
WRITINGS from Sickbed
భయం మధ్య అభయం
Monday, June 16, 2025
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.
— కీర్తనలు.23:4
ఈ కీర్తన చిన్న పిల్లలకు కూడా సుపరిచితమే. కంఠత వాక్యాల్లో కూడా తరచూ వింటూ ఉంటాం. మనలో అనేకమందికి ఇది బాగా కంఠత వచ్చిన కీర్తన కూడా. ఆరు వచనాలున్న ఈ కీర్తనలో ఈ ఒక్క నాల్గో వచనం తప్ప అన్ని మనల్ని ఆదరించి, పురికొల్పి, వెన్నుతట్టి, ప్రోత్సహించి, బలపరిచే సానుకూల వచనాలే. నాల్గవ వచనం అకస్మాత్తుగా కీర్తన మధ్యలో తటస్థించి జీవితములోని ఒక ప్రతికూల పరిస్తితి గురించి మాట్లాడుతుంది. అదే “గాడాంధకారపు లోయ”. ఈ కీర్తన కవితా ధోరణిలో ఉంది గనుక ఈ కవితాత్మక అంతరార్ధాన్ని మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. బైబిల్ పరిభాషలో చీకటి, గాడాంధకారం, లోయ వంటి పదాలకు అర్ధం ఒక శ్రమ కావొచ్చు, ఒక కష్టం కావొచ్చు, ఒక కీడు కావొచ్చు, ఒక భయం కావొచ్చు, ఒక ఉపద్రవం కావొచ్చు, చివరికి మరణపుటంచులలో ప్రయాణించే ఒక అనుభవం కావొచ్చు.
దేవుని సన్నిదిని అనుభవించడం ఒక ఎత్తయితే మనకు తోడైయున్న ఆయన మనల్ని ఎలా పోషిస్తాడో, సంరక్షిస్తాడో, ఆదుకుంటాడో తెలుసుకోవడం మరో ఎత్తు.
ఈ కీర్తనను దావీదు అనుభవించి రాస్తున్నాడు. నిజానికి దావీదు గొర్రెల కాపరి. గొర్రెలను మేపి,సాకి సంరక్షించడం అతని పని. అయితే ఇప్పుడు ఒక గొర్రెల కాపరి తనను గొర్రెగా ఊహించుకుంటూ తన దేవుడిని తన కాపరిగా దృష్టిస్తున్నాడు. ఈ ఆలోచన ఇశ్రాయేలీయుల విశ్వాస జీవనంలో పరిపాటి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన తనను తాను ఇశ్రాయేలీయులకు గొర్రెల కాపరిగా పరిచయం చేసుకోవడం చూస్తాం (యెష 40:11). నిజమే ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము(కీర్తన 95:6).
క్రైస్తవుడు దేవుని ఆలనాపాలనలో పెరిగే గొర్రెపిల్ల. క్రైస్తవ జీవనం అయన పోషణలో సంరక్షణలో నడిపింపులో నిత్యం కొనసాగుతుంది; కొనసాగాలి కూడా. అయితే చాలామంది అనుకున్నట్టు లేదా కొందరు బోధకులు బోదిస్తున్నట్టు క్రీస్తు సంరక్షణలో నడిచే క్రైస్తవుని జీవితం ఎల్లప్పుడూ పచ్చిక బయళ్ళపై పరుండినంత సుఖం గానూ, నిమ్మళమైన జలాల వద్ద నడిచినంత ప్రశాంతంగానూ, ప్రాణం తెప్పరిల్లినంత ఆహ్లాదకరంగానూ, గిన్నె నిండి పోర్లినంత వెల్లువెత్తిన ఆశీర్వాదాలతోనూ ఉండదు. ప్రభువు ఆలనాపాలనలో కొనసాగే సుదీర్ఘ క్రైస్తవ జీవన ప్రయాణంలో “గాఢాంధకారపు లోయలు” కూడా ఎదురవుతాయి. గమ్యం తెలియని చిమ్మ చీకట్ల గుండా వెళ్ళవలసివస్తుంది. భయం గొలిపే లోయ అనుభవం కూడా సహజమే. ఆ లోయ అనుభవంలో కొన్ని సార్లు అవమానం, అనారోగ్యం, ఆందోళన, ఆక్రంధన, నిరాశ, నిస్పృహ , ఒంటరితనం, ప్రాణ గండం కూడా ఉండవచ్చు. ఇది బైబిల్ మనకు నేర్పిస్తున్న జీవన సత్యం. ప్రభువు కూడా తన శిష్యుడు ప్రతీదినం తన సిలువనెత్తుకొని తనను వెంబడించాలని తెగేసి చెప్పాడు(లూకా 14:26-27). “గాఢాంధకారపు లోయ”, “సిలువ” అన్న ఈ రెండు పదాలు సమాన అర్ధాలతో వాడిన పోలిక పదాలే.
