జీవన దీపం

Thursday, May 30, 2024

“నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.”
— కీర్త.119:105

కళ్ళు లేకపోతే పగలైనా రాత్రైనా ఒక్కటే. అంధుడికి దీపంతో పనిలేదు. కానీ కళ్ళున్న వాళ్లకు దీపం లేకుండా పనికాదు. వెలుగు లేకుండా కనబడదు. వెలుగు వస్తువులపైన పడి పరావర్తనం చెందితే తప్ప మన కంటి కటకాలు నేత్రపటలానికి బయటి చిత్రాల్ని చేరవేయ లేవు, అవి మెదడుకి చేరనూ లేవు. చూపుకు దీపం కావాలి. కంటికి వెలుగు కావాలి. ఇది ప్రకృతి నియమం!

ఆధ్యాత్మిక లోకంలోనూ ఈ నియమం వర్తిస్తుంది. మనిషి మనో నేత్రాలకు వాక్యమే వెలుగు! చుట్టూ పాప పంకిల లోకం. ఆ లోకంలో పాప ప్రభావ ఛాయల్లో బ్రతుకుతున్న మనం. మన మనసులూ, మస్తిష్కాలూ ఈ పాప ఘాతానికి గురైనవే. మంచిచెడ్డల తెలివి వస్తుందని దేవుడు వద్దన్న చెట్టు కాయలు తిన్నాడు మనిషి (ఆది.3.4-6). మంచి చెడ్డల తెలివి సంగతి పక్కన పెడితే ఆనాటి నుంచి మనిషి చెడుకు బానిసైపోయాడు (రోమా 5.12,14). ఈ బానిసత్వం నుంచి క్రీస్తు మనిషిని విడిపించాక కూడా పాపం మనిషిని ప్రభావితం చేయడం మానలేదు (రోమా 7.14-25).

ఇందువల్లనే మన మార్గం మనకు బాగానే తోస్తుంది. మన ఆలోచనలు మనకు మంచిగానే అనిపిస్తాయి. మన నిర్ణయాలు మనకు న్యాయంగానే అగుపిస్తాయి. కానీ వాటి పర్యవసానాలు చాలా సందర్భాల్లో ఆశించినట్టు ఉండకపోగా అవి మనల్ని అమాంతం మింగేస్తాయి కూడా (సామె.14.12; 16.25; 21.2). ఐతే అసలైన మంచిచెడ్డలు దేవుడికి తెలిసినట్టుగా మరెవరికీ తెలియవు. ఎందుకంటే ఆయనే మంచికి మూలం (మార్కు 10.18; కీర్త.4.1; 85.13; 97.2; యెష.54.17; యోహా.17.25). అంతేకాదు, ఆయనే జ్ఞానానికి మూలం కూడా (సామె.1.7,32; నిర్గ.35.33; సామె.28.12,23). ఈ దేవుడి చెప్పుచేతల్లో బ్రతికినప్పుడే అసలైన మంచిచెడ్డల తెలివి మనకు అబ్బుతుంది. దేవుని వాక్యం మన మనసు నేత్రాల్ని వెలుగునిస్తుంది (కీర్త.19.8). వాక్య వెలుగు తప్పుదోవ పట్టకుండా మనల్ని కాపాడుతుంది (కీర్త.119.1-11).

“దినములు చెడ్డవి గనుక” ఈ లోకంలో బ్రతికేందుకు మనకు మంచిచెడ్డల జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం కావాలి (ఎఫె.5.15-17). ఆ జ్ఞానాన్ని పుట్టించేది, మన ఆత్మ నేత్రాల్ని వెలిగించేది దేవుని వాక్యమే (కీర్త.19.7; 111.10; 119.66). ఆయన వాక్యం మనకు శత్రువుల తెలివికి మించిన జ్ఞానం, బోధకుల ఉపదేశానికి మించిన జ్ఞానం, వృద్ధుల అనుభవానికి మించిన జ్ఞానం పుట్టిస్తుంది (కీర్త.119.97-100). వాక్యమిచ్చే ఈ జ్ఞానం లేకుండా ఈ లోకంలో మనం “క్రైస్తవులుగా” బ్రతకలేం.

లోక సంద్రంలో కొట్టుమిట్టాడే బ్రతుకు నావకు దరిని చూపే దీప స్థంభం వాక్యం. అది క్రైస్తవుడి జీవన దిక్సూచి. దేవుని వాక్యం క్రైస్తవుడి కరపుస్తకం. బ్రతుకు సమరంలో అతడికి మెలకువలు నేర్పే శిక్షణాలయం. లేఖనం వల్లనే నీతిలో శిక్షణ సాధ్యమవుతుంది (2 తిమో.3.16). లేఖనాలు బ్రతుకు పాఠాలు నేర్పుతాయి (కీర్త.119.102,104). లేఖనాల బడిలో నేర్చుకున్న క్రైస్తవుడు అపవాది శోధనల్ని తిప్పికొడతాడు (మత్త.4.4-11); లోకం పోకళ్ళకు ఎదురీదుతాడు (రోమా 12.2); తన జీవితాన్ని కడదాకా నిలబెట్టుకుంటాడు (మత్త.7.24-27); స్వతంత్రించే సత్యజ్ఞానాన్ని పొందుతాడు (యోహా.8.31-32).

క్రైస్తవులు అనుదినం లేఖనాల్ని పఠించి, పాటించాలి. దినమంతా వాటిని ధ్యానించాలి (కీర్త.119.97). పగలు రేయి మనం ప్రభువు మాటను ధ్యానించాలి (కీర్త.1.2). పడక మీద కూడా ధ్యానం చేయాలి (కీర్త.4.4). దేవుని వాక్యాన్ని మనం నిత్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన పిల్లలకు నేర్పుతూ ఉండాలి. మన సంభాషణల్లో వాక్యాన్ని చర్చిస్తూ ఉండాలి. వాక్యాన్ని మన కనుల ముందు ఉంచుకుని బ్రతకాలి (ద్వితి.6.6-9). అపుడే దేవుని వాక్యం మన నరనరాల్లో ప్రవహిస్తుంది (హెబ్రి.4.12). వాక్యం ఒంటబట్టినప్పుడే బ్రతుకు పరమార్థం ఒంటబడుతుంది. వాక్యం మన బ్రతుకు బాటకు వెలుగు. మన జీవన దీపం (కీర్త.119.105). ఈ దీపంతోనే మన మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన బ్రతుకుల్ని వెలిగించుకోవాలి. మన క్రైస్తవ బ్రతుకులు భద్రంగా ఉండాలి అంటే ఈ వాక్య దీపం ఆరకుండా చూసుకోవాలి!

“కొందరు దీపాల్ని తమ వెనుక మోస్తారు. తమ నీడల్ని ముందుకు వేసుకుంటారు. అందుకే దారి తప్పుతారు” అన్న విశ్వకవి ఠాగూర్ మాటలు ఇక్కడ ప్రస్తావనీయం. నిజమే, వాక్య దీపాన్ని వెనక్కు నెట్టేసే క్రైస్తవుడు దారితప్పుతాడు. అతడి బ్రతుకు బాట అగమ్యంగా, అగోచరంగా, అస్తవ్యస్తంగా, ఆశనిపాతంగా మారిపోతుంది!

—జీపీ