
క్రైస్తవ ఇంగితం!
Friday, May 10, 2024
“నీకు ఉపదేశము చేసెదను నీవు నడవ వలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను బుద్ధి జ్ఞానములు లేని గుఱ్ఱము వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి …”
— కీర్తనలు 32:8-9
“ఇంగితం” లేక “ఇంగిత జ్ఞానం” మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. ఇంగ్లిష్ లో దీన్ని “కామన్ సెన్స్” అంటారు. ఇది మనుషులందరికీ అందుబాటులో ఉంటుంది గనుక దీన్ని అలా పిలిచారు. సృష్టిలో జంతువులకు లేని ఇంగిత జ్ఞానం మనిషికి దొరికింది. దేవుని పోలికలో పుట్టిన మనిషికి ఇది సహజంగానే అబ్బింది. ఇంగిత జ్ఞానం దేవుని పోలికలో అంతర్భాగం. అందుకే దేవుడు ఇంగిత జ్ఞానానికి వ్యతిరేకి కాదు.
నేను మీకు ఉపదేశం చేసేటప్పుడు, బోధించేటప్పుడు మీకు నేను ఇచ్చిన సహజ బుద్ధిని ఉపయోగించండి, జంతువుల్లా ఉండకండి అంటున్నాడు మన దేవుడు(కీర్త.32.8,9). అద్భుతం చేయమని తనని అడిగిన సద్దూకయ్యులు, పరిసయ్యులకు జవాబిస్తూ మీరు ఆకాశాన్ని చూసి వర్షం పడుతుందో లేదో ఇంగిత జ్ఞానంతో వివేచించే మీరు దేవుని సూచనలను ఎందుకు వివేచించలేక పోతున్నారని దుయ్యబట్టారు ప్రభువు (మత్త.16.1-3). దేవుని విషయాల్లో కూడా ఇంగితం ఉపయోగించాలని ఆయన పరోక్షంగా చెప్పారు. వాక్యానికి భాష్యం చెప్పడంలో, తన ప్రత్యర్థులకు జవాబివ్వడంలో ప్రభువు ఎంత హేతుబద్దంగా మాట్లాడారో మత్తయి సువార్త ఇరవై రెండో అధ్యాయం చదివితే తెలుస్తుంది (22.15-46).
వాక్యం చదివేటప్పుడు, దేవుని విషయాలు అర్థం చేసుకొనేటప్పుడు మనకు ఆత్మ దేవుని సాయం తప్పనిసరిగా కావాలి (1 కొరిం.2.14-16). ఆత్మ దేవుని వెలిగింపు లేకుండా వాక్య లోతులు అర్థం చేసుకోవడం కల్ల. పరిశుద్ధాత్మ జ్ఞానం లోక జ్ఞానానికి అతీతంగా ఉంటుంది (1 కొరిం.2.4-8). కానీ ఇంగిత జ్ఞానానికి వ్యతిరేఖంగా ఉండదు. ఎందుకంటే ఇంగిత జ్ఞానాన్ని ప్రభువే సృష్టించారు. ఆ ఇంగిత జ్ఞానాన్ని దేవుని విషయాలను వివేచించేందుకు ఉపయోగించమనీ ప్రభువే చెప్పారు (మత్త.16.3).
దేవుని విషయాల్ని అర్థం చేసుకోవడానికి ఆత్మ దేవుడు విశ్వాసి “మనసు”ని వెలిగిస్తాడు. ఈ మనసు పుట్టుకతో వచ్చిందే. మనం తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఇచ్చిందే (కీర్త.139.13). ఐతే ఈ మనసును పాపం ప్రభావితం చేసింది. అందుకే దేవుని వాక్యం మన మనసుల్ని కడగాలి (హెబ్రీ.4.12). అలా కడగాలి అంటే వాక్యాన్ని అధ్యయనం చేయడంలోనూ, ధ్యానం చేయడంలోనూ మనసుని ఉపయోగించాలి. “మనసు” లేకుండా ధ్యానం, అధ్యయనం, పఠనం సాధ్యం కాదు కదా!
మనం “పూర్ణ మనస్సుతో దేవుడ్ని ప్రేమించాలి, సేవించాలి” అన్నది దైవాజ్ఞ (ద్వితి.4.9; 5.29; 10.12; 11.18; మత్త.22.37). “మనస్సుతో ప్రేమించడం, సేవించడం” అంటే మనస్సును ప్రభువు కోసం, ప్రభువు మహిమార్థం ఉపయోగించడం. ఒక వ్యక్తిని అర్థం చేసుకోకుండా సరిగా ప్రేమించలేం. ప్రేమించకుండా సరిగా సేవించలేం. వాక్య ప్రార్థనల ద్వారా దేవుని స్వరూపాన్ని, సంకల్పాన్ని అర్థం చేసుకోవడంలో “మనస్సు” పాత్ర కీలకం!
పరిశుద్ధాత్మ మన మనసును వెలిగిస్తాడు. పరాయి ఆత్మ మనసుని కబళిస్తుంది. గెరాసేనుల దేశస్థుడు సేన దయ్యాలు పట్టడం వల్ల మానసిక స్వస్థత కోల్పోయాడని వాక్యం చెబుతోంది (మార్కు 5.15). మనం స్వస్థ బుద్ధి గల ఆత్మనే పొందాం అని కూడా వాక్యం స్పష్టం చేస్తోంది (2 తిమో.1.7). మూల భాషలో ఇక్కడ స్వస్థ మనస్సు లేక జ్ఞానయుక్తమైన మనస్సు అని ఉంది. ఆత్మ దేవుడు మన సహజ మనసుల్ని స్వస్థపరిచి వాడుకుంటాడు. అందుకే పరిశుద్ధాత్మ ప్రభావం క్రింద ఉన్న విశ్వాసులు స్వేచ్ఛను అనుభవిస్తారు (2 కొరిం.3.17). అపవాది ఆత్మ మన మనసుల్ని చెరపడుతుంది (2 తిమో.2.24), చెరుపుతుంది కూడా (2 కొరిం.11.3).
ఈ వివేచన మనకు చాలా అవసరం. నేడు కొన్ని సంఘాల్లో ఆత్మ పేరిట విచక్షణ లేని ఒళ్ళు తెలియని భావావేశంతో నడుస్తున్న ఆరాధనలు, ఆర్భాటాలు చూస్తున్నాం. అరుపులు, కేకలు కూడా వింటున్నాం. ఇవి పరిశుద్ధాత్మ కార్యాలు కావు. ఆత్మ కార్యాలు “ఇంగితం కొల్పోయినట్టుగా” ఉండవు. క్రైస్తవుని మనస్సు “ఆత్మ వెలిగించిన” మనస్సు. అది క్రీస్తు మనస్సు(1 కొరిం.2.16). ఈ మనస్సు లేని వారు దేవుని ఉపదేశాన్ని, నడిపింపును ఎన్నటికీ గ్రహించలేరు.
—జీపీ