పరమ తండ్రే మనకు ఆదర్శం

కుటుంబ బాధ్యతల్లో తండ్రి పాత్ర అత్యంత కీలకమైంది, ప్రాముఖ్యమైంది కూడా. జాతి నిర్మాణంలో కుటుంబ పాత్ర మౌళికమైంది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. ఆ పౌరులు కుటుంబంలోనే తయారవుతారు. ఆ కుటుంబానికి రథసారథి తండ్రి. నాయకుడైనా, నేరస్తుడైనా కుటుంబం నుంచే రావాలి. నీతి నిజాయితీ ఉన్న పౌరులైనా, నీతిమాలిన సంఘవిద్రోహ శక్తులైనా కుటుంబం నుంచే వస్తారు. కుటుంబంలో తండ్రి ఎలాంటి పాలన చేస్తాడు అన్నదాని మీదే పిల్లల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తండ్రి బా అంత గురుతరమైనది. దేశానికి ఆయువుపట్టు తండ్రి ఐతే కుటుంబానికి ఆయువుపట్టు తండ్రే!

ఆయన సన్నిధిని వెతకండి

“దేవుడి పేరిట చేసే కార్య్రమాల కంటే దేవుడి సన్నిధే ప్రాముఖ్యం”. దేవుడి నామాన్ని రోషంగా ప్రకటిస్తూ, నేటి క్రైస్తవ సంఘ దుస్థితిని ఏడు దశాబ్దాలకు ముందే చెప్పి హెచ్చరించిన దైవజనుడు ఐడెన్ విల్సన్ టోజర్ అన్న మాటలివి. నేటి క్రైస్తవంలో మన కళ్ళెదుట కనబడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన హెచ్చరికలు మన కోసమే అనిపిస్తుంది. నేటి క్రైస్తవంలో సభల జోరు, సంఘాల్లో కార్యక్రమాల హోరు ఎక్కువయ్యింది. వీటిలో పాల్గొనడమే ఆధ్యాత్మికత అని తలంచే భ్రమలోకి చాలామంది వెళ్ళిపోయారు. చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న సభలు దేవుని చిత్త ప్రకారమే జరిగిస్తున్నామా, వాటి పైన ఆయన ప్రసన్నత ఉందా అన్న విషయం ఎవ్వరికీ పెద్దగా పట్టట్లేదు. వీటిలో పాల్గొంటే చాలు ఆశీర్వాదం దానంతట అదే వచ్చేస్తుంది అన్నది అనేకుల అపోహ.

పిలుపు లేని పరిచర్య

పిలవని పేరంటానికి వెళ్లకూడదు అన్నది భారతీయుల పట్టింపు. ఆ మాటకొస్తే ఆత్మ గౌరవం ఉన్న ఎవ్వరూ పిలవని పెళ్లికి, పేరంటాలకు వెళ్ళరు. విచిత్రమేమిటంటే, ప్రభువు పిలవకుండానే “పరిచర్య” చేయడానికి విచ్చేసిన ప్రబుద్ధులు ఇప్పుడు మన క్రైస్తవంలో కోకొల్లలు. సోషల్ మీడియా వచ్చాక, “సెలబ్రిటీ సేవకులు” ఎక్కువయ్యాక చాలా మందికి దేవుని పిలుపు వచ్చేసింది. అదేవిటో గానీ ఆ పిలుపు సువార్తికులు గానో, సహాయకులు గానో అస్సలు రాదు. ఐతే పాస్టర్ గానో, లేకపోతే స్పీకర్ గానో దేవుడు పిలిచినట్టు చెబుతున్నారు. మరి ఇది లాభదాయక పరిచర్య కదా!

గురువు పాదాల చెంత…

మన దేశంలో గురు సంప్రదాయం కొత్తేమీ కాదు. అనాది కాలంగా వస్తున్నదే! దైవాన్ని పరిచయం చేసుకోవడానికి, దైవ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి గురువు తప్పనిసరి అన్నది మన వాళ్ళ నమ్మకం. అంచేత గురువు గారిని దేవుడి స్థానానికి ఎత్తేసి “గురు దేవోభవ” అని మొక్కేసే పరిస్థితీ మన సంస్కృతిలో ఉండనే ఉంది. ఇందుకు భిన్నమైన ప్రబోధం చేస్తున్నారు మన ప్రభువు.

