ప్రభువు బడిలో ప్రార్ధనా పాఠాలు, ఏసుక్రీస్తు వారు ప్రార్ధించే విషయంలో సైతం మనకొక అంతిమ మాదిరి, ఆదర్శం. పూజించే ప్రతి క్రైస్తవునికీ ప్రభువు లాంటి ప్రార్ధనా జీవితం అలవడును గాక!

ప్రభువు బడిలో ప్రార్ధనా పాఠాలు

ఏసుక్రీస్తు వారు ప్రార్ధించే విషయంలో సైతం మనకొక అంతిమ మాదిరి, ఆదర్శం. ఆయన లాంటి ప్రార్ధనా పరుడు మనకి బైబిల్లో గానీ క్రైస్తవ సంఘచరిత్రలో గానీ కానరాడు. ఆయన నేర్పించిన “పరలోక ప్రార్ధన” లేక “ప్రభువు ప్రార్ధన” ఇప్పటికీ మన ప్రార్ధనలకు ప్రమాణమే. ఆయన ప్రార్ధనలో చిత్తశుద్ధీ, ఆయన ప్రార్ధించే తీరూ, ఆయన సమర్పణా భావం, తండ్రి పట్ల ఆయన ప్రదర్శించిన భయభక్తులూ, ఆయన విధేయతా, ప్రార్ధన ద్వారా ఆయన పొందిన శక్తీ, ఆయన సాధించిన విషయాలూ… అన్నీ మనకు ఆదర్శనీయమే. క్రీస్తు ప్రార్ధనా జీవితాన్ని ఒక్క వాక్యంలో సంక్షిప్తం చేస్తూనే సుస్పష్టం చేసిన వచనం ఇది. ఇది ఆయన గేత్సేమనేలో చేసిన ఛిట్టచివరి ప్రార్ధనను మాత్రమే ప్రతిబింబించే వచనం కాదు. ఆయన ముప్పై మూడున్నరేళ్ళ ప్రార్ధనా జీవితానికి అద్దం పట్టే వచనమిది.

ఆయన సన్నిధిని వెతకండి

“దేవుడి పేరిట చేసే కార్య్రమాల కంటే దేవుడి సన్నిధే ప్రాముఖ్యం”. దేవుడి నామాన్ని రోషంగా ప్రకటిస్తూ, నేటి క్రైస్తవ సంఘ దుస్థితిని ఏడు దశాబ్దాలకు ముందే చెప్పి హెచ్చరించిన దైవజనుడు ఐడెన్ విల్సన్ టోజర్ అన్న మాటలివి. నేటి క్రైస్తవంలో మన కళ్ళెదుట కనబడుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పిన హెచ్చరికలు మన కోసమే అనిపిస్తుంది. నేటి క్రైస్తవంలో సభల జోరు, సంఘాల్లో కార్యక్రమాల హోరు ఎక్కువయ్యింది. వీటిలో పాల్గొనడమే ఆధ్యాత్మికత అని తలంచే భ్రమలోకి చాలామంది వెళ్ళిపోయారు. చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న సభలు దేవుని చిత్త ప్రకారమే జరిగిస్తున్నామా, వాటి పైన ఆయన ప్రసన్నత ఉందా అన్న విషయం ఎవ్వరికీ పెద్దగా పట్టట్లేదు. వీటిలో పాల్గొంటే చాలు ఆశీర్వాదం దానంతట అదే వచ్చేస్తుంది అన్నది అనేకుల అపోహ.