పాపం—పశ్చాత్తాపం, ఆత్మ స్పృహ , “ప్రతీ పాపం దేవుణ్ణి తన సర్వాధికార పీఠం నుంచి పడదోయడానికి చేసే విఫల యత్నం.” ,

పాపం—పశ్చాత్తాపం

నేడు పాపం గురించి మాట్లాడే బోధకులే కరువైపోయారు పాపం! కొందరికి పాపం గురించి మాట్లాడితే కోపం! క్రైస్తవ భక్తి జీవనంలో పాపం గురించిన స్పృహ కీలకమైంది. బైబిల్ తన మొదటి పేజీల్లోనే పాప ప్రస్తావన చేసింది. మనిషికున్నంత ఆత్మ స్పృహ (తన గురించిన ఎరుక) మరి ఏ జీవికీ ఈ భూమ్మీద లేదు. దేవుడు మనిషిని తన పోలికలో సృజించినప్పుడే అతనికి ఈ ఆత్మ స్పృహ సహజంగా అబ్బింది. ఇదే మనం తప్పిదాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే అంతః సాధనం.

మన చిత్తం vs దేవుని చిత్తం

చాన్నాళ్ల క్రితం ఇంగ్లీష్ క్రైస్తవ మేధావి సి. ఎస్. లూయిస్ ఒక మాటన్నారు. “నరకంలో పాడుకునే పాట ఒక్కటే—నా చిత్తమే సిద్ధించింది కదా—అని.” నిజమే. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచే వాళ్ళు పరలోక రాజ్యంలో చేరలేరు. నా తండ్రి చిత్తం చేసే వాళ్ళే పరలోకం చేరతారు—అని మన ప్రభువు ముందే చెప్పారు (మత్త.7.21). విశ్వాసికి అవిశ్వాసికి ఇదే తేడా. అవిశ్వాసి తన ఇష్టానుసారం జీవిస్తాడు. నిజమైన విశ్వాసి ప్రభువు చిత్తానుసారం జీవిస్తాడు (ఎఫెసి 6.6). దేవుని చిత్తం జరిగించే వాడే నా వాడు—అన్నారు ప్రభువు (మార్కు 3.35).