
WRITINGS from Sickbed
ప్రభువు బడిలో ప్రార్ధనా పాఠాలు
Thursday, June 19, 2025
[ఆయన] శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులుకలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను
— హెబ్రీ. 5:7
ఏసుక్రీస్తు వారు ప్రార్ధించే విషయంలో సైతం మనకొక అంతిమ మాదిరి, ఆదర్శం. ఆయన లాంటి ప్రార్ధనా పరుడు మనకి బైబిల్లో గానీ క్రైస్తవ సంఘచరిత్రలో గానీ కానరాడు. ఆయన నేర్పించిన “పరలోక ప్రార్ధన” లేక “ప్రభువు ప్రార్ధన” ఇప్పటికీ మన ప్రార్ధనలకు ప్రమాణమే. ఆయన ప్రార్ధనలో చిత్తశుద్ధీ, ఆయన ప్రార్ధించే తీరూ, ఆయన సమర్పణా భావం, తండ్రి పట్ల ఆయన ప్రదర్శించిన భయభక్తులూ, ఆయన విధేయతా, ప్రార్ధన ద్వారా ఆయన పొందిన శక్తీ, ఆయన సాధించిన విషయాలూ… అన్నీ మనకు ఆదర్శనీయమే. క్రీస్తు ప్రార్ధనా జీవితాన్ని ఒక్క వాక్యంలో సంక్షిప్తం చేస్తూనే సుస్పష్టం చేసిన వచనం ఇది. ఇది ఆయన గేత్సేమనేలో చేసిన ఛిట్టచివరి ప్రార్ధనను మాత్రమే ప్రతిబింబించే వచనం కాదు. ఆయన ముప్పై మూడున్నరేళ్ళ ప్రార్ధనా జీవితానికి అద్దం పట్టే వచనమిది. “శరీరధారియై యున్న దినములలో” అన్న హెబ్రీ రచయిత మాటల్లో ఈ విషయం స్పష్టమవుతుంది. క్రీస్తు ప్రార్ధనా జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు చాలానే ఉన్నాయి.
“శరీరదారియై యున్న దినములలో…” ఈ మాట క్రీస్తు మానవత్వాన్ని సూచించే మాట. ప్రభువు గురించి మనం క్రొత్త నిబంధనలో ఎప్పుడు చదివినా ఆయన్ను అది “దైవ మానవుని”గా మన కనుల ముందు ఆవిష్కరిస్తుందన్న సత్యాన్ని మనం ఎన్నడూ మరువకూడదు. అంటే కొత్త నిబంధనలో కొన్ని వచనాలు ఆయన దైవత్వాన్ని మరికొన్ని వచనాలు మానవత్వాన్నీ సూచిస్తున్నాయని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడైన క్రీస్తు ప్రార్ధించడం లేదు. దేవుడు ఎవరికీ ప్రార్ధించనక్కర లేదు. దేవుడొక్కడే. అందరూ ఆయనకి ప్రార్ధించవలసిందే. ఇక్కడ మనిషిగా అవతరించిన క్రీస్తు (తన తండ్రికి) ప్రార్ధిస్తున్నాడు. త్రియేక దేవత్వం అర్ధంకాని వారికి ఈ సత్యం బోధపడదు.
ప్రార్ధన చేసుకోవడం మానేసి ఎవరి దగ్గరికో వెళ్లి ప్రార్ధన చేయించుకోవాలి అన్న తాపత్రయం పెరిగిపోతోంది. ప్రార్ధన కూడా ఒక వ్యాపారంగా మారిపోయిన దుష్ట దినాలివి.
ఇక్కడ ప్రభువు ప్రార్ధిస్తున్న తీరు మనకు ఆదర్శనీయం. “మహా రోదనముతోను కన్నీళ్లతోను” అన్న మాటలు ఆయన ప్రార్ధనా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. ఆయన ప్రార్ధనలోని చిత్తశుద్ది, తృష్ణ, గుండెచప్పుడు మనకి ఇక్కడ కనపడతాయి, వినబడతాయి. ఇది ఆయన గుండె లోతుల్లోంచి పెల్లుభికే ప్రార్ధన. పైపై పెదాల పైన వల్లెవేసే ప్రార్ధన కాదిది. ఆయన బావోద్రేకాలతో సహా ఆయన నిజాయితీకి అద్దంపట్టే ఒంటరి ప్రార్ధన ఇది. చర్చి మైకుల్లో చేసే ప్రార్ధనకూ, మహా సభల్లో అరిచి అరిచి చేసే ప్రార్ధనలకూ, బహిరంగ సభల్లో బూడిద చల్లుకొని చేసే ఉపవాస ప్రార్ధనలకూ, ప్రభువు అలవర్చుకున్న ఈ ప్రార్ధనా శైలికి ఎంతో వ్యత్యాసం ఉంది.
