నీలగిరి, కూనూరులో ప్రార్థన, ప్రార్థనా వీరుడు సహూ భక్త్ సింగ్, కూనూరు కొండల్లో - ప్రార్థనలపై ప్రభువు ముద్ర

నేటి విశ్వాస సందేశము
ప్రార్థనా వీరుడు సహూ భక్త్ సింగ్,
ప్రారంభ సమావేశం : 14 మే 1941,
కూనూరు కొండల్లో – ప్రార్థనలపై ప్రభువు ముద్ర

నేటికీ 84 సంవత్సరములు. నీలగిరి, కూనూరులో ప్రార్థన విశిష్టత ఏమిటి?

సహుదరుడు భక్త్ సింగ్ గారికి ప్రభువిచ్చిన “నూతన నిబంధన సంఘ ప్రత్యక్షత” : నీలగిరి-కూనూరు ప్రార్ధనలలో ఉన్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు నూతన నిబంధన సంఘమును తిరిగి అదే ప్రత్యక్షతలో పునర్ నిర్మించుటకు ప్రభువేసిన ఆమోదముద్ర, దీని వెనుకున్న ప్రార్ధనలు, ప్రభువు నడిపించిన తీరు పరిశీలిద్దాం—–

సహోదరుడు భక్త్ సింగ్ గారు ఎప్పటినుండో ప్రభువు బయలు పరచిన రీతిలో కనిపెట్టుచూ, ముఖ్యముగా 1938 ప్రారంభము నుండి ఉత్తర భారత దేశములో ఎక్కడ స్థిరపరచబడాలో ప్రార్థిస్తూ ఉండేవారు. ఎందుకంటే భారతదేశం, ఇతర దేశాలలో కొత్త పని గురించి ప్రభువు ఈయనకు దర్శనం ఇచ్చెను. అంతేకాకుండా ఈయన పుట్టక ముందు, ఆతర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వాసులు భారతదేశము మేల్కొలుపు, సువార్త పరిచర్య కొరకు బహు భారంగా ప్రార్థిస్తూ ఉండేవారు. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చటానికి వ్యక్తులను, సంఘటనలను, పరిస్థుతులను ఉపయోగించుకుంటాడు. ప్రతి మార్గదర్శకుడి వెనుక కూడా ఎంతోమంది నిశ్శబ్దంగా ప్రార్థించే ఉంటారు. సహోదరుడు భక్త్ సింగ్ గారు 1903లొ పుట్టేనాటికి, ఆత్మీయ మేల్కొలుపు ప్రార్ధనల భారము పరిశుద్ధుల హృదయాలలో ప్రభువు ఉంచియున్నాడు. ఈ ప్రార్ధనా పరిచర్యలో భాగంగా :

ప్రపంచవ్యాప్త సంఘ ప్రార్థనలు సహూదరుడు భక్త్ సింగ్ గారితో ఇంకా ఈయన పరిచర్యతో ఎలా ముడిపడియున్నవో చూద్దాం :

1. 1898 నుండి అమెరికాలోని మూడీ బైబుల్ ఇనిస్టిట్యూట్ లో ప్రతి శనివారం రాత్రంతా ప్రపంచ మేల్కొలుపు కోసం ప్రార్థనలు జరిగేవి. ఆ ప్రార్థనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రార్ధనా భారము పెరిగినది.

2. 1898 నుండి ప్రత్యేకంగా, ఇంగ్లాండులో కెస్విక్ కన్వెన్షన్ నుండి. వచ్చిన ప్రార్థనా వలయాలు భారతదేశాన్ని ప్రార్థనల్లో ఉంచాయి.

3. 1898 నుండి ఒకే కాలంలో భారత్ లో మిషనరీ సేవ ప్రారంభించిన స్త్రీలైన పండిత రమాబాయి, అమీ బియాట్రిస్ కార్మిఖేల్ ఇండియా పునరుజ్జీవం కోసం బహు భారంగా ప్రార్ధించితిరి.

4. 1904లో వెల్ష్ ఉజ్జీవ ఉద్యమం. ఇవాన్ జాన్ రాబర్ట్స్ ప్రార్ధన బృందం ప్రపంచ ఆత్మీయ మేల్కొలుపు కొరకు భారముగా ప్రార్ధించితిరి.

