
WRITINGS from Sickbed
క్రైస్తవ వైవిధ్యం
Wednesday, June 18, 2025
అందుకు– … బలహీనత యందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా …నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును
— 2 కొరింథి 12:9
“అ న్నీ బాగుంటేనే దేవుడి ఆశీర్వాదం ఉన్నట్టు” అని భావించే వారికి ఈ వాక్యం ఒక చెంప పెట్టు. దేవుడు మన తండ్రి. ఆయన ఆలనాపాలనలో శిక్ష, సంరక్షణ రెండూ ఉంటాయి. మన తలిదండ్రులు చిన్నప్పుడు ప్రేమతో మనకు అడగకపోయినా అన్నీ అవసరాల్ని తీర్చేవారు. అదే సమయంలో అవసరమైనప్పుడు మనకు శిక్ష విధిస్తూ మనల్ని క్రమ శిక్షణ చేస్తారు కూడా. మన పరమ తండ్రి అంత కంటే గొప్ప తండ్రి!
పై వాక్య నేపధ్యం ముందటి వచనాల నుంచి ఆరంభమవుతుంది. ఏడు నుండి పది వచనాలు మనం క్షుణ్ణంగా చదివితేనే మనకు పూర్తి సందర్భం బోధపడుతుంది. పౌలు తన శారీరక ఇబ్బంది గురించి ప్రార్ధిస్తూ దాని నుంచి తనకు విముక్తిని ప్రసాదించమని ప్రభువును మూడు సార్లు వేడుకోవడం ఇక్కడ మనం చూస్తాం. కానీ పౌలుకు సానుకూల జవాబు(తాను కోరిన జవాబు) తన ప్రభువు నుంచి రాలేదు. అందుకు భిన్నంగా ఆ శారీరక ముల్లును అలాగే ఉంచుతాను కానీ నా కృప నీకు తోడుంటుంది. అది చాలు–అన్న సమాధానమే వచ్చింది. ఇది పౌలు ఆశించిన సమాధానం కాదు.
ప్రార్థనలో మన పని యాచించడమే. ఆ కోరిక తీర్చాలా వద్దా అన్నది ప్రభువు నిర్ణయం.
పౌలు ఒక గొప్ప దైవజనుడు, ప్రభువు నియమించిన అపోస్తులలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నవాడు, నిష్టాగరిష్ట భక్తి ప్రపత్తులు కలవాడు, గొప్ప ప్రార్థనాపరుడు. అదీగాక స్వస్థత వరం ఉన్న దైవజనుడు. ఇంతటి సర్వోత్తముడైన దైవసేవకుడు మూడు సార్లు ప్రార్ధిస్తే ప్రభువు అతడడిగిన కోరికను కాదనడం ఇక్కడ విశేషం!
ప్రార్ధించగానే పనైపోతుంది, కన్నీళ్ళతో ప్రార్ధిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది, ఉపవాసంతో దేన్నైనా సాధించవచ్చు, దేవుణ్ణి మనం గట్టిగా డిమాండ్ చేసి అడగాలి, మీకు స్వస్థత జరగలేదంటే మీకు విశ్వాసం లేదు, …అని చెప్పే నేటి బోధకులు పౌలు దగ్గర నేర్చుకోవాలి.
పౌలు మాహాశయునికి విశ్వాసంలో కొదువ కాలేదు, భక్తిలో కొరత లేదు, ప్రభువుతో పటిష్టమైన సంబంధమూ ఉంది, నీతిగల బ్రతుకూ ఉంది. ప్రార్ధించే వారికి ఇవన్నీ అవసరమే. కానీ, ప్రార్థన ఒక సర్వోన్నతుడైన, ఒక సార్వభౌముడైన దేవుని సమక్షంలో భక్తుడు చేసుకొనే ఒక వినతి అని మనం తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే, ప్రార్థన ఒక అభ్యర్థన, ఒక యాచన (cf.హెబ్రీ 5:7).
కష్టం లేనిదే పరిపక్వత లేదు, కృప లేనిదే విజయం లేదు, బలహీనత లేనిదే బలం లేదు, సిలువ లేనిదే పునరుత్థానం లేదు.
ప్రార్థనలో మన పని యాచించడమే. ఆ కోరిక తీర్చాలా వద్దా అన్నది ప్రభువు నిర్ణయం. ఎందుకంటే ఆయన ప్రభువు, మనం సేవకులం. ఆయనే సర్వాధికారి. ఆయనే మనల్ని ఆదేశించాలి తప్ప, మనం ఆయన్ని ఏ విషయంలోనూ, ఎన్నటికీ డిమాండ్ చేయలేం. మన ప్రభువు కూడా గెత్సేమనేలో సాధ్యమైతే సిలువని తొలగించమని చెమట రక్తమయ్యేంతగా మూడు మార్లు వేదనతో ప్రార్ధించినా ఆయన కోరిక తండ్రి తీర్చలేదు (లూకా 22:39-44). కొన్నిసార్లు మన దేవుడు, మన మంచి కోసమో లేక ఆయన మహిమ కోసమో మనం అడిగిన వాటిని మనకివ్వడు. అయితే మనం మన ప్రభువులా తండ్రి చిత్తానికి శిరస్సు వంచడం నేర్చుకోవాలి. మన ప్రభువు మనకి నేర్పిన ప్రార్థనా పాఠమిదే!