ఆయన సన్నిదిని కష్టాల్లో సైతం గుర్తించడం దాన్ని అనుభవించడంలోనే క్రైస్తవుని ధైర్యానికి రహస్యం దాగి ఉంది.
క్రైస్తవ జీవనం కష్ట సుఖాల కలబోత. దావీదు తన కీర్తనలో గాఢాంధకారపు లోయ గురించి మాట్లాడుతూనే “ఏ అపాయమునకు భయపడను” అని అంటున్నాడు. ఇది క్రైస్తవుని ధైర్యం, తెగింపు, అభయం. అంతా బాగున్నప్పుడు ఎవరు భయపడరు చెలించరు. అలా జరిగితే అది అర్ధం లేని పిచ్చి భయం అవుతుంది. భయం గొలిపే పరిస్థితుల్లో భయపడక పోవడమే గొప్ప! ఇది క్రైస్తవుని భాగ్యం! అయితే ఇది క్రైస్తవుని గొప్పతనం కాదు. భయానక పరిస్థితుల్లో నిర్భయంగా మనం బ్రతకడానికి ఒకే ఒక్క కారణం “మన ప్రభువు మన కాపరి” అన్న వాస్తవం. దావీదు తన దేవుణ్ణి “నా” కాపరి అంటున్నాడు. అదే అతని ధైర్యం. ప్రతి క్రైస్తవుడూ ప్రభువును తన “సొంత” కాపరిగా చేసుకొని ఆయన కనుసన్నల్లో, అదుపాజ్ఞల్లో బ్రతకడం నేర్చుకుంటే దావీదు లాంటి దేనికి తమకని నిర్భయ క్రైస్తవ జీవనం అలవడుతుంది.
అపాయకర లోయ అనుభవాల్లో సైతం తానూ అధైర్య పడకుండా ఉండటానికి దావీదుకు కనీసం రెండు కారణాలున్నాయి. అందులో మొదటిది తన దేవుని సన్నిది. “నీవు నాకు తోడైయుందువు” అంటున్నాడు(కీర్తన 23:4). దేవుని సన్నిది గురించిన ఈ స్పృహ ప్రతి క్రైస్తవుడికి అవసరం. మన దేవుడు ప్రతి చోట ఉంటాడు. ఆయన సర్వ వ్యాపి. కానీ ఆయన సన్నిదిని కష్టాల్లో సైతం గుర్తించడం దాన్ని అనుభవించడంలోనే క్రైస్తవుని ధైర్యానికి రహస్యం దాగి ఉంది. దావీదుకు తన దేవుడు వ్యక్తిగతంగా తెలుసు. తన దేవుని సన్నిదిని అతడు నిత్యం అనుభవించడం నేర్చుకున్నాడు . అందుకే గాఢాంధకారపు లోయల్లో సైతం అతనికి భయం లేదు.
క్రైస్తవ జీవనం కష్ట సుఖాల కలబోత.
దేవుని సన్నిదిని అనుభవించడం ఒక ఎత్తయితే మనకు తోడైయున్న ఆయన మనల్ని ఎలా పోషిస్తాడో, సంరక్షిస్తాడో, ఆదుకుంటాడో తెలుసుకోవడం మరో ఎత్తు. దేవునికి దగ్గరైన వాడికే ఆయన మంచితనం నమ్మకత్వం అర్ధమవుతాయి. దావీదు ధైర్యానికి ఇది రెండవ రహస్యం. దేవుడు మనకు తోడైయున్నాడని నమ్మడమే కాదు ఆ దేవుడి స్వభావాన్ని కూడా మనం నమ్మాలి. నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును అన్న దావీదు మాటల్లో ఆ నమ్మకమే తొనికిసలాడింది. ఇశ్రాయేలీలు జీవన విదానములో దుడ్డుకర్ర దండం అన్నవి నడిపింపు, సంరక్షణ, కాపుదల, భద్రతకు గురుతులు. దేవునితో ఉన్న దావీదు లాంటి ఈ సన్నిహిత సంబంధం, ఆయన సన్నిదిని నిత్యం అనుభవించే ఎరుక, ఆయన మంచితనం పైన నమ్మకం ఇవే ఒక క్రైస్తవుణ్ణి కష్టాల్లో సైతం నిలబెడతాయి గట్టెక్కిస్తాయి దేవుని దగ్గర చేస్తాయి.
—జీపీ
