
WRITINGS from Sickbed
సువార్త కోసం…
Tuesday, June 24, 2025
అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, తుదముట్టింప వలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు.
— అపొ. 20:24
పౌలు తన సుదీర్ఘ సువార్త జైత్ర యాత్రలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాడు. అతని జీవితం, పరిచర్య కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మిలేతు పట్టణం చేరుకున్న పౌలు ఆ విషయం గ్రహించి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారితో ఆయన మాట్లాడిన మాటలు చాలా గంభీరమైనవి, బరువైనవి. అక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళాల్సిన పౌలు అక్కడ తనకోసం కాచుకుని ఉన్న బంధకాలను, శ్రమలను ఆత్మ ద్వారా తెలుసుకుని ఈ మాటలు చెప్తున్నాడు (అపొ. 20:23). సువార్త కోసం సాక్ష్యమివ్వడంలో, ప్రభువు తనకప్పగించిన పరిచర్యను పరిపూర్తి చేయడంలో తన ప్రాణాన్ని సైతం ప్రియమైనదిగా ఎంచుకోనని చెప్తున్నాడు పౌలు. నేటి దైవజనుల్లో ఇంతటి అంకితభావం త్యాగనిరతి ఎంత మేరకు కనబడుతోంది అన్నది ప్రశ్న!
పబ్బం గడుపుకోడానికి ప్రభువు పనిలోకి వచ్చిన సేవకులు నేడు కోకొల్లలు. ప్రభువుని ప్రేమించి ఆయన పిలుపు అందుకుని వచ్చిన పరిచారకులు అరుదు. దేవుడు, ఆయన పరిచర్య పట్ల పౌలుకున్న ఈ కాంక్ష, తపన, తృష్ణ, అంకిత భావం ఒక్క పది మంది సేవకులకున్నా మన దేశాన్ని వారి సువార్త పరిచర్య అనూహ్యంగా ప్రభావితం చేసేదేమో! అలాంటి పరిచర్య ఈ పాటికి మన దేశాన్ని ఎంతగా ఆశీర్వదించేదో ఊహించలేం.
“పిలిచినవాడు లేకుండా పిలుపులేదు”
“సువార్త గూర్చి నేను సిగ్గుపడువాడను కాను” అంటాడు పౌలు రోమా పత్రికలో (రోమా. 1:16). “సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి” అంటాడు మళ్ళీ అదే పత్రికలో (రోమా. 10:15). “క్రీస్తు నామమెరుగని చోట్ల సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై” ఉన్నాను అంటాడు మరోచోట (రోమా. 15:20). “అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ” అంటాడు కోరింథీ పత్రికలో (1 కోరింథీ. 9:16). “మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు” అని గలతీయులతో మాట్లాడతాడు (గల. 4:13). సువార్త గురించి పౌలు ఇంతగా ఎందుకు తపిస్తున్నాడు?
పౌలుకు క్రీస్తూ తెలుసు, క్రీస్తు సువార్త విలువా తెలుసు. నిజానికి ఈ రెంటినీ వేరు చేయలేం. క్రీస్తునెరగని వాడికి సువార్త విలువ తెలియదు. క్రీస్తు ఎరుకలో బ్రతికేవాడు సువార్త చెప్పకుండా ఉండలేడు. దాని విలువను తగ్గించనూ లేడు. పరాయి సంగతులతో సువార్తను కల్తీ చేస్తున్న నేటి బోధకులెందరో! క్రీస్తునెరుగని బోధకులకు సువార్త విలువ గానీ, దాని విశిష్టత గానీ, అందులోని శక్తి గానీ తెలియనే తెలియదు. అందుకనే వారు అనవసరమైన అరుపులూ, కేకలూ, హంగులూ, ఆర్బాటాలూ సువార్తకు జోడిస్తుంటారు. ఈ ఆకర్షణలన్నీ సువార్తకు అక్కరలేదు. సువార్త తనంతటతానే శక్తివంతమైనది. అది నశించే వానిని రక్షించగల దేవుని శక్తి (రోమా 1:16;1 కొరింథీ 1:18). ఎందుకంటే సువార్తే క్రీస్తు, క్రీస్తే సువార్త. క్రీస్తు వ్యక్తిత్వం, పరిచర్యల సమాహారమే సువార్త (1 కొరింథీ 15:3-5;1:24). కలపకుండా, చెరపకుండా క్రీస్తు విశిష్టతను ఇతరులకు వివరించడమే సువార్త. సువార్తకు పరాయి ఆకర్షణలు అక్కరలేదు. సువార్త ఆకర్షణ క్రీస్తే! క్రీస్తు నెరుగుటయే నిత్య జీవం అని క్రీస్తే సెలవిచ్చారు (యోహా. 17:3).
పౌలు దీనిని “కృపాసువార్త” అని పిలుస్తున్నాడు (అపో. 20:24). నిజానికి ఈ సువార్తని వినడానికి కానీ, దాని వల్ల (వి)ముక్తిని పొందడానికి కానీ ఏ మనిషికీ అర్హత లేదు. ఏ భేదం లేదు ప్రతి మనిషీ పాపం చేసి దేవునితో ఉన్న మహిమాన్విత సంబంధాన్ని పోగొట్టుకున్నాడు (రోమా. 3:23). అయితే దేవుడు సమస్త మానవాళి రక్షణార్ధం తన కృపా మహదైశ్వర్యంలో సువార్త ప్రణాళికను రచించాడు. క్రీస్తులో దాన్ని నెరవేర్చాడు. అందుకే దానిని కృపా సువార్త, క్రీస్తు సువార్త అని పిలిచాడు పౌలు.
