస నాయకుడు
నికోలాస్ వాన్ జింఝెన్ డార్ఫ్,
పరలోక పిలుపు : 09 మే 1760,
కీర్తన రచయిత, సంఘ సంస్కర్త, ప్రొటెస్టెంట్ మిషనరీ ఉద్యమ పితామహుడు.
నికోలాస్ వాన్ జింఝెన్ డార్ఫ్ (1700–1760) ఒక జర్మన్ ఆధ్యాత్మిక ప్రొటెస్టెంట్ మిషనరీ నాయకుడు, మోరావియన్ చర్చిని స్థాపించిన వ్యక్తిగా ప్రసిద్ధి గాంచారు. 1700 మే 26న జర్మనీలోని ఓ ప్రముఖ కుటుంబమైన జింఝెన్ డార్ఫ్ వంశంలో జన్మించారు. చిన్నప్పటి నుండే ఈయన ఆధ్యాత్మిక ఆకర్షణతో, ఉత్తరాలు రాస్తూ, గొప్ప ఉత్తర యుద్ధ సమయంలో ఈయన ప్రార్థనలు చూసి స్వీడిష్ సైనికులు చలించిపోయారు.
ఈయన హాలేలోని ఫ్రాంకే ఫౌండేషన్ లో చదివారు, అక్కడ పవిత్ర జీవన విధానం బలంగా ఉండేది. తరువాత విటన్ బర్గ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి, రాజకీయ జీవితంలో ప్రవేశించాలని, యూరోప్‌లో విస్తృతంగా ప్రయాణిస్తూ, వివిధ క్రైస్తవ సంప్రదాయాలకు చెందినవారిని కలుసుకున్నారు. ఒకసారి డొమెనికో ఫెటి అనే కళాకారుడి “ఎచ్చే హోమో” అనే చిత్రం చూసినప్పుడు ఈయనకు దీర్ఘమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగింది, దీనిద్వారా పరుశుద్దాత్మ ప్రభావంతో యేసునికి జీవితాంతం సేవ చేయాలనే తీర్మానం చేసారు.
1722లో మోరావియా, బోహేమియా నుండి రావటానికి శరణార్థులుగా వచ్చిన క్రైస్తవులకు తన స్థలంలో ఆశ్రయం కల్పించి, హెరన్ హుట్ అనే వసతిని స్థాపించారు. మొదట ఈ సంఘంలో విభేదాలు ఉన్నా, ప్రార్థన మరియు బైబిల్ అధ్యయనంతో సంఘ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి చేశారు. ఒక ఒప్పందాన్ని రూపొందించి, క్రైస్తవ జీవనానికి నూతన ప్రతిజ్ఞగా నిలిపారు. 1727లో “మోరావియన్ పెంతెకొస్తు” అనే పునరుద్ధరణ ఉద్యమం ప్రారంభమైంది. జింఝెన్ డార్ఫ్, యూనిటాస్ ఫ్రాట్రమ్ ప్రభావంతో, ఈ సంఘం ద్వారా అన్ని క్రైస్తవ సంఘాలలోనూ నూతనత తీసుకురావాలని ఆశించారు. వయస్సు, లింగం ఆధారంగా “క్వాయర్స్ అనే సమూహాలను ఏర్పాటు చేశారు.
1736లో సాక్సనీ నుండి వెళ్ళిపోవాల్సి వచ్చినా, ఈయనను “పిలిగ్రిమ్ కౌంట్” అనే పేరుతో పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా మిషనరీల్ని పంపిస్తూ, వెస్ట్ ఇండీస్, గ్రీన్‌ల్యాండ్ లాంటి ప్రదేశాలకు సేవలను విస్తరించారు. 1737లో బిషప్‌గా నియమితులై సమూహ నిర్ణయాలు, క్రైస్తవ సంఘ జీవనం అనే సిద్ధాంతాలపై అధికంగా దృష్టి పెట్టారు. ఈయన బానిసత్వానికి తీవ్ర వ్యతిరేకి. డేనిష్ కాలనీ అయిన సెయింట్ థామస్ లో బానిసల మధ్య మోరావియన్ మిషనరీలు లియోనార్డ్ డోబర్ మరియు డేవిడ్ నిట్జ్ మాన్ కు మద్దతు ఇచ్చారు. 1749లో సాక్సనీ ప్రభుత్వం మళ్ళీ ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసి, హెరన్ హుట్ వంటి మరిన్ని వసతిగ్రామాలను స్థాపించాలని కోరింది.
జింఝెన్ డార్ఫ్ 59 ఏళ్ల వయసులో స్వర్గస్తులయ్యారు. ఈయన మరణం మోరావియన్ చర్చి చరిత్రలో ఒక శకాంతానికి ముగింపు కాగా, ఈయన మోరావియన్ చర్చి మీద చూపిన ప్రభావం నేటికీ నిలిచింది. ఈయనకున్న ప్రత్యేకతలను బట్టి అమెరికాలోని ఎవాంజెలికల్ లూథరన్ చర్చి ప్రతీ ఏటా మే 9న గౌరవిస్తుంది.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.
