
WRITINGS from Sickbed
హింస ధన్యత ఎలా అవుతుంది?
Tuesday, July 1, 2025
నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
— మత్తయి 5:10
నిజ క్రైస్తవులకి ఈ లోకంలో హింస తప్పదు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరు హింసపొందుదురు” (2 తిమో.3:12) అని బైబిల్ చెబుతోంది. ఇక్కడ ప్రత్యేకించి అన్యులనుంచీ లేక క్రైస్తవ ద్వేషులనుంచీ లేక సజ్జన ద్వేషులనుంచీ (2 తిమో. 3:3) వచ్చే హింస గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. ఇది క్రీస్తును తూ.చ. తప్పకుండా పాటించడం లేక ఆయన్ను మాత్రమే పూజించడం వల్ల లేక లోక మర్యాద కంటే క్రీస్తు ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల (ఒక క్రైస్తవుడికి) కలిగే హింస. ఇటువంటి హింస గుండా వెళ్ళే క్రైస్తవులని ప్రభువు ధన్యులు అంటున్నారు. ఆ పక్క వచనంలోనే ఆయన “నా నిమిత్తం” జనులు మిమ్ములను హింసిస్తారు… అప్పుడు మీరు ధన్యులు అని కూడా చెప్తున్నారు (వ.11).
అయితే నీతి నిమిత్తం కానీ, క్రీస్తు నిమిత్తం కానీ కలగని హింస కూడా అప్పుడప్పుడూ క్రైస్తవుణ్ణి తాకుతుంది. ఇది క్రైస్తవుడి బుద్ధిహీనత వల్లో, నోటి దురుసుతనం వల్లో, స్వయంకృతాపరాధం వల్లో తాకే హింస. దీని వల్ల పక్క క్రైస్తవుడికి కూడా ఇబ్బందే. ఈ మధ్య యూట్యూబ్లో ఇటువంటి క్రైస్తవ ప్రభుద్దులు ఎక్కువయ్యారు. వేదిక మీద నుంచి ఆవేశంతో తమకిష్టమొచ్చినట్టు మాట్లాడేయడం అదే ప్రవచనం అనడం లేదా నేను చెప్పిందే వేద వాక్కు అన్నట్టు కనీసం క్షమాపణ చెప్పకపోవడం, అన్య విశ్వాసుల మనోభావాలు దెబ్బతినేలా దురుసుగా మాట్లాడడం వంటి కొత్త సంస్కృతి నేటి క్రైస్తవ ప్రబోధంలో పొడసూపుతుంది. పైగా ఇవేవో గొప్ప విషయాలన్నట్టు వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడం పరిపాటి అయిపొయింది. దీనికితోడు ఇద్దరు క్రైస్తవ బోధకులు వ్యక్తిగత కక్షల నేపధ్యంలో లేక సిద్ధాంత విభేదాలతో సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా కొట్లాడుకోవడం లాంటి సంస్కృతి కూడా ఊపందుకుంది. ఇది క్రైస్తవ్యాన్ని అభాసు పాలు చేయడమే కాకుండా, అన్యుల ముందు ప్రభువు నామాన్ని అవమానం పాలు చేస్తుంది. ఇటువంటి పోకడ ప్రమాదకరమైంది. ఇది లోకం నుంచి హింసను ఆహ్వానిస్తుంది. సదరు ప్రబోధకులను ఇటువంటి హింస తాకినప్పుడు వాళ్ళేదో క్రీస్తు నిమిత్తం హింస పొందుతున్నట్టు పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఇక్కడ హాస్యాస్పదం, దుర్మార్గం. ప్రభువు మత్తయి సువార్తలో ఇటువంటి హింస పొందు వారు ధన్యులు అని చెప్పలేదని క్రైస్తవ లోకం గ్రహించాలి.
జాగ్రత్త! ఈ లోకంలో మనం క్రీస్తు కోసం పడ్డ బాధ పరలోక భాగ్యాన్నిస్తుంది.
