గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.

భయం మధ్య అభయం

ఈ కీర్తన చిన్న పిల్లలకు కూడా సుపరిచితమే. కంటత వాక్యాల్లో కూడా తరచూ వింటూ ఉంటాం. మనలో అనేకమందికి ఇది బాగా కంఠత వచ్చిన కీర్తన కూడా. ఆరు వచనాలున్న ఈ కీర్తనలో ఈ ఒక్క నాల్గో వచనం తప్ప అన్ని మనల్ని ఆదరించి, పురికొల్పి, వెన్నుతట్టి, ప్రోత్సహించి, బలపరిచే సానుకూల వచనాలే. నాల్గవ వచనం అకస్మాత్తుగా కీర్తన మధ్యలో తటస్థించి జీవితములోని ఒక ప్రతికూల పరిస్తితి గురించి మాట్లాడుతుంది. అదే “గాడాంధకారపు లోయ”. ఈ కీర్తన కవితా దోరణిలో ఉంది గనుక ఈ కవితాత్మక అంతరార్ధాన్ని మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. బైబిల్ పరిభాషలో చీకటి, గాడాంధకారం, లోయ వంటి పదాలకు అర్ధం ఒక శ్రమ కావొచ్చు, ఒక కష్టం కావొచ్చు, ఒక కీడు కావొచ్చు, ఒక భయం కావొచ్చు, ఒక ఉపద్రవం కావొచ్చు, చివరికి మరణపుటంచులలో ప్రయాణించే ఒక అనుభవం కావొచ్చు.

దేవుడు లేని ఆశీర్వాదాలు

వృత్తిరీత్యా గొర్రెల కాపరి ఐన దావీదు తనను గొర్రెగా, దేవుడ్ని తన కాపరిగా ఊహించుకుని రాసుకున్న ఒక అద్భుతమైన కవిత ఈ కీర్తన. ఇక్కడ కాపరి, గొర్రె అన్నవి కవితాత్మకంగా చెప్పిన ఊహా చిత్రాలు, పోలికలే తప్ప వాస్తవానికి దేవుడొక గొర్రెల కాపరి, మనం గొర్రెలం కాదు. ఈ కీర్తన మనకు ఎంత సుపరిచితమో అంతగా ఇందులోని అంతరార్థాన్ని మనం ఆకళింపు చేసుకోలేకపోయాం అన్నది నిజం. నిజానికి మన క్రైస్తవ లోకంలో వల్లె వేసే కంఠత వాక్యాలు చాలా మట్టుకు కంఠం దాటి హృదయం దాకా వెళ్లవేమో అనిపిస్తుంది. వాక్యాన్ని సుపరిచితం చేసుకోవడం అంటే వచనాలు కంఠత పెట్టడం మాత్రమే కాదు అందులోని అంతరార్థాన్ని అవలోకనం చేసుకుని, ఆచరించడం అని మనం తెలుసుకోవాలి.

ఆయన సన్నిధిని వెతకండి

“దేవుడి పేరిట చేసే కార్య్రమాల కంటే దేవుడి సన్నిధే ప్రాముఖ్యం”. దేవుడి నామాన్ని రోషంగా ప్రకటిస్తూ, నేటి క్రైస్తవ సంఘ దుస్థితిని ఏడు దశాబ్దాలకు ముందే చెప్పి హెచ్చరించిన దైవజనుడు ఐడెన్ విల్సన్ టోజర్ అన్న మాటలివి. నేటి క్రైస్తవంలో మన కళ్ళెదుట కనబడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన హెచ్చరికలు మన కోసమే అనిపిస్తుంది. నేటి క్రైస్తవంలో సభల జోరు, సంఘాల్లో కార్యక్రమాల హోరు ఎక్కువయ్యింది. వీటిలో పాల్గొనడమే ఆధ్యాత్మికత అని తలంచే భ్రమలోకి చాలామంది వెళ్ళిపోయారు. చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న సభలు దేవుని చిత్త ప్రకారమే జరిగిస్తున్నామా, వాటి పైన ఆయన ప్రసన్నత ఉందా అన్న విషయం ఎవ్వరికీ పెద్దగా పట్టట్లేదు. వీటిలో పాల్గొంటే చాలు ఆశీర్వాదం దానంతట అదే వచ్చేస్తుంది అన్నది అనేకుల అపోహ.