పాపం—పశ్చాత్తాపం, ఆత్మ స్పృహ , “ప్రతీ పాపం దేవుణ్ణి తన సర్వాధికార పీఠం నుంచి పడదోయడానికి చేసే విఫల యత్నం.” ,

WRITINGS from Sickbed

పాపం—పశ్చాత్తాపం

Thursday, July 10, 2025

నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
— లూకా 15:18-19

నేడు పాపం గురించి మాట్లాడే బోధకులే కరువైపోయారు పాపం! కొందరికి పాపం గురించి మాట్లాడితే కోపం! క్రైస్తవ భక్తి జీవనంలో పాపం గురించిన స్పృహ కీలకమైంది. బైబిల్ తన మొదటి పేజీల్లోనే పాప ప్రస్తావన చేసింది. మనిషికున్నంత ఆత్మ స్పృహ (తన గురించిన ఎరుక) మరి ఏ జీవికీ ఈ భూమ్మీద లేదు. దేవుడు మనిషిని తన పోలికలో సృజించినప్పుడే అతనికి ఈ ఆత్మ స్పృహ సహజంగా అబ్బింది. ఇదే మనం తప్పిదాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే అంతః సాధనం. అందుకే ఆది మానవుడు ఆదాముకు తప్పుచేయగానే (ఎవరూ చెప్పకుండానే) తెలిసిపోయింది! ప్రభువు చెప్పిన ‘తప్పిపోయిన కుమారుని’ ఉపమానంలో చిన్న కుమారుడు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాక ‘బుద్ధి తెచ్చుకున్నాడు’ (లూకా 15:17). ఇదే ఆత్మ స్పృహ! మనిషికి పాపం అలవాటైపోయినపుడు, లోకంలో పాపం పెట్రేగిపోయినపుడు ఈ ఆత్మ స్పృహ సమాజంలోనూ, వ్యక్తి జీవితంలోనూ క్రమేపి కనుమరుగైపోతుంది. పాప భీతి కూడా సన్నగిల్లిపోతుంది. నేటి సమాజంలో ఈ దుస్థితినే మనం కళ్ళారా చూస్తున్నాం. ఐతే నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఈ దుస్థితి నెలకొనడం గర్హనీయం. నేటి క్రైస్తవ బోధకుల్లోనూ, శ్రోతల్లోనూ ఈ పాప స్పృహ (ఆత్మ స్పృహ) కనిపించకుండా పోవడం నిజంగా శోచనీయం.

దేవుని మూల స్వభావం పరిశుద్దత. పాపం మౌళికంగా దేవుని స్వభావానికి విరుద్ధమైంది. అంచేత పాపం ఎప్పుడు చేసినా, ఎవరికి విరుద్ధంగా చేసినా, తలపుల్లో చేసినా, తనువుతో చేసినా, రహస్యంగా చేసినా, బహిరంగంగా చేసినా అది ప్రాధమికంగా దేవునికి విరుద్ధమైంది. తప్పుదారి పట్టిన ఆ చిన్న కుమారుడి పశ్చాత్తాపంలో ఈ భావన స్పష్టంగా కనపడుతుంది. తండ్రిని ఎదిరించి తప్పుదారి పట్టిన అతడు పశ్చాత్తాపంతో రగిలిపోయినపుడు నేను “పరలోకానికి విరోధంగా” పాపం చేశాను అన్నదే అతని మొదటి భావన (లూకా 15:18). ఇదే, ఈ ఆత్మ స్పృహనే పశ్చాత్తాపానికి తొలి మెట్టు.

లోకం తట్టు నుండి క్రీస్తు తట్టుకు తిరిగే ఒక దృఢ నిర్ణయమే పశ్చాత్తాపం.

