క్రీస్తే మూలం
మార్పు లోకంలో సహజం. కాలం మారుతుంది. విశ్వంలో ప్రతీ వస్తువు మార్పుకు లోనౌతుంది. నక్షత్ర రాశులు స్థానభ్రంశం చెందుతూనే ఉంటాయి. నక్షత్రాలు మండిపోతూ ఉన్నాయి. సూర్యుడి సైజూ క్రమేపీ తగ్గిపోతూ ఉంది. వాతావరణం విపరీత మార్పులకు గురవుతూ వస్తోంది. మనుషులూ, వారి ఆరోగ్య పరిస్థితులూ, వారి వ్యవస్థలూ, విలువలూ, సంబంధాలూ అన్నీ నిత్యం మారుతున్న విషయాలే. మన దేశంలో ఐతే మనం అనాదిగా మన దేవుళ్లనూ మార్చుకుంటూ వస్తున్నాం.
వినయ విధేయ విశ్వాసం
నేటి క్రైస్తవంలో చాలా మంది విశ్వసించడమంటే మతం పుచ్చుకోవడమో, బాప్తీస్మం తీసుకోవడమో, నిర్ధారణ తీసుకోవడమో లేక స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో ప్రార్థన చేయించుకోవడమో అనుకుంటున్నారు. దానికి తోడు మన అయ్యగార్ల ప్రసంగాలూ అలానే ఉన్నాయి. విశ్వాసమంటే పూర్తిగా ఆధారపడటం, ఆనుకుపోవడం. ఈ విశ్వాసం ఒక అయ్యగారి ప్రార్థన పైనో, ఆయన ఇచ్చే నూనె బుడ్డి పైనో, ఒక సంఘ నియమం పైనో, ఒక సిద్ధాంతం పైనో కాదు. ఈ విశ్వాసం ఒక విలక్షణమైన వ్యక్తి పైన! దేవునికి నరునికి మధ్య ఉన్న అనంత అగాధాన్ని పూడ్చ గల్గిన దైవమానవుడైన క్రీస్తు పైన. దేవునికి మనిషికి మధ్య ఉన్న పాప గోడను కూల్చ గల్గిన సిలువ వేయబడిన క్రీస్తు పైన. మనిషిని పాపమరణాల దాస్యం నుండి విడిపించ గల్గిన మృత్యుంజయుడైన క్రీస్తు పైన. విశ్వాసానికి కారకుడు, దాన్ని పరిపూర్తి చేసేవాడూ ఐన క్రీస్తు పైనే మన విశ్వాసం (హెబ్రీ.12.1). ఈ విశ్వాసమే మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది (1 యోహా.2.1-2).