వినుట విధేయత కోసమే

సోషల్ మీడియా పుణ్యమా అని నేటి భారతీయ క్రైస్తవంలో వాక్యం వినడం ఎక్కువైంది. వింటున్నదంతా వాక్యమేనా అన్న సంగతి పక్కన పెడితే వినిపిస్తున్న ప్రసంగాలతో పాటు వినే క్రైస్తవులూ ఎక్కువయ్యారు అన్నది వాస్తవం. ఎటొచ్చీ ఎలా వింటున్నారన్నదే ప్రశ్న!

కాలం వృధా = జీవితం వృధా

సమయం విలువ తెలీక కాలయాపన చేసే వాళ్ళ జాబితాలో మన దేశస్తులు ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదేమో! జనాభాలో దాదాపు అర్ధభాగం యువజనులు ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. ప్రపంచం మన దేశాన్ని ఇపుడు “యువ భారతం” అని పిలుస్తోంది. అంటే ప్రపంచంలో కెల్లా అత్యంత ఎక్కువ యువ శక్తి ఉన్న దేశం మనదే. అంటే దేశ యువశక్తి పరిపూర్ణంగా సద్వినియోగమైతే మన దేశం ప్రగతిలో అగ్రభాగాన నిలిచేదేమో! ఐనా మన యువత సినిమా హీరోల వెంటో, రాజకీయ నాయకుల వెంటో తిరిగి తమ అమూల్యమైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు.

శాంతి పహరా

శాంతి—ఈ లోకంలో కరువైన విషయాల్లో ఒకటి. డబ్బు హోదా, కులం బలం, పదవి పరపతి ఇవేవీ శాశ్వత శాంతిని ఇవ్వలేవు. సాంకేతికత సుఖాన్నివ్వగలదే గానీ శాంతిని ఇవ్వలేదు. కుబేరులు సైతం శాంతి కోసం అర్రులు చాస్తారు—అది దొరక్క! లోకస్తులు పబ్బులకు, క్లబ్బుకలకు అందుకే వెళ్తుంటారు. అక్కడా అది దొరకదు. మాదకద్రవ్యాల వాడకం, మందు తాగడం కూడా దాని కోసమే. ఐనా శాంతి అందని ద్రాక్షనే!

ప్రభుత్వాలన్నీ దేవుడివే

ఇండియాలో ఎన్నికల పర్వం ముగిసింది. దేశమంతా నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. కొందరి ఆశలు అడియాశలయ్యాయి. కొందరి నిస్పృహలు ఆశలుగా చిగురించాయి. క్రైస్తవులు, ఇతర మైనారిటీలు ఫలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బావుండు అని ఆశపడ్డారు. అనేకమంది క్రైస్తవులు రాబోయే ప్రభుత్వాల గురించి ప్రార్థనలు చేశారు, చేస్తున్నారు.

భయం లేని నమ్మకం

ఆదాము పాపం చేసినప్పటి నుంచీ భయం మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది (ఆది.3.10). భారతీయ జన సామాన్యంలో ఇది మరీ ఎక్కువ. తుమ్మినా భయం చిమ్మినా భయం, పిల్లి అంటే భయం బల్లి అంటే భయం, నలుపంటే భయం చీకటంటే భయం. మనకి వాస్తు భయాలు, శాప భయాలు, ముహూర్త భయాలు, జాతక భయాలు, దయ్యాల భయాలు, దిష్టి భయాలు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో పుట్టి పెరిగిన క్రైస్తవులకూ ఈ భయాలు పట్టుకోవడం సహజమే మరి!

స్వీయ చిత్రం

ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ప్రశ్నల్లో ఒకటి”నేనెవరిని?” అన్నది. నేడు కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా ఇంటర్వ్యూల్లో అడిగే మొదటి ప్రశ్న ఇదే. “ఓ మనిషీ, నిన్ను నీవు తెలుసుకో” అన్నారు ప్రాచీన తాత్వికులు. ఐతే మన ఆసక్తి వేరు. మనం మనల్ని తెలుసుకోవడం వదిలేసి పక్కింటి వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగిచూడటం చాలా మందికి సరదా. ఇపుడు సోషల్ మీడియా నిండా ఇదే కంటెంట్! వాళ్లేమిటి? వీళ్లేమిటి? వాళ్ళ బతుకులేంటి? వీళ్ళ బతుకులేంటి? ఇదే ధ్యాస!