5. 1904లో ఈ నేపథ్యంలోనే పంజాబులో ఒక గొప్ప మేల్కొలుపు వచ్చింది, దీని ఫలితంగా సియాల్కోట్ కన్వెన్షన్, ప్రార్థన & స్తుతి సంఘం ఏర్పడి,

భారతదేశవ్యాప్తంగా శిబిరాలు నెలకొల్పుకుంటూ పునరుజ్జీవం కోసం ప్రార్థించారు. ముఖ్యులు జాన్ హైడ్ (ప్రేయింగ్ హైడ్) ప్రార్ధన బృందం.

6. 1910 నుండి 1925 వరకు మనసున్న మిషనరీలు, వేసవి విడిదికి కొడైకెనాల్ లో చేరి, భారతదేశ రక్షణ కొరకు, స్వదేశీ సంఘాల స్థాపన కొరకు, కొత్త మిషనరీ వ్యూహాల కోసం విధిగా ప్రార్థిస్తూ, ఈ అక్కరలు తీర్చబడేలాగున క్రైస్తవ ప్రపంచానికి ప్రార్ధనా మనవులు పంపిస్తూఉండేవారు.

7. 1930 నుండి లండన్లో ఉన్న హానర్ ఓక్ క్రిస్టియన్ ఫెలోషిప్ సంఘము ఇండియాలో సువార్త అవసరతను ప్రత్యక్షంగా గుర్తించి బలమైన సువార్తికుడు లేపబడవలెనని భారముగా ప్రార్ధించేవారు. వీరిలో ముఖ్యులు థియోడర్ ఆస్టిన్ స్పార్క్స్, జార్జ్ పాటర్సన్, లేడీ డైజీ ఓగెల్, మిస్ సింక్లెయిర్ మొదలగువారు. ఇక్కడనుండే యువకులైన బ్రదర్ ఫ్రెడ్ ఫ్లాక్, బ్రదర్ రేమాండ్స్ గోల్స్ వర్ధీ మిషనరీలుగా 1937లో ఇండియాకు పంపించబడిరి.

8A. 1926-1929, బ్రదర్ భక్త్ సింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్య కోసం లండన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులు – మిస్ కెంప్ చేసిన ప్రార్థనలు.

B. 1928లో కెనడాకు వెళ్లే సముద్ర మార్గములో ఆంగ్లికన్ చర్చిలో జరిగిన దేవుని వాక్య బోధచే ఈయన పొందిన సంధింపు.

C. 1929-1933, వ్యవసాయ ఇంజనీరింగ్ విద్య కోసం కెనడాలో ఉన్నప్పుడు, మిస్టర్ హాన్సెన్, జాన్, ఎడిత్ హేవర్డ్స్ లాంటి వాళ్లు ఈయనను ప్రభువు దగ్గరకి చేర్చి, ఇంకా ఈయన స్నేహితులు వీరంతా ఈయన పరిచర్య కొరకు భారముగా ప్రార్దిస్తూనేఉండేవారు.

9. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా భారమున్న అనేక విశ్వాసులు, సువార్తికులు, మిషనరీలు మొదలగువారు ఎడతెగక చేసిన ప్రార్థనలు.

10. 1933 నుండి, యువ మిషనరీగా భారత్ కు వచ్చిన విల్ఫ్ డర్హమ్, బ్రదర్ భక్త్ సింగ్ గారికి ఆత్మీయ ప్రార్థన సహచరుడు. 1944లో వీరే జెహోవాషమ్మాలో పెద్దలను ఏర్పరచితిరి. ఈ విల్ఫ్ డర్హమ్ బొంబాయిలో GLS వ్యవస్థాపకుడు. అలాగే సహుదరుడు 1933 నుండి తన ప్రార్ధనా సహచరులతో వారాలకొద్దీ ఉపవాస ప్రార్ధనలు చేస్తుండేవారు.

11. సహుదరుడు భక్త్ సింగ్ గారు, ప్రాముఖ్యముగా 1938 ప్రారంభము నుండి 1941 వరకు దేశములో అనేక చోట్ల (ప్రేయింగ్ హైడ్ మాదిరి) శిబిరములు ఏర్పరుస్తూ భవిష్యత్తు పరిచర్యకొరకు, ఉజ్జీవము కొరకు ప్రార్ధనలు చేయిస్తూ ఉండేవారు. ఇందులో భాగంగానే మద్రాసును మొదటిసారి సందర్శించి 1938 ఆగస్టులో 3 వారములు ప్రార్ధనలో నడిపించితిరి.