“ప్రతీ పాపం దేవుణ్ణి తన సర్వాధికార పీఠం నుంచి పడదోయడానికి చేసే విఫల యత్నం.” అన్న ఆర్ సి స్ప్రౌల్ మాటలు అక్షర సత్యాలు. పాపం ప్రాధమికంగా దేవుణ్ణి ధిక్కరించే తిరుగుబాటు గనుక దైవ స్పృహ నుంచే పాప స్పృహ పుట్టుకొస్తుంది. ప్రవక్త యెషయా దేవుణ్ణి చూసేంత వరకూ తన అపవిత్రతను గుర్తించలేకపోయాడు. దేవుడు  ఎంతటి పరిశుద్దుడో అతనికి అర్ధమైననాడు తానెంతటి పాపినో అతనికి అర్ధమైంది. అందుకనే “అయ్యో, నేను…” అంటూ పశ్చాత్తాపంతో అంగలార్చాడు (యెష 6:5). నేటి క్రైస్తవులకు తమ ప్రభువు ఎంతటి పరిశుద్దుడో తెలియకపోవడం వల్లనే (లేక బోధకులు తెలియచేయకపోవడం వల్లనే) వారిలో దైవ భీతి, తత్ఫలితంగా పాప భీతి కరువైపోయింది అనడంలో సందేహం లేదు. మనం పాపం చేసినప్పుడల్లా (అది ఎంత చిన్నదైనా, పెద్దదైనా) మనం మొదట దేవుణ్ణి  ధిక్కరిస్తున్నాం, ఆయన్ని గాయపరుస్తున్నాం అన్న స్పృహలోకి రావాలి. ఇదే నిజమైన పశ్చాత్తాపానికి నాంది.

పశ్చాత్తాపం అంటే నాకేదో అయిపొయింది, నా సాక్ష్యం దెబ్బతినింది, నేను నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను అన్న ఏడుపు కాదు. నేను నా దేవుణ్ణి గాయపరిచాను, నా పక్కన వారిని బాధపెట్టాను అన్న “చిన్న కుమారుడి” భావన నిజమైన పశ్చాత్తాపానికి ప్రతీక. లేదా కొంతమంది అనుకున్నట్టు పరలోకంలో సీటు సంపాదించడానికి పశ్చాత్తాపం ఒక సులువైన మార్గం కాదు. అందువల్లనే రక్షణార్ధమైన (రక్షణ తర్వాతైనా) పశ్చాత్తాపం మనలో కలగాలంటే పరిశుద్దాత్మ పని జరగాల్సిందే (యోహాను 16:8; cf.2 కొరింథీ 7:10). పరిశుద్దాత్మ ఒక పాపిలో, ఒక విశ్వాసిలో జరిగించే పరిచర్యల్లో ఇది అత్యంత ప్రాముఖ్యమైంది.

పశ్చాత్తాపం అంటే మారిన మనస్సు, మారిన జీవితం! ఏడుపు కాదు!

పశ్చాత్తాపం అంటే ఎప్పుడూ ఏడుస్తూ ఉండాలి, దుఃఖంతో ప్రార్ధిస్తూ ఉండాలి, గుర్తొచ్చిన ప్రతీ పాపం ఒప్పుకుంటూ ఉండాలి… ఇలా చేస్తూ ఉంటే దేవుడు ఎప్పటికో కనికరించి నీకు దర్శనమిస్తాడు, నిన్ను  క్షమిస్తాడు—అని చెప్పే వాళ్ళూ లేకపోలేదు.  బైబిల్ చెప్పే పశ్చాత్తాపం ఇది కాదు. నిజమైన పశ్చాత్తాపం ఒక మనిషిలో మనో మార్పిడికి దారి తీస్తుంది. అందువల్లనే ఇంగ్లిష్ బైబిల్లో రిపెంట్/ రిపెంటెన్స్ అని ఉన్న చోటల్లా సర్వసాధారణంగా తెలుగు బైబిల్లో  “మారు మనస్సు” అని అనువదించారు. లోకం తట్టు నుండి క్రీస్తు తట్టుకు తిరిగే ఒక దృఢ నిర్ణయమే పశ్చాత్తాపం. జీవితాంతం క్రీస్తుని అంటి పెట్టుకొని ఆయనతో కలిసి నమ్మకంగా నడవాలనుకొనే ఒక దృఢ సంకల్పమిది. పశ్చాత్తాపంలో భావోద్వేగాలు ఉండవచ్చు. ఐతే అందర్లో అన్నిసార్లు ఒకే రకమైన భావోద్వేగాలుండవు. సమరయ స్త్రీ మారినప్పుడు ఆమెలో ఏడుపు కంటే ఆనందమే ఎక్కువ చూస్తాం. అమె వచ్చిన పనిని మర్చిపోయి, ఆనందంతో ఊర్లోకి వెళ్లి, వారందరినీ పోగు చేసుకొని, వారిని ప్రభువు దగ్గరకి తీసుకరావడం చూస్తాం. మరో సందర్భంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ మారు మనస్సు పొంది కన్నీళ్ళతో ప్రభువు పాదాలను తడపడం చూస్తాం. ఇంకొక సందర్భంలో మారు మనస్సు పొందిన జక్కయ్య సంతోషంతో తన తప్పును దిద్దుకుంటూ తాను అన్యాయంగా సంపాదించిన ఆస్తిని నాలిగింతలు ఎక్కువగా తన రుణస్తులకు పంచి పెట్టడం చూస్తాం.

