
నేటి విశ్వాస నాయకుడు
జాకరీ మెకాలే,
పరలోక పిలుపు : 13 మే 1838,
స్కాటిష్ నిర్ములానావాది, గణాంకవేత్త, ఆఫ్రికన్ ఇన్స్టిట్యూషన్ కార్యదర్శి, ఎడిటర్.
జాకరీ మెకాలే (1768–1838): బానిసత్వ నిర్మూలనకు జీవితాన్ని అంకితంచేసిన క్రైస్తవ నాయకుడు. ఈయన స్కాట్లాండ్కు చెందిన ప్రముఖ బానిసత్వ వ్యతిరేక కార్యకర్త, గణాంకవేత్త, కాలనీల పాలకుడు. ఈయన బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిస వ్యవస్థను నిర్మూలించేందుకు జరిపిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. విశ్వాసపరుడైన క్రైస్తవునిగా, సమాజంలోని దురాచారాలను ఆచరణాత్మకంగా ఎదిరించడంలో ఈయన జీవితమంతా గడిచింది. ఈయన ఆశయం అణచివేయబడిన ప్రజల్ని సువార్త వెలుగులో లేపడం. మెకాలే 1768 మే 2న స్కాట్లాండ్ లోని ఇన్వరరే అనే గ్రామంలో శ్రద్ధాశీలమైన క్రైస్తవ కుటుంబమైన, మార్గరెట్ క్యాంప్బెల్, జాన్ మెకాలే దంపతులకు జన్మించారు. తండ్రి స్కాట్లాండ్ చర్చ్ లో పాస్టర్. మెకాలే జీవితానికి తన తండ్రి ఇచ్చిన మానసిక, ఆధ్యాత్మిక విలువలు బలమైన ఆధారంగా నిలిచాయి. ఈయన సహోదరుల్లో పురాతన చరిత్ర పరిశోధకుడు, బ్రిటిష్ జనరల్, క్రైస్తవ బానిస వ్యతిరేక కార్యకర్త కూడా ఉన్నారు. ఈయన ప్రామాణిక విద్యను కొనసాగించలేదు, కానీ స్వయంగా చదువుకుంటూ బుద్ధిమంతుడిగా ఎదిగాడు. గ్లాస్గోలో ఒక వాణిజ్య కార్యాలయంలో పనిచేసే సమయంలో చెడు సహవాసంలో పడి మద్యం అలవాటు పడ్డాడు. 1784లో, 16 ఏళ్ల వయసులో కరీబియన్ దేశమైన జమైకా వెళ్లి చెరకు తోటలో సహాయ నిర్వాహకుడిగా పని చేశాడు. అక్కడ బానిస వ్యవస్థను చూసి విస్మయించి, బానిసత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఉద్యోగం వదిలి, 1789లో లండన్ కు తిరిగివచ్చి, బుద్ధిమంతుడుగా వేరే పనిలో చేరాడు.
మెకాలే మరిది థామస్ బాబింగ్టన్ ద్వారా క్రైస్తవ మానవతావాదులైన విలియం విల్బర్ఫోర్స్, హెన్రీ థోర్న్టన్ లాంటి ప్రముఖులను కలుసుకున్నారు. వీరు క్రైస్తవ విశ్వాసంతో సామాజిక న్యాయం కోసం పోరాడేవారు. 1790లో, మెకాలే ఆఫ్రికాలో బానిసత్వం నుండి విముక్తి పొందిన ప్రజల కోసం ఏర్పాటైన సియెర్రా లియోన్ అనే వలస ప్రాంతాన్ని సందర్శించాడు. 1792లో, అక్కడి పాలన మండలిలో సభ్యుడిగా పనిచేశాడు. 1794లో, గవర్నర్ గా నియమితుడై 1799 వరకు కొనసాగాడు. బానిస వ్యాపార నిర్మూలన కోసం విలియం విల్బర్ఫోర్స్ తో కలిసి పనిచేశాడు. మెకాలే ఆఫ్రికన్ ఇన్స్టిట్యూషన్ కి కార్యదర్శిగా పనిచేశాడు. 1802–1816 మధ్య కాలంలో “ది క్రిస్టియన్ అబ్సర్వర్” క్రైస్తవ పత్రికకి ఎడిటర్గా పనిచేశాడు. లండన్ యూనివర్శిటీ స్థాపన, చర్చ్ మిషనరీ సొసైటీ, బైబిల్ సొసైటీ, తక్కువ ఖర్చుతో కూడిన కరపత్రాల సంకలనం వంటి అనేక సంఘాల స్థాపనకు తోడ్పడ్డాడు. దురాచార నిర్మూలన సమితిలో కూడా పాల్గొన్నాడు. 1823లో, బానిసత్వ నిర్మూలన కోసం చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంఘాన్ని స్థాపించి, దాని పత్రిక Anti-Slavery Reporterకి ఎడిటర్గా బాధ్యత వహించాడు. ఈ పత్రిక ద్వారా బానిస వ్యవస్థలోని అన్యాయాలను వెలికి తీశాడు. మెకాలే నలుపు జాతి ప్రజలకు స్వేచ్ఛా వ్యవసాయ సమాజం అవసరం అనే అభిప్రాయంతో ఉన్నా, నిరంతర కృషి క్రైస్తవ నైతిక విలువల పైనే ఆధారపడి ఉండేది. జాకరీ మెకాలే 70 ఏళ్ల వయస్సులో లండన్లో మృతి చెందగా, St. George’s గార్డెన్స్, బ్లూమ్స్ బరీలో సమాధి చేశారు.
— జాన్ మైఖేల్, రాజమండ్రి.