12. 1941వ సంవత్సరము 14 మే నుండి నీలగిరి కూనూర్ లో సంఘ ప్రత్యక్షత కొరకు ప్రత్యేక ప్రార్ధనా సమావేశం, ఫలితంగా ఏక మనస్సు, ఏకాత్మతో విస్తారముగా దేవుని నడిపింపుతో నూతన నిబంధన సంఘ నియమావళి ప్రకారము 1941 జూన్ 22 న నూతన నిబంధన సంఘమును మద్రాసులో ప్రభువే సహుదరుడు భక్త్ సింగ్ గారి ద్వారా తిరిగి స్థాపించెను.

భారతదేశ ఉజ్జీవం : సహోదరుడు భక్త్ సింగ్ గారి పాత్ర

ఇంతమంది పరిశుద్దుల ప్రార్ధనల ఫలితంగా మరియు భారత దేశంలోయున్న సహోదరుడు భక్త్ సింగ్ గారు జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని ఏర్పాటులో ఉన్న కారణాన, క్రీస్తు శరీరమునకు సేవచేయుటకు ఈయనను ప్రభువే ఎన్నుకొనెను. 1936 నుండి బ్రిటిష్ ఇండియా, మార్టిన్ పూర్ తో మొదలైన ఉజ్జీవము దేశమంతా వ్యాపించినది. ఇలాంటి బలమైన ఉజ్జీవము భారత దేశములో అంతకుముందు ఎన్నడైననూ, తరువాత గాని రాలేదు. ఈయనను దేశములో ఉన్న అన్నిరకాల డినామినేషన్ నాయకులు, పాస్టర్లు ఆహ్వానించుచూ, సాదరంగా స్వాగతించుచూ మొత్తం సభలకు కావాల్సిన ఏర్పాటులన్నీ వాళ్ళే చూసుకునేవారు. ఎందుకనగా ఈయన గొప్ప ఉజ్జీవకారుడుగా 10 సంవత్సరాలు పాటు దేశీయ క్రైస్తవ్యము ఎంతో బలపడినది, భారతదేశ క్రెస్తవ చరిత్రలో తొలిసారి గమనించిన గొప్ప పరిణామం ఇది.

సిస్టర్ లేడీ డైసీ ఒగిల్ ను ప్రభువు ఏవిధముగా వాడుకొనెను.

సహోదరుడు భక్త్ సింగ్ గారు పరిచర్య ప్రారంభానికి, తరువాత అనుదిన సేవా నడిపింపుకు అత్యంత ముఖ్యమైన వనరు ఈయన నిత్య ప్రార్ధనా జీవితము, ఈయన రక్షించబడిన దినము నుండి ప్రార్ధనా ద్వారానే ప్రభువుతో అనుసంధాన మేర్పరచుకొని, నిత్యమూ ప్రభువుతో మాటలాడుచు, ఎటువంటి పనైనను ఆయన చిత్తములో చేయుచుండెను. అలాగే, 1941 మార్చిలో, బాగా అలసిపోయి, ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు 1రాజులు 17,9వ వచనం ద్వారా మాట్లాడుతూ, “నేను అక్కడ ఒక విధవను నీకు ఆహారం పెట్టమని ఆజ్ఞ ఇచ్చాను” అని చెప్పిన కొన్ని రోజులకే లేడీ డైసీ ఒగిల్ అనే మహిళ నుండి లేఖ వచ్చింది. ఈమె ఇంగ్లాండుకు చెందిన ఉన్నతమైన వంశస్తురాలు, ఇంకా బైబిలులో ఉన్న ఫిలేమోనును పోలి దాతృత్వముతో నిండియుండెను. అప్పట్లో లేడీ ఓగుల్ మిషనరీ గెస్ట్ హౌస్ బాధ్యతలు తానే నిర్వహిస్తూ ఉండేవారు. కూనూరులో ఉన్న తన సిల్వర్ డేల్ కి విశ్రాంతికి రావాలని దైవదాసున్ని ఆహ్వానించగా, 1941 మే 14న మద్రాసు మీదుగా కూనూరుకు వెళ్లితిరి. ఈమె నివాసమైన సిల్వర్ డేల్ పెద్ద బంగాళ నీలగిరిలో అందమైన పర్వతప్రాంతంలో వున్నది. అక్కడకు ఈయన చేరుకోగానే సాదరంగా ఆహ్వానించి, తన సేవకులను కాదని, ఆమే స్వయంగా సహుదరునికి వడ్డించి సేవ చేసితిరి. లేడీ ఒగిల్ 1926 లో ఆస్టిన్ స్పార్క్స్ గారు స్థాపించిన హానర్ ఓక్ క్రిస్టియన్ ఫెలోషిప్ సంఘ ప్రారంభ విశ్వాసి. ఈమె 1930 నుండి భారతదేశ సేవకొరకు ఎంచుకున్న పాత్రను లేవనెత్తాలని ఇంకా చర్చికి దేవుని మహిమను తిరిగి తీసుకురావాలని భారంగా ప్రార్థిస్తుండగా, ఆ పని కొరకు ప్రభువుచే ఏర్పరచబడిన ప్రత్యేక పాత్ర సహుదరుడు భక్త్ సింగ్ అని గ్రహించిరి. ఇంకా, దేవుని ఆశీర్వాదము ఈయనపై ఉందని నమ్మిరి. ఈమె ప్రార్థనలు మరియు ఆచరణాత్మక సహాయం ద్వారా భక్త్ సింగ్ గారి పరిచర్యలో ప్రభువు ఈ సహోదరిని అసాధారణ రీతిలో ఉపయోగించుకున్నాడు.