ప్రభువుతో గడిపే వాడికే తాను చేయాల్సిన ప్రభువు పనేంటో అవగతమవుతుంది. ప్రభువుతో సహవాసం, పరిచర్యా పిలుపు విడదీయలేనివి.
సువార్త నిజంగానే శుభవార్త! అది సంస్కృతిని పాడు చేసేదికాదు, మరింత సంస్కరించేది. అది మత మార్పిడి కోసం కాదు, మనిషిని మంచి మనిషిగా మార్చేది. అది రక్త పాతానికి దారి తీసేది కాదు, క్రీస్తు సిలువ రక్తం ద్వారా సర్వ శాంతిని నెలకొల్పేది. ఆది స్వేచ్చను హరించదు, స్వేచ్చా జీవితాన్ని ప్రసాదిస్తుంది. అది అసత్యాలతో మభ్య పెట్టదు, సత్యంతో మనిషిని వెలిగిస్తుంది. సువార్త పతితులను పునీతులుగా చేస్తుంది; అవినీతిపరులని నిజాయితీపరులుగా మారుస్తుంది; దొంగలను దొరలుగా చేస్తుంది; హంతకులను దయార్ద్ర హ్రుదయులుగా మారుస్తుంది; భయస్తులకు అభయాన్నిస్తుంది; పాపిని క్షమిస్తుంది; అపరాధికి మనశ్శాంతి నిస్తుంది; మరణం తర్వాత కూడా మరణం లేని మంచి బ్రతుకునిస్తుంది; సువార్త అందరి శ్రేయస్సుని కోరేది; సమాజాల్ని బాగు చేసేది; దేశ ప్రగతికి పునాదులు వేస్తుంది. అందుకే మనం స్వచ్చమైన సువార్త ప్రకటించడానికి పౌలులా కంకణం కట్టుకోవాలి. ఆయన లాంటి కాంక్షను అలవర్చుకోవాలి.
సువార్త బాధ్యతను పౌలు తనంతట తాను భుజానికెత్తుకోలేదు. అలాగని నేటి బోధకుల్లో కొందరిలా జీవనోపాధి కోసమో, వ్యాపారం కోసమో సువార్త పనిని నెత్తికెత్తుకోలేదు పౌలు. సువార్త పని పౌలుకు “ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య” (అపో. 20:24). దమస్కు మార్గంలో విన్న ఈ క్రీస్తు పిలుపు పౌలు జీవన లక్ష్యంగా మారిపోయింది. మిలేతు నుండి యేరుషలెంకు వెళ్ళిన పౌలు అగ్రిప్ప రాజుకు ఈ విషయాన్నే తెగేసి చెప్పాడు. ఆ పరలోక పిలుపుకు తాను అవిధేయుణ్ణి కాలేనని సంకెళ్ళతో రాజు ముందు నిలబడి నిర్భయంగా చెప్పేశాడు (అపో 26:19).
పౌలు జీవితంలో పరిచర్యకు ఇంధనం ప్రభువుతో అతనికున్న అనుబందమే.
“పిలిచినవాడు లేకుండా పిలుపులేదు” అన్నారు క్రైస్తవ మేధావి ఆస్ గిన్నిస్. పిలిచిన ప్రభువుని ఎరుగని వారికి ప్రభువు పిలుపులో స్పష్టత ఉండదు. ప్రభువుతో గడిపే వాడికే తాను చేయాల్సిన ప్రభువు పనేంటో అవగతమవుతుంది. ప్రభువుతో సహవాసం, పరిచర్యా పిలుపు విడదీయలేనివి. మనకు నచ్చిందీ, మనకు తోచిందీ చేయడం పరిచర్య కాదు. ఇతరులను చూసి కాపీ కొట్టి చేసేది అసలు పరిచర్యే కాదు. ప్రభువు చెప్పింది మాత్రమే చేసేది పరిచర్య. పిలుపున్న సేవకునికి తాను ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసిపోతుంది. అతడు కీర్తి దాహానికి, ధనాశకు, జనాకర్షణకు లొంగడు. అతనికి తన ప్రభువే ముఖ్యం. ఆయన చెప్పిందే వేదం.
పౌలు తన సువార్త పరిచర్యలో పరుగులు తీసానంటున్నాడు (అపో 20:24). ఈ పరుగు కీర్తి కోసమో, ధనం కోసమో, జనం కోసమో కాదు. ఈ పరుగు కేవలం తన ప్రభువు కోసం! “ప్రభువు ప్రేమ మమ్ములను బలవంతపెడుతోంది” అంటున్నాడు పౌలు (2 కొరింథీ 5:14). బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, … సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను (1 కోరింథి 1:17) అని కూడా చెప్పాడాయన. పౌలు జీవితంలో పరిచర్యకు ఇంధనం ప్రభువుతో అతనికున్న అనుబందమే. అదే అతడ్ని చివరిదాకా పరిచర్యా పిలుపుకు కట్టుబడి ఉండేలా నిలబెట్టింది.
ప్రభువుతో గడిపే వారు పరిచర్యలో అలసిపోరు. ప్రభువుతో అనుబంధమే వారి పరిచర్యకు ఇంధనం. ప్రభువు మాటే వారి సేవకు ప్రమాణం. ప్రభువు పిలుపే వారికి శిరోధార్యం. ప్రభువు ప్రేమే వారికి స్పూర్తి. వాళ్ళు నిస్వార్ధంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా సేవ చేస్తారు. నిఖార్సైన సువార్తను ప్రకటిస్తారు.
—జీపీ

P J VIJAYAKAR