“ఈ హేతువుచేత పరలోకము నందును, భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని…”
—ఎఫె. 3:14
పరమ తండ్రే మనకు ఆదర్శం!

పరమ తండ్రే మనకు ఆదర్శం!
Sunday, June 16, 2024
“ఈ హేతువుచేత పరలోకము నందును, భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని…”
— ఎఫె. 3:14
కుటుంబ బాధ్యతల్లో తండ్రి పాత్ర అత్యంత కీలకమైంది, ప్రాముఖ్యమైంది కూడా. జాతి నిర్మాణంలో కుటుంబ పాత్ర మౌళికమైంది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. ఆ పౌరులు కుటుంబంలోనే తయారవుతారు. ఆ కుటుంబానికి రథసారథి తండ్రి. నాయకుడైనా, నేరస్తుడైనా కుటుంబం నుంచే రావాలి. నీతి నిజాయితీ ఉన్న పౌరులైనా, నీతిమాలిన సంఘవిద్రోహ శక్తులైనా కుటుంబం నుంచే వస్తారు. కుటుంబంలో తండ్రి ఎలాంటి పాలన చేస్తాడు అన్నదాని మీదే పిల్లల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. తండ్రి బాధ్యత అంత గురుతరమైనది. దేశానికి ఆయువుపట్టు కుటుంబం ఐతే కుటుంబానికి ఆయువుపట్టు తండ్రే!
అటువంటి తండ్రులు ఎలా నడచుకోవాలి, ఎలా పాలించాలి, ఎలాంటి పాత్ర పోషించాలి అన్న వాటికి ప్రమాణమేంటి? ప్రేరణ ఏంటి? “మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు” అన్నారు ప్రభువు తన శిష్యులతో (మత్త.23:9). దీనర్థం అసలు లోకంలో ఎవ్వరూ తండ్రులు లేరని కాదు. ఇక్కడ మనుష్యులు స్వయానా తమ గౌరవార్థం ఇచ్చుకునే బిరుదుల గురించి చెబుతున్నాడయన. బిడ్డలు దేవుడిచ్చే బహుమానాలైతే తండ్రి స్థానం కూడా దేవుడిచ్చే వరమే కదా! (కీర్త.127.3). ఆధ్యాత్మిక తండ్రులైనా, శారీరక తండ్రులైనా దేవుడివ్వనిదే ఆ స్థానానికి ఎవ్వరూ అర్హులు కారు. ఎంచేతనంటే, దేవుడొక్కడే తండ్రులందరికీ మూల తండ్రి. ప్రతి ఒక్కరి జన్మకు కారకుడు ఆయనే (అపో.17.27; కీర్త.89.47).
పరలోక తండ్రిని గౌరవించే పిల్లలు ఇహలోక తండ్రిని కూడా గౌరవిస్తారు. ఇహలోక తండ్రిని గౌరవించని బిడ్డలు పరలోక తండ్రిని గౌరవించనట్టే!
దూతల సృష్టి గానీ, మానవుల సృష్టి గానీ జరగక మునుపే దేవుడున్నాడు. ఆయన త్రియేక దేవుడు. ఆయనలో కుటుంబం ఉంది. ఆయనది ఆది కుటుంబం. అందుకే ఆ త్రియేక దేవత్వంలోని దైవిక వ్యక్తులకు “తండ్రి”, “కుమార” అన్న కుటుంబ బిరుదులున్నాయి. తండ్రి తత్త్వం ఇక్కడి నుండే ఆరంభమైంది. అందువల్ల సమస్త కుటుంబాల్లోని తండ్రులందరికీ ఆయనే ఆదర్శం, స్ఫూర్తి కూడా (ఎఫె.3.14). తండ్రులందరూ తమ నడవడినీ, నిర్దేశకత్వాన్నీ ఆ పరమ తండ్రి తత్త్వం నుంచే నిర్వచించుకోవాలి, నిర్థారించుకోవాలి. అదే ప్రమాణం, ప్రేరణ!
మన దేవుడు పరమ తండ్రి. ఆయన మనల్ని పట్టించుకునే తండ్రి. మన గురించి నిత్యం చింతించే తండ్రి (1 పేతు.5.7). క్రైస్తవ తండ్రులు కూడా తమ పిల్లలను పట్టించుకునే తండ్రులుగా ఉండాలి. పిల్లల బాగు చూసుకునే శ్రద్ధాసక్తులు వారికి ఉండాలి. ముఖ్యంగా పిల్లలకు సమయమిచ్చే తండ్రుల అవసరం ఈ రోజుల్లో ఎక్కువ.
మన దేవుడు పోషించే తండ్రి (మత్త.6.26,30). క్రైస్తవ తండ్రులు ఆ పరమ తండ్రిని అనుకరించాలి. పిల్లల పోషణ, సంరక్షణ ప్రాథమికంగా తండ్రిది. పిల్లల అవసరాలు అతనికి ముందుగానే తెలియాలి (మత్త.6.32). పిల్లలకు కావలసిన వాటిని (కోరిన వాటినల్లా కాదు) తండ్రి సమకూర్చాలి. అందుకు తండ్రి కష్టించి పని చేయాలి (నిర్గ.20.9). మన పరలోకపు తండ్రి ఇంకనూ పని చేస్తున్నాడు (యోహా.5.17). ఇహలోకపు తండ్రులు సైతం ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలి.