ప్రభువు చూపించిన ఈ ప్రార్ధన వైఖరి నేడు సగటు క్రైస్తవుని జీవితంలో కరువైపోయింది. అసలు ఏకాంత ప్రార్ధనే కనుమరుగైపోతోంది. ప్రార్ధన చేసుకోవడం మానేసి ఎవరి దగ్గరికో వెళ్లి ప్రార్ధన చేయించుకోవాలి అన్న తాపత్రయం పెరిగిపోతోంది. ప్రార్ధన కూడా ఒక వ్యాపారంగా మారిపోయిన దుష్ట దినాలివి. అందుకే మనం ఒకసారి తలెత్తి ప్రభువు ప్రార్ధన జీవితాన్ని నిశితంగా తేరి చూసి ఆయన బడిలో ప్రార్ధన పాఠాలు మళ్ళీ నేర్చుకోవాలి.
ప్రార్ధనలో మనల్ని మనం దేవునికి ఇచ్చివేసుకోవడం నేర్చుకున్నప్పుడే ఆయన కోసం మనం ఈ లోకంలో మన సిలువ నెత్తుకొని ఆయనను అనుసరించగలం.
మన ప్రభువు “ప్రార్ధనలనూ యాచనలనూ” చేసారని ఈ వచనం చెబుతోంది. రచయిత ఇక్కడ భిన్నమైన గ్రీకు పదాలు వాడారు. అవి రెండూ ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం ఉన్న పదాలైనప్పటికీ వాటి అంతరార్ధంలో కాస్త వ్యత్యాసం ఉంది. ప్రార్ధన వినయంతో చేసే ఒక విన్నపం లేదా ఒక వినతి పత్రం. యాచన ఒక అవసరం తీరడానికి ఎదుటివారి దయా దాక్షిణ్యాల కోసం ప్రాధేయపడడం. ఇక్కడ కూడా ప్రభువు ప్రార్ధనా తీరుతెన్నులు మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఆయన ప్రార్ధనలో ఎంత దీనుడై వినమ్రుడై అర్థిస్తున్నాడో మనకు ఇట్టే అర్ధమవుతుంది. ఈ దీనత్వం వినమ్రత కూడా నేటి మన ప్రార్ధనల్లో కరువైపోయాయి. దీనత్వం వినమ్రత లేనిదే ఏ ప్రార్ధనా దైవ సన్నిదిలో అంగీకారం పొందదు. అసలు ఆ లక్షణాలు లేని ప్రార్ధనకు అర్ధమే లేదు. క్రైస్తవులంతా మళ్ళీ క్రీస్తు బడిలో ఈ ప్రార్ధనా పాఠాలు నేర్చుకోవలసిందే. అందుకే “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” (1 పేతు 5:5) అని రాయబడింది. “సమర్పించి…” క్రీస్తు ఇక్కడ తండ్రికి “సమర్పించాడు” అని రాస్తున్నాడు రచయిత. ఇక్కడ మనందరి పక్షాన రక్షణ కార్యం సాధించడానికి, మన పాపానికి పరిహారం చేయడానికి దేవుడు ఎన్నుకున్న ఒక నిత్య ప్రధాన యాజకుడు క్రీస్తు అని మనం గుర్తించాలి. ఇదే హెబ్రీ పత్రికలోని వాక్య సందర్భం. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన, మేల్కిసేదేకు క్రమము చొప్పున వచ్చిన, నిత్యమూ ఉండే ప్రధాన యాజకుడు అయినప్పటికీ (హెబ్రీ 7:26;5:6,9) ఆయన ప్రార్ధనలో తన్ను తాను సమర్పించుకున్నాడు.