మనల్ని సృష్టించి, ఆలించి, పాలించి మనల్ని పోషించేవాడే మన విన్నపాలు వినకపోతే ఎలా అని మనం ప్రశ్నించవచ్చు. ఆయన మన విన్నపాలు విని, మన్నించే దేవుడే. కానీ, కొన్నిసార్లు ఆయన మన ప్రార్థనకు ప్రతికూలంగా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఇది మన మీద ఆయనకున్న హక్కు, అధికారం. మనం ఆయన్ని ప్రశ్నించలేం. అంతేకాదు, ఇది మన మంచిని కోరే ఆయన మంచితనం కూడా. అందుకనే ఆయన మనకు తన కృపనిచ్చాడు. ఆయన కృప నిరంతరమూ మనకు తోడుగా ఉంటుంది.
కష్టంలోనూ, సుఖంలోనూ ఆయన కృప లేనిదే మనం బ్రతికి బట్ట కట్టలేం. కనీసం ఊపిరైనా పీల్చలేం. మనతో వచ్చిన చిక్కేంటంటే మనం సుఖాల్లో ఆయన కృపను గుర్తించం, కృతజ్ఞతా చెల్లించం. అదంతా మనం సాధించింది, మన బాహు బలం, మన గొప్పతనం అనుకుంటాం. ఎటొచ్చీ కష్టాలొచ్చినప్పుడే దేవుణ్ణి ఎక్కువగా తలచుకుంటాం. ఆయన కృప కోసం అర్రులు చాస్తాం. ఆనాడు పౌలు నేర్చుకున్న ఈ సత్యం ఈనాడు మనమూ నేర్చుకోవాలి. కష్టమైనా, సుఖమైనా ఆయన కృప మనకు చాలును! మనం బ్రతకడానికి చాలినంత కృప, ముఖ్యంగా మనం క్రైస్తవులుగా బ్రతకడానికి చాలినంత కృప ఆయన మన సొంతం చేస్తాడు. మనం చేయవలసిందల్లా ఆయన్ను ఆశ్రయించడం, ఆయన్ను సొంతం చేసుకోవడం.నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను…(కీర్త.26:3) అన్న కీర్తనకారుని వైఖరి ఇక్కడ మనకు ఆదర్శనీయం. క్రైస్తవ జీవనంలోనూ, క్రీసు పరిచర్యలోనూ ఎంతో సాధించిన పౌలు క్రీస్తు బడిలో ఈ జీవన పాఠం నేర్చుకున్నాడు. మనమూ నేర్చుకోవాలి.
“నాకు వేరై మీరేమీ చేయలేరు”
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను…(2 కొరింథి 12:10) అంటున్న పౌలు మాటలు వింటుంటే మీకేమనిపిస్తోంది? ఇది ఒక క్రైస్తవ జీవన వైవిధ్యం! మనం బలహీనులమైనప్పుడే బలవంతులం. మనం దుఃఖంలోనూ సంతోషించగలం. ఇరుకులోనూ విశాలతను అనుభవించగలం. శ్రమల్లోనూ ఆనందంగా బ్రతికేయగలం. భయంలోనూ నిర్భయంగా జీవించగలం. ప్రతీ దినం ప్రభువు కోసం మరణిస్తూ జీవించగలం. ఎంచేతనంటే మన బలహీనతల్లోనే ఆయన శక్తి మనలో పరిపూర్ణ మవుతుంది (2 కొరింథి 12:9) అని సాక్షాత్తూ ప్రభువే సెలవిచ్చారు. క్రైస్తవుడు స్వశక్తితో జీవించ లేడు. “నాకు వేరై మీరేమీ చేయలేరు” అని తేల్చి చెప్పేశారు ప్రభువు (యోహా.15:5). అనేక మంది క్రైస్తవులు భక్తి జీవితంలో రాణించలేకపోవడానికి కారణం ఇదే—క్రీస్తు శక్తిని కాక స్వశక్తిని ఆశ్రయించడమే (cf.గల.2:20).
ఇదంతా క్రైస్తవుడి వైఖరి మీద ఆధారపడి ఉంది. శ్రమల్లో, కష్టాల్లో, అవమానంలో, ఆందోళనలో, అనారోగ్యంలో, ఆవేదనలో మనం దేవుణ్ణి ఎలా దృష్టిస్తున్నాం, మనల్నీ, మన పరిస్థితుల్నీ ఎలా దృష్టిస్తున్నాం, ఎలా స్పందిస్తున్నాం అన్నదే “వైఖరి” అంటే. పౌలు “విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును… క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను” (2 కొరింథి 12:9–10) అంటున్నాడు. బలహీనతల్లో, కష్టాల్లో, అనారోగ్యంలో పౌలు సంతోషించడమే కాదు వాటిని గర్వ కారణంగా భావిస్తున్నాడు.
ఇదే క్రైస్తవ వైఖరి! ఈ వైఖరి అలవర్చుకున్న క్రైస్తవుడికి కష్టమైనా సుఖమైనా ఒక్కటే. ఎందుకంటే ఈ వైఖరి ఉన్న క్రైస్తవుణ్ణి కష్టాల్లో ప్రభువు తన శక్తితో దర్శించి, తన కృపతో నింపి, పరిపూర్ణం చేస్తాడు. ఇదే క్రైస్తవ పరిపక్వతకు సరైన మార్గం.
కష్టం లేనిదే పరిపక్వత లేదు, కృప లేనిదే విజయం లేదు, బలహీనత లేనిదే బలం లేదు, సిలువ లేనిదే పునరుత్థానం లేదు. ఇదే క్రైస్తవ వైవిధ్యం! క్రైస్తవుడు ఇలా బ్రతికినప్పుడే ప్రభువుకు మహిమ, అతనికి ఆశీర్వాదం, లోకానికి వెలుగు అవుతాడు.
—జీపీ
