ప్రభువునెరిగిన భక్తి
యోబుకు కష్టాలు ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చి పడ్డాయి. ఆస్తి నష్టమే కాదు, ఆరోగ్యమూ ఆవిరైపోయింది. బిడ్డల్ని పోగొట్టుకున్న కడుపు కోత పిండేస్తోంది. ఆదరించాల్సిన స్నేహితులు అనరాని మాటలు అంటున్నారు. భార్య సహకారం అంతంత మాత్రమే. అంతటి భాగ్యవంతుడు, భక్తుడు ఒక్కసారిగా ఏకాకి అయిపోయాడు. దేవుడు కూడా వదిలేశాడా అనిపించే నిరాశ, నిస్పృహ ఆవహిస్తున్న పరిస్థితి. కానీ యోబులో ఆశ చావలేదు. అతనిలోని భక్తుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అతని విశ్వాసం అంతరించి పోలేదు. అతడు దేవుడ్ని అనుమానించ లేదు. “నా విమోచకుడు సజీవుడు” అంటున్నాడు. ఆయన్ని “నేను ఎరుగుదును” అంటున్నాడు. నా చర్మం చివికిపోయినా సరే, ఈ దేహంలోనే ఆయన్ను చూస్తాను. నా మట్టుకు నేనే చూస్తాను. నా దేవుడ్ని నా కన్నులారా చూస్తాను. నా రక్షకుడు వస్తాడు. నా పక్షాన నిలుస్తాడు —అంటున్నాడు యోబు (19.25-27).
వినయ విధేయ విశ్వాసం
నేటి క్రైస్తవంలో చాలా మంది విశ్వసించడమంటే మతం పుచ్చుకోవడమో, బాప్తీస్మం తీసుకోవడమో, నిర్ధారణ తీసుకోవడమో లేక స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో ప్రార్థన చేయించుకోవడమో అనుకుంటున్నారు. దానికి తోడు మన అయ్యగార్ల ప్రసంగాలూ అలానే ఉన్నాయి. విశ్వాసమంటే పూర్తిగా ఆధారపడటం, ఆనుకుపోవడం. ఈ విశ్వాసం ఒక అయ్యగారి ప్రార్థన పైనో, ఆయన ఇచ్చే నూనె బుడ్డి పైనో, ఒక సంఘ నియమం పైనో, ఒక సిద్ధాంతం పైనో కాదు. ఈ విశ్వాసం ఒక విలక్షణమైన వ్యక్తి పైన! దేవునికి నరునికి మధ్య ఉన్న అనంత అగాధాన్ని పూడ్చ గల్గిన దైవమానవుడైన క్రీస్తు పైన. దేవునికి మనిషికి మధ్య ఉన్న పాప గోడను కూల్చ గల్గిన సిలువ వేయబడిన క్రీస్తు పైన. మనిషిని పాపమరణాల దాస్యం నుండి విడిపించ గల్గిన మృత్యుంజయుడైన క్రీస్తు పైన. విశ్వాసానికి కారకుడు, దాన్ని పరిపూర్తి చేసేవాడూ ఐన క్రీస్తు పైనే మన విశ్వాసం (హెబ్రీ.12.1). ఈ విశ్వాసమే మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది (1 యోహా.2.1-2).