స్వదేశీ సంఘ స్థాపన : నీలగిరి కూనూర్ లో చివరి ప్రత్యేక ప్రార్ధన :

భక్త్ సింగ్ గారు భవిష్యత్తు పరిచర్య కొరకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలన్న భారంతో చివరగా 40 రోజులు ప్రార్ధించితిరి, ఇందులో భాగంగానే 21 రోజులు విరామము లేకుండా ఉపవాసముతో ఈయనతో పాటు ఉన్న సహుదరులతో కలసి ప్రార్ధించితిరి. వీరిలో ముఖ్యులు 1.బ్రదర్ భక్త్ సింగ్, 2.సామ్ ఛాకో, 3.డాన్ మోజెస్, 4.నోయెల్ బేరో, 5.రేమండ్ గోల్స్ వర్థీ, 6.ఫ్రెడ్ ఫ్లాక్, 6. విల్లియమ్స్. వీరందరూ వాక్య భాగాల ఆధారంగా, నూతన నిబంధన సంఘ నియమావళి ప్రకారము, ప్రభువు నడిపించిన ప్రత్యక్షతలో ఏక మనస్సు, ఏకాత్మతో ఏకీభవించితిరి. అంతే కాకుండా, ఇవన్నీ స్థానిక సంఘాల ద్వారా నెరవేర్చాలి అని అర్థం చేసుకున్నారు.

1. పాపుల రక్షణే కాకుండా, రక్షించబడిన వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా బాధ్యత వహించాలి అనే సూత్రాన్ని గ్రహించారు.

2. వివాదాస్పదముగా ఉన్నట్టి బాప్తీష్మము తర్వాత జరుపబడే హస్తనిక్షేపణను, నూతన నిబంధన లేఖనాలననుసరించి తిరిగి సంస్కరించిరి.

3. ఒకే శరీరం, ఒకే ఆత్మ ప్రకారం ఏ విశ్వాసీ ఒంటరిగా జీవించడు, సంఘముగా కట్టబడుట, సంఘ క్రమము, ప్రభువు దినమున సంఘ ఆరాధనా క్రమము, ప్రభువు బల్ల మొదలగునవి.

ప్రభువు బయలుపరచిన విధముగా ఎప్పటినుండో చేస్తున్న ప్రార్ధనల ఫలితంగా, ఈ అంశముల నిమిత్తము కూనూరులో కూడుకున్న ప్రత్యేక ఉపవాస ప్రార్ధనా సమావేశములలో ప్రభువు ఆమోదముద్ర వేసెను. ఈ పరిణామమంతయు లండన్ లో ఉన్న హానర్ ఓక్ సంఘ పెద్దలకు తెలియచేయగా, వారు కూడా ప్రార్ధించి ప్రభువిచ్చిన నూతన నిబంధన సంఘ ప్రత్యక్షతను, తిరిగి అలాగే నెలకొల్పుటకు ప్రభువు భక్త్ సింగ్ గారిని నడిపించిన విధానమును బట్టి సంతోషించి, ప్రభువును స్తుతించి, వారి మద్దతును తెలియచేసిరి.

కూనూరులో ఉన్నప్పుడే మద్రాసు పరిచర్య ప్రారంభించుటకు ప్రభువు బయలుపరచెను. అంతే కాకుండా, అనేక ప్రార్ధనల ఫలితంగా, ప్రభువు బయలుపరచిన నూతన నిబంధన సంఘ నియమావళి ప్రకారము 1941 జూన్ 22 న స్వదేశీ సంఘమును మద్రాసులో సహుదరుడు భక్త్ సింగ్ గారి ద్వారా ప్రభువే తిరిగి స్థాపించెను.

జాన్ మైఖేల్, రాజమండ్రి.