
సత్యారాధన!
Saturday, May 11, 2024
“మీరు మీకు తెలియని దానిని ఆరాధించు వారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము”
— యోహాను 4:22
సమరయ స్త్రీతో సంభాషణలో ప్రభువు చెప్పిన మాట ఇది. సమరయులు తెలియక ఆరాధిస్తారని, యూదులు తెలిసి ఆరాధిస్తారని చెప్పారాయన. అజ్ఞానం ఆరాధనకు గొడ్డలి పెట్టు. అది దేవుడ్ని అపార్థం చేసుకుంటుంది. ఆ అపార్థం దేవుడ్ని తప్పుగా ఊహించుకోవడానికి ఊతమిస్తుంది. అలా అజ్ఞానం ఆరాధనను పేలవంగా మార్చడమే గాక, దాన్ని పక్కదోవ పట్టించి చివరికి విగ్రహారాధనకు నడిపిస్తుంది. ఇదంతా తెలియకుండానే జరిగిపోతుంది. దేవుడ్ని తప్పుగా ఊహించుకోవడమే విగ్రహారాధనకు పునాది. అటు యూదుల చరిత్ర, ఇటు సమరయుల చరిత్ర ఈ సత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సమరయులకూ, యూదులకూ మధ్య వైరం క్రీస్తు కాలం నాటిది కాదు. దానికి క్రీస్తుకు పూర్వమే పునాది పడింది. అందుకు రాజకీయ, సామాజిక కారణాలున్నాయి. అందువల్ల యూదుల లేఖనాల్ని (పాత నిబంధనను) సమరయులు తిరస్కరించి కేవలం మోషే రాసిన ఐదు కాండాలనే దైవ వాక్కుగా స్వీకరించారు. క్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడే నాటికి వారి దగ్గర కేవలం ఈ మోషే రాసిన ఐదు పుస్తకాలే ఉన్నాయి. అంచేతనే ప్రభువు, “అమ్మా, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు” అన్నారు. వాక్యం లేనపుడు దేవుని గురించిన జ్ఞానం కూడా ఉండదు. ఈ అజ్ఞానమే సమరయులను విగ్రహారాధనకు నడిపించింది (2 రాజు.17.24-41). వాక్య లేమి వల్ల ఏర్పడ్డ ఇదే అజ్ఞానం ఇజ్రాయెల్ ప్రజల్ని బంగారు దూడ చేసుకుని విగ్రహ పూజ చేయడానికి కారణమయ్యింది (ద్వితి.32). మోషే అప్పటికి ఇంకా ధర్మ శాస్త్రాన్ని ప్రజలకు ఇవ్వలేదు.
నేటి క్రైస్తవ ప్రపంచంలో జరిగే సామూహిక ఆరాధనలు చూస్తుంటే వాక్యానుసారమైన దేవుని జ్ఞానం ఎంత కొరవడిందో ఇట్టే అర్థమైపోతుంది. ఆరాధన నడిపే వారిలో అనేకులకు సంగీత సాహిత్య జ్ఞానం లేదు అన్న విషయం పక్కన పెడితే, లేఖనాలకు అనుగుణమైన దేవుని జ్ఞానం లేకపోవడం అత్యంత శోచనీయమైన విషయం. దేవుడ్ని దేవుడిగా గుర్తించి అందుకు తగ్గట్టుగా గౌరవించడమే ఆరాధన (కీర్త.29.2). అందుకు ఏ మాత్రం తగ్గినా అది విగ్రహారాధనే! (రోమా 1.21). దేవుడ్ని “సత్యంతో ఆరాధించాలి” అని ప్రభువు తెగేసి చెప్పారు (యోహా.4.24). “వాక్యమే సత్యం” అని కూడా ఆయనే చెప్పారు (యోహా.17.17). వాక్యం తెలియకుండా దేవుడు తెలియడు. దేవుడు తెలియకుండా ఆరాధించడం కుదరదు. వాక్యం తెలియని క్రైస్తవులు దేవుడ్ని ఎలా ఆరాధించ గలరు? వాక్య జ్ఞానం లేని వర్షిప్ లీడర్లు దైవారాధనలో ప్రజల్ని ఎలా నడిపించ గలరు? వాక్యం చెప్పలేని బోధకులు వర్షిప్ సెంటర్లు ఎలా నడపగలరు? ఇక మనకీ సమరయులకీ తేడా ఏంటి?
క్రీస్తు వాక్యం మీలో సంపూర్ణంగా జీవించినపుడే మీరు “సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము” చేయగలరని పౌలు సెలవిస్తున్నాడు (కొల.3:16). నిజమైన ఆరాధన వాక్యంలోని క్రీస్తును మనం జీర్ణించుకున్నపుడు పుడుతుంది. అంతేకాదు, మన ఆరాధనా గీతాల్లోని సంగీతం, సాహిత్యం క్రీస్తును ప్రతిబింబిస్తుంది, ప్రస్తుతిస్తుంది. ఆయనకు పట్టం కడుతుంది. మన ఆరాధనా గీతికలు ఆయన వాక్యం నుంచి పుట్టుకొస్తాయి. “యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను” అంటున్నాడు కీర్తనకారుడు (కీర్త.119:54). ఇటువంటి ఆరాధన దేవుడ్ని ప్రసన్నం చేస్తుంది. ఇలాంటి సత్యారాధకుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు (యోహాను.4.23).
—జీపీ