పశ్చాత్తాపం అంటే మారిన మనస్సు, మారిన జీవితం! ఏడుపు కాదు! ఈరోజు ప్రభువు పాదాల చెంత ఏడ్చి, రేపు షరా మాములుగా లోకంలో కలిసిపోయే సూడో క్రైస్తవులు చాలా మందే ఉన్నారు. వీళ్ళకి ప్రభువు తెలీదు, ఆయన పరిశుద్దతా తెలీదు. వీళ్ళలో పాప భీతి, స్పృహ ఉండనే ఉండదు.

నా పాపాలన్నీ ఏనాడో ఆయన సిలువలో కొట్టేసాడు, నాలో పాపం లేదు అని భావించేవాడు, చెప్పుకునేవాడు అబద్దికుడు, మోసగాడు అని బైబిల్ చెప్తుంది

పాపం, పశ్చాత్తాపం కలిసి దోస్తీ చేయలేవు. పశ్చాత్తాపం ఉన్నచోట పాపం ఉండలేదు. పాప ఉన్న చోట పశ్చాత్తాప స్పృహ ఉండదు. ఒక నిజమైన విశ్వాసి పాపంలో పడవచ్చు కానీ, అందులో కొనసాగలేడు. అతడు పశ్చాత్తాప తప్తుడై తండ్రి ఇంటికి తిరిగి వస్తాడు (1 యోహాను 3:9). ఒక నిజమైన విశ్వాసి ప్రతీ దినం తన దేవుని పరిశుద్ద సముఖంలో, ఆయన ముఖ కాంతిలో, తనలో దాగి ఉన్న పాపాలను గుర్తిస్తాడు, ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపపడతాడు. ఆయన రక్తంలో పునీతుడవుతాడు (1 యోహాను 1:7,9). నేను విశ్వాసినైపోయాను కదా అంతా కృపే చూసుకుంటుంది, నా పాపాలన్నీ ఏనాడో ఆయన సిలువలో కొట్టేసాడు, నాలో పాపం లేదు అని భావించేవాడు, చెప్పుకునేవాడు అబద్దికుడు, మోసగాడు అని బైబిల్ చెప్తుంది (1 యోహా. 1:8,10). నిజమైన విశ్వాసి వెలుగైన దేవుడితో కలసి నడుస్తాడు, ఆయనతో అన్యోన్యంగా సహవసిస్తాడు. అంచేత అతడు నిత్యం తన పాపాలను విడనాడుతూ ఆయన సహవాసంలో ఆయన కుమారుని రక్తంలో పునీతుడవుతూ ఆయనకు చేరువవుతాడు.

మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఆయనలో ఏ ఛాయా, మచ్చా ఉండదు. ఏ క్రైస్తవుడూ పరిపూర్ణుడు కాదు. ఐతే ఆయనతో నడిచే క్రైస్తవుడు నిత్యం పరిపూర్ణత వైపు అడుగులు వేస్తాడు. ఇదే క్రైస్తవ జీవనం!

—జీపీ

Previous Devotions