నిజ క్రైస్తవునికి ఈ లోకంలో శ్రమ, హింస తప్పనిసరి—అని ప్రభువూ, పౌలూ నొక్కి చెప్తున్నారు. ఈ బైబిల్ బోధ నేటి క్రైస్తవ సెలబ్రటి స్పీకర్ల బోధకు విరుద్ధం. మనకు ప్రభువూ, ఆయన వాక్యమే ప్రమాణం! మనకు ఈ లోకంలో హింస ఎందుకు తప్పనిసరి? క్రైస్తవుడంటే మతం పుచ్చుకున్నవాడో, బాప్తిస్మం తీసుకున్నవాడో లేక మెగా చర్చికి వెళ్ళేవాడో కాదు. క్రైస్తవుడంటే క్రీస్తుకి విధేయుడు, క్రీస్తుని పుణికి పుచ్చుకున్న వాడు, క్రీస్తుని పాటించే వాడు, క్రీస్తు బాటన నడిచే వాడు. ఈ లోకం బాట క్రీస్తు బాటకు అభిముఖంగా ఉంటుంది. ఈ లోక నైజం క్రీస్తు నైజానికి వ్యతిరేకం. ఈ లోక ధర్మం క్రీస్తు ధర్మానికి విరుద్ధమైంది. అందుకే పోరాటం! క్రైస్తవుడు బ్రతికినంత కాలం ఈ సంగ్రామంలో పోరాడుతూ ఉండవలసిందే. అదే మన సిలువనెత్తుకొని క్రీస్తును వెంబడించడం అంటే. స్వశక్తి మీద ఆధారపడకుండా క్రీస్తు వైపు చూస్తూ పోరాడినంత కాలం క్రైస్తవుడికి ఈ రణరంగంలో గెలుపు ఖాయం. ప్రభువు వెనక నీళ్ళ మీద నడిచిన పేతురుకు ఈ పాఠం నేర్చుకోవడానికి కొంత సమయం పట్టింది. గెలుపోటముల మధ్య “ప్రభువైపు చూస్తేనే గెలుస్తాం” అన్న పాఠం నేర్చుకోవడానికి మనకూ సమయం పడుతుంది.
క్రీస్తు నిమిత్తమైన హింస క్రైస్తవుడికి “ధన్యత” అంటున్నారు ప్రభువు. మూల భాషలో “ధన్యత” అంటే “ఆనందం” అని అర్ధం. హింస ఎవరికైనా ఎలా ఆనందం అవుతుంది? ఈ ఆనందం హింస నడుమ క్రీస్తుతో మనకున్న అనుబంధంలో నుంచి వచ్చే ఆనందం. ఇది శారీరక, మానసిక స్థితికి మించిన ఒక ఆత్మానందం. ఇది ఇతరులు మనల్ని చూసి అసూయపడేటంత ఆనందమని మూలార్ధం చెబుతోంది. డబ్బూ, హోదా, పరువూ, ప్రతిష్టా ఉన్న వాళ్ళంతా చివరికి కోరుకునేది ఆత్మానందమే. కానీ అది వాళ్ళకి దొరకడం అరుదు. దొరికినా తాత్కాలికమే. క్రీస్తులో ఉన్నవాళ్ళకు ఇది శాశ్వతంగా సొంతం. ఈ లోకంలో మనం క్రీస్తులో ఆనందించడం, జీవితాన్ని ఆయనలో ఆస్వాదించడం నేర్చుకున్నప్పుడు శ్రమ లోనూ, బాధలోనూ ఆనదించడం నేర్చుకుంటాం. ఇది క్రైస్తవ పరిణతికి గురుతు.
గెలుపోటముల మధ్య “ప్రభువైపు చూస్తేనే గెలుస్తాం”
ఇక్కడ “ధన్యత” అంటే ‘భాగ్యం’ అనే అర్ధం కుడా ఉంది. క్రీస్తు కొరకు శ్రమ పొందడం లేక నింద పాలు కావడం క్రైస్తవుడి సౌభాగ్యం అన్నమాట. ఎందుకంటే ఈ లోక భోగభాగ్యాలు అశాశ్వతమైనవి. వాటిని చూసి ప్రజలు చప్పట్లు కొట్టవచ్చేమో. ఆ తర్వాత వాళ్ళే చెప్పుల దండలు కూడా వేయగలరు. జాగ్రత్త! ఈ లోకంలో మనం క్రీస్తు కోసం పడ్డ బాధ పరలోక భాగ్యాన్నిస్తుంది. ఈ హింస, బాధ క్రైస్తవుడికి ఈ లోకంలో అనివార్యం అని ముందు చెప్పుకున్నాం. అయితే ఈ లోక విశ్వాస యాత్రలో బలం పుంజుకోవడానికీ, ఆధ్యాత్మిక పోరాటంలో రాటు తేలడానికీ, శ్రమలు బాధలు అనివార్యం.
అంచేత శ్రమ క్రైస్తవుడికి ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సౌభాగ్యం. అందుకే మనం ధన్యులం! సౌభాగ్య సువార్తను చెవులు రిక్కించుకొని వినే వాళ్లకూ, దాన్ని పాటించే వాళ్ళకూ ఈ లోక భాగ్యాలు దొరక్క పోగా, పరలోక సౌభాగ్యమూ శాశ్వతంగా దూరమవుతుంది.
—జీపీ
