AD 304 ఏప్రిల్ 26
మార్సెలినస్ (సుమారుగా క్రీ.శ. 250–260 మధ్య జననం, 304లో మరణం) రోమ్ నగరంలో ఉంటూ బిషప్గా సేవలందించారు. ఈయన జీవించిన కాలంలో క్రైస్తవ సంఘం గొప్ప విశ్వాసంపై ఆధారపడినది. అప్పట్లో సంఘం ఆది అపొస్తలుల అసలైన బోధలను పాటించడమే ప్రధానంగా ఉండేది. ఇప్పటి కేథలిక్ సంప్రదాయాలు, ఆచారాలు ఆ కాలంలో ఇంకా ఏర్పడలేదు. యేసు ప్రభువు మరియు అపొస్తలుల ఆది బోధలను అనుసరించిన విశ్వాసము, వ్యక్తిగత నిబద్ధత, సంఘబద్ధ ఆరాధన, వేదగ్రంథాలపై ఆధారపడటం ప్రధానంగా ఉండేవి. అయితే అప్పటి రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులపై తరచూ హింస జరుగుతూ ఉండేది. క్రీ.శ. 304లో రాజు డయోక్లిషియన్ కాలంలో క్రైస్తవులపై అత్యంత ఘోరమైన హింస మొదలైంది. ఈ సమయంలో మార్సెలినస్ తన విశ్వాసాన్ని వదలకుండా, ఎంత హింస పెట్టినా రోమన్ విగ్రహాలకు మ్రొక్కలేదు.
వినయ విధేయ విశ్వాసం
నేటి క్రైస్తవంలో చాలా మంది విశ్వసించడమంటే మతం పుచ్చుకోవడమో, బాప్తీస్మం తీసుకోవడమో, నిర్ధారణ తీసుకోవడమో లేక స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో ప్రార్థన చేయించుకోవడమో అనుకుంటున్నారు. దానికి తోడు మన అయ్యగార్ల ప్రసంగాలూ అలానే ఉన్నాయి. విశ్వాసమంటే పూర్తిగా ఆధారపడటం, ఆనుకుపోవడం. ఈ విశ్వాసం ఒక అయ్యగారి ప్రార్థన పైనో, ఆయన ఇచ్చే నూనె బుడ్డి పైనో, ఒక సంఘ నియమం పైనో, ఒక సిద్ధాంతం పైనో కాదు. ఈ విశ్వాసం ఒక విలక్షణమైన వ్యక్తి పైన! దేవునికి నరునికి మధ్య ఉన్న అనంత అగాధాన్ని పూడ్చ గల్గిన దైవమానవుడైన క్రీస్తు పైన. దేవునికి మనిషికి మధ్య ఉన్న పాప గోడను కూల్చ గల్గిన సిలువ వేయబడిన క్రీస్తు పైన. మనిషిని పాపమరణాల దాస్యం నుండి విడిపించ గల్గిన మృత్యుంజయుడైన క్రీస్తు పైన. విశ్వాసానికి కారకుడు, దాన్ని పరిపూర్తి చేసేవాడూ ఐన క్రీస్తు పైనే మన విశ్వాసం (హెబ్రీ.12.1). ఈ విశ్వాసమే మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది (1 యోహా.2.1-2).