మన పరమ తండ్రి ఎపుడు ఇచ్చినా శ్రేష్టమైన బహుమానాల్ని, సంపూర్ణమైన వరాలనే ఇస్తాడు. అలా ఇవ్వడంలో ఆయన ఇంచుకంత కూడా తటపటాయించడు (యాకో.1.17). ప్రతీ తండ్రి తన శక్తి కొలదీ తన బిడ్డలకు మంచి చేయాలి. దీనర్థం తన బిడ్డలకు ఖరీదైన బైకో, ఐఫోనో, స్మార్ట్ వాచో ఇవ్వమని కాదు. తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం తన శక్తులన్నీ ఒడ్డి బంగారు బాట వేయాలి.
తండ్రులందరూ తమ నడవడినీ, నిర్దేశకత్వాన్నీ ఆ పరమ తండ్రి తత్త్వం నుంచే నిర్వచించుకోవాలి, నిర్థారించుకోవాలి.
మన దేవుడు తన బిడ్డల్ని నిత్యం ప్రేమించే తండ్రి. ఆ ప్రేమలో భద్రత కూడా ఉంది (మత్త.23.37). మనల్ని భరించి, మోసే తండ్రి ఆయన (ద్వితి.1.31; కీర్త.68.19; యెష.40.11; 46.4). క్రైస్తవ తండ్రులు సైతం తమ బిడ్డల్ని నిత్యం ప్రేమిస్తూ వారి బరువు బాధ్యతల్ని మోసే వారిగా ఉండాలి. వారి భవితకు భద్రత కల్పించే వారే గాక వారిని లోకం ఉచ్చుల నుంచి, అపవాది తంత్రాల నుంచి నిత్యం కాపాడే వారిగా ఉండాలి (సామె.14.26,27). పిల్లలు సన్మార్గంలో నడవడం తండ్రికి సంతోషానివ్వాలి (3 యోహా.1.4).
మన దేవుడు మనల్ని క్రమశిక్షణ చేసే తండ్రి (హెబ్రి.12.7; సామె.3.11,12). మనం బాగుపడాలని పరమ తండ్రి మనల్ని శిక్షిస్తాడు (2 సమూ.7.14). ఆ శిక్షణ మనకు మేలు చేస్తుంది (సామె.6.23). ఐతే ఆయన శిక్షణలో సైతం ఆయన కృప మనల్ని విడిచిపోదు (2 సమూ.7.15). పిల్లల్ని ఇలాంటి కృపాసహితమైన క్రమశిక్షణ చేయడం క్రైస్తవ తండ్రులు పరలోక తండ్రి దగ్గర నేర్చుకోవాలి. పట్టరాని కోపంతో పిల్లల్ని కొట్టడం కాకుండా వాళ్ళ బాగు కోరి ప్రేమ పూర్వక ఉద్దేశ్యంతో పిల్లల్ని దండన చేయడం నేటి తండ్రులు నేర్చుకోవాలి (సామె.13.24; 22.6).
మన పరమ తండ్రి తన బిడ్డల తప్పులను క్షమించే తండ్రి కూడా. ఆయన పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో పశ్చాత్తాపంతో ఉన్న పాపిని అంతగా అక్కున చేర్చుకునే తండ్రి (లూకా 15.17-20). క్రైస్తవ తండ్రులు పరలోక తండ్రి పాదాల వద్ద నేర్చుకోవాలి. ఆయన క్షమా గుణాన్ని తామూ ఒంట పట్టించుకోవాలి. క్రమశిక్షణ లేని ప్రేమ ఎంత ప్రమాదకరమో, ప్రేమలేని క్రమశిక్షణా అంతే ప్రమాదకరం. తప్పు చేసిన బిడ్డల్ని దూరం చేసుకోకూడదు. వాళ్ళని తండ్రి ప్రేమ పూర్వకంగా సరిదిద్దాలి.
మరో పక్క క్రైస్తవ పిల్లలు తమ తండ్రులను గౌరవించడం, వారికి విధేయత చూపడం నేర్చుకోవాలి (ఎఫె.6.1,2). మన తండ్రిని మనం గౌరవిస్తున్నాం అనడానికి మన విధేయతే గీటురాయి. ఇది ఫాదర్స్ డే తో సరిపెట్టుకునేది కాదు. తనకు విధేయత చూపని తన బిడ్డలను దేవుడు ఎలా మందలిస్తున్నాడో చూడండి. “కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా…నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? …” (మలా.1:6). పరలోక తండ్రిని గౌరవించే పిల్లలు ఇహలోక తండ్రిని కూడా గౌరవిస్తారు. ఇహలోక తండ్రిని గౌరవించని బిడ్డలు పరలోక తండ్రిని గౌరవించనట్టే. ఎందుకంటే మన ఇహలోక తండ్రిని గౌరవించమని ఆదేశించింది మన పరలోక తండ్రే! అలా గౌరవించే బిడ్డలే ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు!
—జీపీ