“సమర్పించుకోవడం” అంటే మనల్ని మనం ఇచ్చివేసుకోవడం. ఆయన ప్రార్ధనలో కేవలం ప్రార్ధనలనూ యాచనలనూ మాత్రమే సమర్పించలేదు. ఆయన తనను తానే ఇచ్చివేసుకున్నాడు. కనుకనే ఆయన సిలువలో దేవునికి అంగీకార యోగ్యమైన ఆత్మ త్యాగాన్ని, పరిపూర్ణ బలియాగాన్ని చేయగలిగాడు. ఆయన ప్రార్ధనా జీవితం అంతా ఆ సిలువ త్యాగానికి సిద్దపాటే. ప్రార్ధనలో మనల్ని మనం దేవునికి ఇచ్చివేసుకోవడం నేర్చుకున్నప్పుడే ఆయన కోసం మనం ఈ లోకంలో మన సిలువ నెత్తుకొని ఆయనను అనుసరించగలం. ఇతరులను సిలువ వేయబడిన క్రీస్తు వైపు ఆకర్షించగలం కూడా. అక్షరాలా ఈ మాటలే ప్రభువు చెప్పడం మనం యోహాను సువార్తలో చూస్తాం. విశ్వసించే ప్రతివాడూ నశించకుండా, నిత్య జీవం పొందాలంటే తాను సిలువపైకి ఎత్తబడాలనీ, అలా జరిగినప్పుడే ఈ భూమ్మీద తాను తన వద్దకి అందరినీ ఆకర్షించుకుంటానని ప్రభువు సెలవిచ్చారు(యోహాను 3:15;12:32).
నేటి క్రైస్తవుల్లో ప్రస్పుటంగా కనపడే పాపమిదే—దేవుని పట్ల భయం లేకపోవడం.
ప్రభువు ప్రార్ధనలో ప్రస్పుటమయ్యే మరో విశేషం— ఆయన భయభక్తులు గల జీవితం! ఇది భక్తితో కూడిన భయం, పిరికితనం కాదు. ప్రభువు డిక్షనరీలో పిరికితనానికి చోటులేదు. అంటే తన తండ్రి పట్ల క్రీస్తుకున్న ఒక గౌరవప్రధమైన భయమన్నమాట. నేటి క్రైస్తవుల్లో ప్రస్పుటంగా కనపడే పాపమిదే—దేవుని పట్ల భయం లేకపోవడం. దైవ భీతి లేనిచోట పాప భీతీ ఉండనేరదు. దైవ భీతి లేని క్రైస్తవులు మన సంఘారాధనల్లోనూ, సహవాసాల్లోనూ, సభల్లోనూ, ప్రార్ధనా సమావేశాల్లోనూ తరచూ కనబడుతూనే ఉంటారు. చర్చిలో కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడేవాళ్ళూ, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టుకుంటూ లైకుల కోసం చూసే వాళ్ళూ, పాస్టర్ గారు ప్రసంగిస్తూ ఉండగా పక్కవాళ్ళతో ముచ్చట్లు చెప్పేవాళ్ళూ మనకు కనబడుతూనే ఉంటారు. ఇంకా విచిత్రమేంటంటే, వేదికపై కూర్చున్న దైవజనులు సైతం ప్రసంగం నడిచేటప్పుడు కబుర్లాడుకోవడం, సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం వంటివి. వీళ్ళు దేవుని సన్నిది అంటే బొత్తిగా భయం లేని క్రైస్తవ వింత జీవులు. ప్రార్ధనా జీవితం లేని క్రైస్తవ భక్తాగ్రేసరులు వీళ్ళు.
మన ప్రభువు సాక్షాత్తూ జనదైక దైవ కుమారుడై ఉండి ప్రార్ధనలో భయభక్తులు నేర్చుకున్నాడు. అందువల్లనే ఆయనను తండ్రి అంగీకరించాడని రాయబడింది (హెబ్రీ 5:7). ఎక్కడున్నా దేవుని సన్నిధిని గౌరవించే దేవుని భయం క్రైస్తవులకు ఎప్పుడు అలవడుతుందో అప్పుడే ప్రభువు కూడా వారిని అంగీకరిస్తాడు. తనను ఘనపరచని వానిని ఆయన ఘనపరచడు (1 సమూ. 2:30). ప్రార్ధనా జీవితాన్నీ, భయభక్తులు గల జీవితాన్నీ వేరుచేసి చూడలేం. అవి రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. ప్రభువు బడిలో మనం నేర్చుకోవలసిన మరో ప్రార్ధనా పాఠమిది. ప్రభును పూజించే ప్రతి క్రైస్తవునికీ ప్రభువు లాంటి ప్రార్ధనా జీవితం అలవడును గాక!
—జీపీ
